Others

వ్యవసాయరంగ సంక్షోభంతో కర్షకులు కుదేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాము వ్యవసాయం చేస్తున్నామని రైతులు గర్వంగా చెప్పుకొనే రోజులుపోయి చాలా కాలమైంది. సేద్యంతో జీవనం సాగిస్తున్నానని చెప్పుకోవటానికి కర్షకులు సిగ్గుపడే పరిస్థితి ఎదురైంది. అయిదు ఎకరాల భూమి ఉన్న రైతు కుమారునికి కంటే నెలకు 5వేలు సంపాదించే బడుగు జీవుల పిల్లలకు పెళ్ళిళ్ళు కుదురుతున్నాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వ్యవసాయం చేయలేక అన్ని విధాలా విసిగిపోయిన రైతులు కాడి, మేడి వదిలేస్తుంటే ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల నేపథ్యంలో కంటితుడుపు ఉపశమన చర్యలు ప్రకటించడం దారుణం.
ఇప్పటికైనా రైతుకు నిజమైన భరోసా దక్కకపోతే భవిష్యత్తులో మొత్తం వ్యవసాయ రంగం మహాసంక్షోభంలో చిక్కుకుపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల ఆహార సంక్షోభం తలెత్తి తిండి గింజల కోసం జనం మొహం వాచే పరిస్థితి వస్తుంది. 1940-50 సంవత్సరాల మధ్యకాలంలో ఎవరైనా పెళ్ళికి వెళితే రేషన్ బియ్యాన్ని కూడా పట్టుకెళ్ళి పెళ్లివారికి ఇవ్వవలసి వచ్చేది. అలాంటి భయంకరమైన రోజులు మరలా రాకుండా ఉండాలంటే వ్యవసాయ రంగానికి గిట్టుబాటు ధరలను ఇవ్వాలి.
తల తాకట్టుపెట్టి తెచ్చిన పెట్టుబడులైనా తిరిగి వస్తాయో రావోనని కుమిలిపోయే దుస్థితి దేశం నలుమూలలా రైతాంగాన్ని కలవరపరుస్తోంది. గిట్టుబాటు ధరలు దక్కడం అంటే- రైతులు ఎండమావుల వెంట పరుగులు తీయాల్సి రావడమే. సేద్యంలో సంక్షోభానికి మూలకారణాలను డాక్టర్ స్వామినాథన్ తెలియజేసినా యూపీఏ సర్కారు పట్టించుకోలేదు. ఇప్పటికీ రోజూ దాదాపు రెండువేల మంది రైతులు కడగండ్లను భరించలేమంటూ ప్రత్యామ్నాయాల బాట పడుతున్నారు. దేశీయోత్పత్తిలో సేద్యరంగం వాటా ఒకప్పటి 43 శాతం నుంచి 13 శాతానికి పడిపోగా, వ్యవసాయంపై ఆధారపడి మనుగడ సాగించే జనం సంఖ్య 75నుండి 50 శాతానికి కుంగిపోయింది. ఈ ఒరవడి ఇలాగే కొనసాగితే దేశ ఆహార భద్రతకే పెనుముప్పు తప్పదన్న వివేచనతో, సేద్యం లాభదాయకతను పెంపొందించే మేలిమి సిఫార్సుల్ని డాక్టర్ స్వామినాథన్ లోగడే రూపొందించారు. సమగ్ర పంటల బీమా ఉండి తీరాలన్న ఆయన సిఫార్సుల స్ఫూర్తిని అందిపుచ్చుకొన్న మోదీ ప్రభుత్వం, ఆమధ్య జాతికి సంక్రాంతి కానుకగా నూతన పథకం ప్రకటించింది.
పెట్టుబడి, సాగునీరు, మార్కెట్ అనుసంధానత వంటి కీలకాంశాలను పరిగణనలోకి తీసుకొని రెండో హరిత విప్లవం ఆవిష్కరిస్తామన్న కేంద్రం- ‘గ్యాంగ్‌టక్ చింతన్’ ప్రతిపాదనలు కార్యాచరణ రూపం దాలుస్తామని భరోసా ఇస్తోంది. రైతుకు ఆదాయపు భద్రత విధానం అమలు కావాలంటూ గ్రామీణాభివృద్ధి సంస్థ ఇటీవలి జాతీయ సదస్సు సూచించింది. తొలుత రైతును బతికించుకుంటే, ఎన్నో సృజనాత్మక ప్రయోగాలకు అతడు సంసిద్ధుడవుతాడు. లాభసాటి సేద్యమన్నది కర్షకులకే కాదు జాతి ప్రగతికి సైతం అత్యంత కీలకమే. ఈ వాస్తవిక దృక్పథం బడ్జెట్లు, ప్రణాళికల్లో ప్రతిఫలిస్తేనే రైతాంగం కళ్ళు కాయలుకాచేలా నిరీక్షిస్తున్న విధానపరమైన పరివర్తన మొదలైనట్లు.
సేద్యానికయ్యే వాస్తవ వ్యయాన్ని కచ్చితంగా లెక్కకట్టి కనీసం యాభై శాతం మిగులు ఉండేలా సహేతుక మద్దతు ధరలు కల్పించాలన్నది స్వామినాథన్ సిఫార్సుల్లో ప్రధాన అంశం. భారత్‌తో పోలిస్తే రైతుల పట్ల ఇతర దేశాల ఔదార్యం, దిగుబడుల అద్భుతాలు మనకు సాక్షాత్కరిస్తాయి. చైనా సేద్య పద్ధతుల్ని సాంతం నవీకరించి, భూగర్భ జల వనరుల్ని పరిరక్షిస్తూ రైతుల రాబడిని ఇనుమడింపజేయడం ద్వారా సుస్థిరాభివృద్ధిని లక్ష్యంగా నిర్దేశించుకుంది. పల్లెల్లో సౌకర్యాలు పెంచి, గ్రామీణ సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న జపాన్ పర్యావరణ హితకరమైన సాగుపద్ధతులు పాటించే రైతాంగాన్ని అమితంగా ప్రోత్సహిస్తోంది. ప్రకృతి ఉత్పాతాలు సాగుదారుల ఆర్థిక స్థోమతను దెబ్బతీసే వీలు లేకుండా ప్రత్యేక సాయంతో ఆస్ట్రేలియా ఆదుకుంటోంది. మూడింట రెండొంతుల గ్రామీణ శ్రామికులకు వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఇతర కార్యకలాపాల్లో బతుకుతెరువు చూపుతున్న చైనా పేదరికాన్ని సమర్ధంగా నియంత్రిస్తోంది. అయిదోవంతు భూమి మాత్రమే వ్యవసాయ యోగ్యమైన ఇజ్రాయెల్ సేద్యాన్ని పరిశ్రమస్థాయికి చేర్చి ప్రపంచానే్న అబ్బురపరుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త కార్యాచరణ- రైతు జీవన భద్రతతో ముడిపడిన జాతి ఆహార భద్రతను కంటికిరెప్పలా కాపాడేలా చర్యలు తీసుకోవలసిన సమయం ఆసన్నమైంది.

-పుట్టా సోమన్న చౌదరి 94403 39682