AADIVAVRAM - Others

నక్కాశీ నుంచి నైరూప్యం వరకు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణలో కాన్వాసుపై కన్నా ముందు సిల్క్ వస్త్రంపై దేశీయ రంగులతో చిత్రాలు గీశారు. రాచరికం రోజుల నుంచి ఈ మాధ్యమంలో చిత్రకళ పరిఢవిల్లింది. ఇప్పటికీ ఆ వారసత్వం హైదరాబాద్ పాత నగరం (ఓల్డ్ సిటీ) దూద్‌బౌలి (పాలబావి) ప్రాంతంలోని ఓ వీధిలో కొంత కనిపిస్తుంది. ఆ వీధి పేరే ‘నక్కాశీగల్లీ’. నాజూకుతనం, నయనానందకరం, సృజనాత్మకత, నాణ్యత, నైపుణ్యం ఆ చిత్రాల్లో దర్శనమిస్తుంది. ఎలాంటి కల్మషం - కపటం లేని నిజాయితీ వారి పనిలో కనిపిస్తుంది. వివిధ మాధ్యమాల్లో వారు తమ ప్రతిభను ప్రదర్శించినా అపురూపమైనది మాత్రం సిల్క్ వస్త్రంపై చిత్రరచన చేయడం. సంప్రదాయ స్వదేశీ రంగులు, బ్రష్‌లతో సిల్క్ వస్త్రంపై అందమైన ప్రకృతి శోభ, పడతుల అమాయకత్వం, సోయగం, పల్లె జీవన శకలాలు ఆ చిత్రాల్లో కనిపిస్తాయి. తరతరాల ఈ చిత్రకళ ఇప్పటికీ కొనసాగుతూ రావడం అపురూపం.
అలాంటి నక్కాశీ చిత్రకారుల కుటుంబం నుంచి పాత కొత్త చిత్రకళ సంప్రదాయాలకు వారధిగా నిలిచి తన అస్తిత్వాన్ని బలంగా చాటుకునేందుకు ప్రయత్నిస్తున్న చిత్రకారిణి నక్కాశీ రమాదేవి. శతాబ్దాల నుంచి వస్తున్న నక్కాశీ చిత్రకారుల (కులం) నుంచి మోడ్రన్ ఆర్ట్ పాఠాలు బోధించే కళాశాల మెట్లెక్కిన తొలి మహిళ ఆమె కావడం విశేషం. ఆధునిక చిత్రకళ జగత్తులోని ధోరణులు, ఇజాలు, శైలి, మెలకువ, రంగుల రహస్యాలు తెలుసుకునేందుకు, అధ్యయనం చేసేందుకు ఆమె చొరవ చూపడం చారిత్రక అంశం.
ఓవైపు తాత ముత్తాతల నుంచి వంశపారంపర్యంగా వస్తోన్న సంప్రదాయ నక్కాశీ చిత్రకళ.. మరోవైపు పాశ్చాత్య దేశాల నుంచి సునామీలా వస్తున్న నైరూప్య చిత్రకళ.. రివైజాన్స్ అనంతరం ఎన్నో విప్లవాత్మక ధోరణులు పొడసూపిన రంగుల విస్ఫోటాన్ని అర్థం చేసుకునేందుకు ఆమె కృషి చేయడం గొప్ప సాహసమనే చెప్పాలి. సమకాలీన సమాజాన్ని ప్రతిబింబించే దేశీయ, పాశ్చాత్య పోకడలను పట్టుకోవడానికి, జీర్ణించుకోవడానికి ఆమె ఆరాటం ఎన్నదగింది.
పాతబస్తీలోని నక్కాశీ గల్లీలో రమాదేవి తల్లిదండ్రులు, దగ్గరి బంధువులు అందరిదీ రంగుల ప్రపంచమే. చిత్రకళ అక్కడ చిన్నతరహా పరిశ్రమగా చాలాకాలం కొనసాగిందంటే ఏ మాత్రం పొరపాటు అవదు.
ఉదయం లేవగానే నిష్టగా చిత్రరచనపై నిమగ్నమవడం, తమ మేధోశక్తిని అందుకే ఖర్చు చేయడం, సృజనకు మెరుగులు దిద్దడం, సౌందర్యోపాసకులుగా ఏకాగ్రతతో చిత్రకళను ఆరాధించడం.. ఆచరించడం అదో అపురూప దృశ్య మాలిక. వారి సమిష్టి కళా జీవితం.. జీవనం వారికి మరింత స్ఫూర్తిని అందించింది. ఈ తరం కొత్త వారికిది ఊహకందనిది. అయితే అనూచానంగా వస్తున్న ఈ చిత్రకళ చింతన రమాదేవి డిఎన్‌ఏలో కనిపిస్తుంది. ఆమె తన నానమ్మ నర్సమ్మ గారాలపట్టిగా పెరిగింది. నానమ్మ బొమ్మలు తయారుచేస్తుంటే చిట్టి చేతులతో సాయం అందించింది. నర్సమ్మ తయారుచేసే బొమ్మలు దీపావళికి పెట్టే ‘బొమ్మల కొలువు’ కోసం చాలామంది కొనుక్కునేవారు. నర్సమ్మ నైపుణ్యం, అణకువ రంగుల పోహళింపు, రాజసం, ఒద్దిక అన్నీ తనకు అబ్బాయని రమాదేవి భావన.
ఇంటి నిండా బొమ్మల తయారీ ముడిసరుకు, రంగులు, సిల్క్ వస్త్రాలు, కుంచెలు, అట్టలు, ట్రేసింగ్ షీట్లు కనిపించేవి. వివిధ మాధ్యమాల్లో చిత్రకళ రచన కొనసాగేది. రమాదేవికి అన్ని మాధ్యమాల్లో ఎంతో కొంత ప్రవేశం బాల్యంలోనే లభించింది. ఈ పునాదిపైనే ఆమె మాసాబ్ ట్యాంక్ వద్దగల ఫైన్ ఆర్ట్స్ కాలేజీ నుంచి 1995-2000 సంవత్సరం వరకు చిత్రకళలో బ్యాచిలర్ డిగ్రీ చేశారు. అక్కడ ఆమె ముందు మరో ప్రపంచం ఆవిష్కృతమైంది. చిత్రకళ గొడుగు కిందగల అనేక విభాగాల్లో పరిచయం కలగడమే గాక వాటిలో కొంతకాలం పని చేయడం తప్పనిసరి! ఇందులో శిల్పం సైతం ఉంది. బాల్యంలో బొమ్మల తయారీ చేసినప్పటికీ శిల్పం గూర్చిన అవగాహన నూతనమైనది. అంతేగాక స్టిల్ లైఫ్, లాండ్‌స్కేప్స్, స్కెచింగ్ ఉండటం వల్ల సంప్రదాయ చిత్రకళకు కళాశాలలో బోధించే వర్తమాన చిత్రకళకు గల తేడా అవగతమైంది. ఇందులో అప్లయిడ్ ఆర్ట్ విభాగం కూడా ఉండటంతో కంప్యూటర్, డిజిటల్ వేదికగా చిత్రకళ సంబంధిత అంశాల బోధన జరిగింది. దాంతో హృదయ వైశాల్యం పెరగడమే గాక అవగాహన శక్తి ద్విగుణీకృతమైంది. రినైజాన్స్ చిత్రకళ చరిత్ర తెలుసుకుని చైతన్యం పెల్లుబికింది. కవితాదేవస్కర్, అంజనీరెడ్డి లాంటి సీనియర్ ఫ్యాకల్టీ నేతృత్వంలో అపురూపమైన అంశాలెన్నో ఆమె మనోతెరపై రంగుల జల్లులై నిలిచిపోయాయి. తన చుట్టూ వున్న జీవితంపై డ్రాయింగ్స్ వేయమని అధ్యాపకులు ఆదేశిస్తే పాతబస్తీ పరిసరాలన్నీ కాగితంపైకి తర్జుమా అయ్యాయి. ఓల్డ్ సిటీది ప్రత్యేక నైసర్గిక పరిస్థితి. మసీదులు, సమాధులు, కమాన్లు, ఇరుకైన వీధులు, నవాబుల కాలంనాటి కట్టడాలు, శిథిలాలు, రిక్షాలు, ఆటోలు, కూలీలు, వృత్తి పనివారు, బురఖాలు ధరించే ముస్లిం మహిళలు, పెంకుటిళ్లు, మేకలు, ఆవులు, సాయెబులు, పూజారులు ఇలా సమస్తం కాగితంపై కనిపించింది. బాల్యం నుంచి చేసిన సాధనకు, ఈ సాధనకు గల వ్యత్యాసం - తేడా స్పష్టంగా అర్థమైంది. ఆ ‘మత్తు’ రుచి తెలిస్తేనే ముందుకు కదిలే అవకాశముంది. అలా ఆ ‘మత్తు’లో తనకు తెలియకుండానే అసంఖ్యాక డ్రాయింగ్స్ వేస్తూ పదిమంది మన్ననలు అందుకున్నారు.
ఐదు సంవత్సరాల అధ్యయనం తర్వాత మరిన్ని మెలకువలు తెలుసుకునేందుకు, తనదైన శైలిని ఏర్పరచుకునేందుకు వీలుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఎఫ్‌ఏ కోర్సులో 2001 సంవత్సరంలో చేరారు. అక్కడ డిఎల్‌ఎన్ రెడ్డి, శ్యామ్‌సుందర్ లాంటి ప్రముఖుల మార్గదర్శనంలో ‘పెయింటింగ్’లోని మార్మికతను అర్థం చేసుకోవడానికి మనసు పెట్టింది.
రమాదేవి ఈ ప్రయాణం వెనక ఆమె తండ్రి నక్కాశి చిత్రకారుడు, ఆధునిక చిత్రకళలో ప్రవేశమేగాక ప్రతిభావ్యుత్పత్తిగల యువరాజ్ ఉన్నాడు. అతని ప్రోత్సాహం నిరంతరం నీడలా కొనసాగింది. ఆయన స్వతహాగా చిత్రకారుడు కావడంవల్ల 1978 సంవత్సరంలో కర్ణాటకలోని గుల్బర్గాలోని ఐడియల్ ఫైన్ ఆర్ట్స్ ఇన్‌స్టిట్యూట్ నుంచి డిప్లొమా చేయడం కారణంగా చిత్రకళ ఔన్నత్యం, దాని ప్రాశస్త్యం తెలిసి తన కూతురు రమాదేవిలో ఆ ‘స్పార్క్’ను పసిగట్టి ముందుకు నడిపించారు. తాను డిప్లొమా దగ్గరే ఆగిపోతే తన కూతురు చిత్రకళలో స్నాతకోత్తర పట్టా అందుకోవాలని ఆశించారు. కొత్త తీరాలకు చేరుకోవాలని పరితపించారు. పర్యవసానమే రమాదేవి ఎంఎఫ్‌ఏ కోర్సు చేయడం.
రాజుల కాలంలో స్వయంవరం కోసం రాజకుమారి చిత్రాన్ని సిల్క్ గుడ్డపై నక్కాశి మాధ్యమంలో వేసే రోజులు కావివి.. పట్ట్భాషేకం సందర్భంగా పొరుగు రాజుకు స్వదేశీ రంగులతో పూలు - లతలతో కూడిన చిత్రాలతో ‘స్క్రోల్’పై శుభాకాంక్షలు పంపే కాలం కాదిది. అందుకే వర్తమాన చిత్రకళకు యువరాజ్ ప్రాధాన్యమిచ్చారు. ట్రేసింగ్ షీటుపై బొమ్మ గీసి, అవసరమైన ‘లైన్’లో సన్నటి రంధ్రాలు చేసి, అనంతరం దాన్ని సిల్క్ వస్త్రంపై అమర్చి, రంగులు అద్దాక, తర్వాత ఆ వస్త్రంపై ‘బ్యాగ్రౌండ్’లో రంగులు నింపి ఓ అందమైన చిత్రాన్ని రూపొందించే నక్కాశి నిర్మల్ సిల్క్ పెయింటింగ్‌లో ఆయన నిష్ణాతుడు. డ్రాయింగ్ ‘లైన్’లో కమాండ్ ఉండాలని గట్టిగా కోరుకుంటారు.
అదో అలాంటి చిత్రకళా ప్రేమికుడికి రమాదేవి 1975 జనవరిలో జన్మించింది. స్థానిక కస్తూరీబా పాఠశాలలో పదవ తరగతి వరకు చదివింది. ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోని వనితా మహావిద్యాలయ నుంచి ఇంటర్ పూర్తి చేసింది. ఆ తరువాత బిఎఫ్‌ఏ, ఎంఎఫ్‌ఏ కోర్సులు.. ఈ సమయంలోనే మహిళల సాధికారత కోసం తన కుంచెతోపాటు గొంతు కలిపారు. ‘ముక్త’ అనే మహిళల వేదిక కార్యక్రమాల్లో ఆమె పాల్పంచుకున్నారు. సమాజంలోని వివిధ సమస్యల పరిష్కారానికి సమర శంఖం పూరించాలని అంటారు. ఇదే అంశంతో ఆమె అనేక ‘శంఖు’ చిత్రాలను రచించారు. అది ఆమె చిత్రకళకు, ఆమె వ్యక్తిత్వానికి సంకేతంగా నిలుస్తోంది. అంతేగాక కత్తులను సైతం చిత్రించి నారీ - డమరుకం కావాలని కోరుకుంటోంది. ఆ భావనతోనే ఆమె మహిళా డమరుకం చిత్రాన్ని మిక్స్‌డ్ కలర్స్‌లో చిత్రించారు. ఆమె ఎక్కువగా మిక్స్‌డ్ కలర్స్ ఉపయోగించి చిత్రాలు వేసేందుకు ఇష్టపడతారు.
2018 సంవత్సరంలో తన చిత్రాలను ‘కళాభవన్’లో ప్రదర్శించారు. మహిళా చిత్రకారులతో కలిసి అనేక గ్రూపు చిత్రకళా ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ఇందుకుగాను అనేక ప్రశంసలు, అవార్డులు అందాయి. ప్రస్తుతం హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ సభ్యురాలిగా సేవలందిస్తూ, నక్కాశీ మహిళా సమాజం అధ్యక్షురాలిగా పని చేస్తోంది. గతంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో, ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో డ్రాయింగ్ టీచర్‌గా పని చేసిన రమాదేవి ప్రస్తుతం చార్మినార్ దగ్గర గల మైనార్టీ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు చిత్రకళను నేర్పుతున్నారు.
(రమాదేవి 79894 26384)

-వుప్పల నరసింహం 99857 81799