AADIVAVRAM - Others

రంగుల శ్రీమంతుడు రమావత్ శ్రీనివాస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్రకారులు తమ చుట్టూ ఉన్న జీవితాన్ని తమ ‘కళ’లో ప్రతిఫలింపజేస్తారు. ఈ లక్షణాన్ని బలంగా జీర్ణించుకున్న కొత్త తరం చిత్రకారుడు రమావత్ శ్రీనివాస్ నాయక్. లంబాడా సామాజిక వర్గం నుంచి వచ్చిన శ్రీనివాస్ నాయక్ లంబాడా మహిళల అందచందాలను, వారి జీవన సౌందర్యాన్ని, ఆహార్యాన్ని, కాన్వాసు పైకి సృజనాత్మకంగా, రసరమ్యంగా అద్దుతున్నారు. అద్భుత నైపుణ్యంతో ఎందరినో ఆకర్షిస్తున్నారు. గాఢమైన ప్రైమరీ రంగులు చూపరులను ఇట్టే పట్టేస్తాయి. వాటిని పొందికగా అమర్చి చిత్రకళా అభిమానులు నివ్వెరపోయేలా చేయడంలో ఆయన కృతకృత్యులయ్యారు.
ఇప్పటివరకు ఎందరో చిత్రకారులు లంబాడా మహిళలను చిత్రిక పట్టినప్పటికీ, పోట్రేట్స్ వేసినప్పటికీ, వారి ఆహార్యంపై శ్రద్ధపెట్టి చిత్తరువులు రూపొందించినప్పటికీ రమావత్ శ్రీనివాస్ నాయక్ గీసిన చిత్రాలు వాటన్నింటినీ తలదనే్నలా ఉండటం అబ్బురపరుస్తుంది. ఆ సామాజిక వర్గానికి చెందిన వాడు కావడమే గాక, ఆ జీవితాన్ని దగ్గరగా చూడటమే గాక సౌందర్య రాశులైన ఆ మహిళలను, వారి కళాత్మక ఆహార్యాన్ని తనదైన కోణంలో ప్రదర్శించాలన్న తీవ్రమైన తపన, ఆరాటం కారణంగా, చిత్రకళలో తనదైన ‘సిగ్నేచర్’ను కనబరిచారు. ఉత్సుకత, ఉత్సాహం కారణంగా ఆయన వేసిన.. వేస్తున్న చిత్రాలు చూపరులను సూదంటు రాయిలా ఆకర్షిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల చిత్రకళా ప్రపంచంలో ఓ కొత్త రంగుల గాలి గుమ్మటం రమావత్ శ్రీనివాస్ రూపంలో ఎగిరింది. వాస్తవిక (రియలిస్టిక్) దృష్టి కోణంతో గీసినా అందులో ఏదో మోతాదులో ఆధునికత దర్శనమిస్తోంది. అది క్యూబిజం కావచ్చు.. ఇంప్రెషనిజం కావచ్చు. వాటి ఛాయలు కనబడటం వల్ల ఆ బొమ్మలు కొత్తందాలను సంతరించుకుని కొలువుతీరాయి. లంబాడా మహిళలు ధరించే బళియా (గాజులు) పెటియా (లంగా), ఖళి (జాకెట్), టుఖ్రీ (చున్ని) ఇవన్నీ రంగులమయం. ఆ గాఢమైన రంగుల ఆహార్యాన్ని, ఆభరణాల్ని మరింత సృజనాత్మకంగా, సౌందర్యవంతంగా కాన్వాసు పైకి తీసుకు రావడంలో రమావత్ శ్రీనివాస్ నాయక్ ప్రతిభ కనిపిస్తోంది. నాణేలతో చేసిన ఉంగరాలు, పచ్చబొట్లు ఏదీ వదిలిపెట్టలేదు. నిర్జీవంగా కనిపించే అనేక వస్తువుల కాయన జీవం పోశారు. అడ్డదిడ్డంగా కనిపించే వాటికి అద్భుత దృష్టి కోణంలోకి తీసుకొచ్చారు. అవి జిగేల్‌మని ప్రైమరీ రంగుల్లో మెరవడంతో వాటి ‘డెప్త్’ పెరిగి శ్రీనివాస్ నైపుణ్యం తేటతెల్లమవుతుంది. సీతాఫలాలు చిన్న బుట్టలో పెట్టుకుని అమ్మే లంబాడా మహిళ చిత్రంలో కనిపించే అంశాలు ఆ తెగకు సంబంధించిన ప్రత్యేకతను పట్టి చూపుతోంది. మహిళ కూర్చున్న తీరు (పోశ్చర్) ముఖంలో కనిపించే భావాలు, ఆహార్యంలోని వైవిధ్యం, రంగుల పొందిక, ఆభరణాల సమతుల్యత ఓ సంపూర్ణ చిత్రంగా హృదయానికి హత్తుకుంటుంది. శ్రీనివాస్ ‘సిగ్నేచర్’కు ఆ చిత్రం చిహ్నంగా నిలుస్తోంది. ఇసుమంత గందరగోళం గాని, అదనపు రంగుల కోసం పడిన తొందరపాటు గాని, బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదో నింపాలన్న తాపత్రయం గాని లేకుండా ఆర్ట్‌ని సింప్లిఫై చేసి చూపిన వైనం స్పష్టంగా కనిపిస్తోంది. హంగులు, ఆర్భాటాలు లేని ఆ సాధారణ చిత్రం పలికే రంగుల భాష అసామాన్యం.
ఈ రకమైన కలర్ స్కీం, ఫ్రేమ్.. ఆయన గీసిన అనేక చిత్రాల్లో కనిపిస్తోంది. వాటిలో లంబాడా మహిళల జీవనశైలి, దిన చర్యలు దొంతరలుగా కనిపిస్తాయి. వారికే ప్రత్యేకమైన తీజ్, శీతల్ పండుగలను రంగుల్లోకి తెచ్చారు.
తెలంగాణ చిత్రకళా ప్రపంచంలోకి ఈ కొత్త తరంగం నాగార్జున సాగర్‌కు సమీపంలోని ఎర్రచెరువు తండా నుంచి వచ్చింది. ఆ తండా జీవితం, చెల్కల, పొలాల సొబగు, ఎర్ర నేలలో పండే పెసర్లు.. బొబ్బర్లు.. జొన్నలు, కందులు.. సద్దలు.. తదితర తృణ ధాన్యాల సారం ఆయన చిత్రాల్లో తొంగి చూస్తోంది. నిష్కల్మషమైన, సారవంతమైన తమ తండా జీవితం.. ఆ దృశ్యాలు.. అనుభవాలు అన్నీ సజీవంగా రమావత్ శ్రీనివాస్ నాయక్ తన హృదయంలో పదిలపరచుకోవడం వల్ల ఇప్పుడు వాటిని ఆక్రిలిక్ రంగుల్లోకి తర్జుమా చేస్తున్నారు. ఈ రకమైన ‘నివేదన’ నిండు మనసులోంచి రావడం కారణంగా కాన్వాసు, కాగితం రంగులతో గుబాళిస్తోంది. గుండెలోతుల్లో కుంచెను ముంచి కాన్వాసుపై ఆకృతులను తీర్చిదిద్దుతూ, తండా జీవనాన్ని చిత్రిస్తూ తనకు తెలియకుండానే తన ‘జాతి’ రుణం ఆయన తీర్చుకుంటున్నారు.
బాల్యంలో భువనగిరి పట్టణంలో చదువుకుంటున్న రోజుల్లో కుమ్మరివాడలోని ఓ అవ్వ చేసిన మట్టి బొమ్మలు మదిని కలవరపరిచాయి. పాఠశాల్లో వేసిన పటాలకు ఉపాధ్యాయుల ఆదరణ లభించింది. మోహన్ అనే వ్యక్తి పరిచయం, నాగార్జున రావు, జయపాల్ అనే డ్రాయింగ్ టీచర్ల మద్దతు, పిట్టల రాంచంద్రం సాంగత్యం, తననో చిత్రకారుడిగా మలిచాయి. మాసాబ్ ట్యాంక్‌లోని ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో బిఎఫ్‌ఏ కోర్సు చేయడంతో తన కళకు సానపట్టినట్టయింది. తెలంగాణలో వచ్చిన వివిధ ఉద్యమాలకు స్పందించడం, ఆ సందర్భంగా పరిచయమైన ప్రముఖుల మాటలు వ్యక్తిగా ఎదగడానికి దోహదపడ్డాయి. అలా తనలోని చిత్రకళ ప్రతిభను, రంగుల రహస్యం తెలిసిన నిపుణుడిగా తన చుట్టూ ఉన్న జీవితాన్ని జతకలిపి పికాసో, తోట వైకుంఠం లాంటి అపురూప చిత్రకారుల స్ఫూర్తితో కదం తొక్కుతున్న శ్రీనివాస్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, లక్షణ ఆర్ట్ గ్యాలరీ, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ, బిర్లా ఆర్ట్ గ్యాలరీ, సాలార్‌జంగ్ మ్యూజియం ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో తన చిత్రాలను ప్రదర్శించి ప్రముఖుల మన్ననలు అందుకున్నారు. అనేక బహుమతులతో పాటు గుంటూరులోని ఫైన్స్ ఆర్ట్స్ అకాడెమీ నుంచి గోల్డ్‌మెడల్ పొందారు. ఆ రకంగా ఆయనకు బంగారు భవిష్యత్ ఉందని ఆయన వర్ణచిత్రాలు చెప్పకనే చెబుతున్నాయి.

-వుప్పల నరసింహం 99857 81799