Others

సూర్యజయంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘యస్మాన్మ న్వంతరాదేతు రథమాపుః దివాకరః మాఘమాసస్య సప్తమ్యా తస్మాత్యా రథ సప్తమీ’’- మాఘ మాస సప్తమి రోజున సూర్యుడు రథాన్ని అధిరోహించి భూమి మీద తొలిసారిగా సాక్షాత్కరించాడని మాఘశుద్ధ సప్తమిని రథ సప్తమి అని సంభావించారు. ఆరోజే సూర్య జయంతి అని పురాణములు కూడా పేర్కొన్నాయి.
మాఘ శుద్ధ సప్తమినాడు సూర్యరథం ఉత్తర దిక్కువైపు తిరుగుతుంది. అందుకే మాఘ శుద్ధ సప్తమి రథ సప్తమి అని పేరు వచ్చింది. జిల్లేడులో సూర్యతేజస్సు, సౌరశక్తి ఎక్కువగా ఉంటుంది. జిల్లేడు ఆకులకు అర్క పత్రములని పేరు. సూర్యునికి ‘‘అర్కః’’ అని పేరుంది. అట్లానే రేగి ఆకులలోను, చిక్కుడు ఆకులలోనూ, సూర్యశక్తి నిక్షిప్తంగా ఉంటుంది. కనుక నే రథసప్తమి రోజు ప్రతివారు ‘‘మాఘే మాసేసి తౌ పక్షే సప్తమీ కోటి భాస్కర కుర్వాత్ స్నానార్ఘ్య దానాభ్యాం ఆయురారోగ్య సంపదః’ అని కానీ, ‘‘సప్తార్క పత్రాణి సప్త బదరీ పత్రాణి సంయోజ్యశిరసి నిధాయ స్నానం కుర్యాత్’’ అని కానీ పఠిస్తూ జిల్లేడు లేదా రేగు లేదా చిక్కుడు ఆకులను అక్షతలతో లేదా రేగు పళ్ళతో తల మీద భుజాల మీద ఉంచుకొని స్నానం చేస్తారు.
ఆ తరువాత సర్వాలంకారాలతో చిక్కుడు కాయలతో ఓ రథాన్ని తయారుచేసి (కొందరు చిక్కుడు కాయలకు చీపురుపుల్లలు గుచ్చి సూర్యరథం తయారుచేస్తారు) మంటపం ఏర్పరిచి అందులో రథాన్ని నిలిపి కుంకుమ, గంధాక్షతలతో పూజించి సూర్యభగవానుని ప్రతిమను ఆ రథంలో ఉంచి పూజించాలి.
సూర్యునికి ఎదురుగా ఆవు పిడకలతో దాలిచేసి, దానిమీద పాయసాన్ని వండి, ఆ క్షీరాన్నాన్ని చిక్కుడాకులలో ప్రసాదం పెట్టి లోక సాక్షికి నివేదన చేయాలి. ఆ క్షీరాన్నమేప్రసాదంగా అందరికీ పంచాలి. ఇలా చేయడం వల్ల సర్వేశ్వరుడైన సూర్యుని అనుగ్రహం లభిస్తుంది. ప్రతిరోజు కూడా సూర్యోదయాత్పూర్వమే నిద్రలేచి, బాహ్య, అంతర శుద్ధితో సూర్యభగవానుని ఆరాధిస్తే, హృదయ కాలుష్యాన్ని తొలగించి నిర్మలమైన మనస్సును ప్రసాదిస్తాడు. ఇలాంటి సూర్యవ్రతాలు ప్రతినెలలో ఆచరించ లేకపోయనా మాఘమాసంలో రథ సప్తమినాడు ఆచరిస్తే ఆ సూర్యభగవానుని కృప తప్పక లభిస్తుంది. ఆదిత్యుణ్ణి ప్రార్ధన చేస్తే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని సర్వకార్యములు నెరవేరుతాయని, పురాణములు చెప్తున్నాయి. భవిష్య పురాణం రథసప్తమి వ్రతాన్ని గూర్చి విశేషంగా చెప్తుంది.
వెలుగుల నిధి అయన సూర్యుడే ప్రాణకోటికి ప్రత్యక్ష దైవం. కర్మసాక్షి. సమస్త జీవరాశికీ ప్రాణాధారమైన వెలుగును ప్రసాదించే తేజస్వి. కాల చక్రాన్ని తిప్పే విరాట్ పురుషుడు. సర్వజీవనావళికి చైతన్యదాయకుడైన సూర్యుని ఆరాధించే పద్ధతి మన భారతీయ సంస్కృతిలో వేదకాలం నుంచీ ఆచారమై వస్తోంది.
సర్వవ్యాపక స్వరూపుడు, సర్వాన్తర్యామి, సకల దేవతా స్వరూపుడు- శ్రీ సూర్యనారాయణమూర్తి. ఋగ్వేదంలోని మహాసౌరము, యజుర్వేద తైత్తిరీయ ఆరణ్యకం- అరుణమంత్రం, బహ్మపురాణం సూర్యుని గురించిన జ్ఞానాన్ని అందిస్తున్నాయ. ఋగ్వేద, యజుర్వేదాల్లో ఉపనిషత్తులలో, రామాయణ, భారత, భాగవతాది పురాణాల్లో, మార్కండేయ, మత్స్య, బ్రహ్మాండ, భవిష్యాది పురాణాల్లో సహితం సూర్యుని ప్రస్తావన ఉంది. సాక్షాత్ భగవానుడైన శ్రీకృష్ణపరమాత్మ ధర్మారాజుకు రథసప్తమి వ్రత మహిమను గూర్చి బోధించినట్లు మహాభారతం తెలుపుతోంది.
అంతేకాక
సూర్యునికి వివస్వంతుడనే పేరు కూడా ఉంది. వివస్వంతుని కుమారుడే వైవస్వంతుడు. ఇతడు ఏడవ మనువు. అతని మన్వంతరానికి మొదటి తిథి రథసప్తమియే. ప్రస్తుతం జరుగుతూన్నది వైవస్వంత మన్వంతరమే. ఈ వైవస్వత మన్వాదియే భాగవతంలో సంవత్సరాదిగా పేర్కొనబడింది. దీనిని బట్టి ఒకప్పుడు మాఘ శుద్ధ సప్తమి ఉగాది (సంవత్సరాది) పండుగగా పూర్వకాలంలో జరిపేవారని తెలుస్తుంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో కూడిన మకర సంక్రాంతి సౌరమానానికి సంబంధించినదనీ, రథసప్తమి పర్వదినమేమో చంద్రమానానికి సంబంధించినదనీ పలు పురాణ వాఙ్మయాలు పల్కుతున్నాయి.
జీవన వ్యాపారాలను జాగృతం చేసి ఆరోగ్యాన్నిచ్చే వాడు సూర్యుడే కనుక ‘‘ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్’’అంటున్నారు. లోకంలో ఎవరే పని చేసినా, ఏ కాలంలో చేసినా గమనిస్తూ సాక్షిగా ఉంటాడు కనుక ‘లోకసాక్షి’ అని కూడా సూర్యుడిని సంబోధిస్తాం. నమస్కారప్రియుడు, సర్వవ్యాపకస్వరూపుడు, సమదృష్టి గలవాడు. సర్వసాక్షి ప్రచండ వేగస్వరూపుడు, అనంతతేజోవిలాసుడు, మార్తాండాడు, దివాకరుడు, జగదీశుడు, శుభం కరుడు, అచ్యుతుడు, అవ్యయుడు ఇట్లా అనంత నామధేయుడైన సూఠ్యభగవానుణ్ణి అర్చించిన వారికి ఆయురారోగ్యఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయ. సూర్యుని ఆరాధించడం మన కర్తవ్యం.

- ఆర్. చరణ శ్రీ