Others

గాడ్సే తూటాలకు గాంధీ హతమవ్వకపోతే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలనాడు నాథూరామ్ గాడ్సే కిరాతకానికి జాతిపిత గాంధీ ప్రాణాలు కోల్పోకపోయి ఉంటే- ఆయన మరికొన్ని సంవత్సరాలు సజీవులుగా ఉండేవారు. అయితే, తనను ఏ మాత్రం లక్ష్యపెట్టని తన అనుచర వర్గాన్ని, నేతలను, ప్రజలను చూసి నిరాశా నిస్పృహలతో బహుశా కాలం వెళ్ళదీసేవారు. 1934 నాటికే నెహ్రూ, పటేల్ వంటివారు స్వతంత్రించి నిర్ణయాలు తీసుకోవటాన్ని, తన పెద్దరికాన్ని గౌరవించక పోవటాన్ని గాంధీజీ గమనించారు. కాంగ్రెస్ పార్టీలో తాను ఒంటరినై పోవడాన్ని గ్రహించారు. 1946లో మిత్రుడు ఘనశ్యామ్ బిర్లాకు రాసిన లేఖలో- ‘కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో నా మాటకు విలువ లేదు. పరిస్థితులు చక్కదిద్దేందుకు నా ప్రయత్నం విఫలం అవుతున్నది. నేను బయటపడి మాట్లాడటానికి కూడా వీలు కావటం లేదు’’ అని వాపోయారు. 1946 మార్చిలో గాంధీ బిహార్ పర్యటనలో ఉండగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఒక కీలకమైన నిర్ణయం తీసుకొంది. పంజాబ్ విభజనకు కాంగ్రెస్ సమ్మతించింది. ఆ నిర్ణయాన్ని తీసుకొనేముందు గాంధీని సంప్రదించలేదు. దేశాన్ని మత ప్రాతిపదికన విభజించటాన్ని గాంధీ ఎప్పుడూ వ్యతిరేకించేవారు. ముస్లిముల మతోన్మాదాన్ని ఆయన ఎప్పుడూ అంగీకరించలేదు. వారిని బుజ్జగించి, వారి మతోన్మాదాన్ని తగ్గించే ప్రయత్నం ఆయన చేశారు. అది హిందూ మతోన్మాదులకు నచ్చలేదు గనుక ఆయనపై కక్ష పెం చుకున్నారు.
పంజాబ్ విభజనపై నెహ్రూ, పటేల్‌లను గాంధీ వివరణ అడిగారు. ‘‘నేను ఇది సరైన నిర్ణయం అని భావించాను. నాతోపాటు ఇతర కార్యవర్గ సభ్యులు కూడా పంజాబ్ విభజన అవసరమని, ఎంత త్వరగా విభజిస్తే అంత మంచిదని భావించారు’’ అని నెహ్రూ సమాధానం ఇచ్చారు. ‘‘ఎంతో లోతుగా చర్చించిన మీదటే ఈ నిర్ణయం తీసుకొన్నాము. ఈ అంశంపై మీ అభిప్రాయం మీకు ఉండవచ్చు’’అని పటేల్ సమాధానం యిచ్చారు. నెహ్రూ, పటేల్ వైఖరితో గాంధీగారు ఖిన్నులయ్యారు. తన ప్రార్థనా సమావేశంలో- ‘కాంగ్రెసు ఏది నిర్ణయిస్తే అది జరుగుతుంది. నా యిష్టపూర్వకంగా ఏదీ జరగటం లేదు. దేశానికి ఏది మంచిదో అదికూడా జరగదు. నా మాట ఎవరూ వినటం లేదు. నేను ఒంటరివాడ్ని అయిపోయాను’ అన్నారు. 1946 మే నాటికే ఆయన ఎంత త్వరగా జీవితాన్ని చాలిస్తే అంత మంచిదన్న ఆలోచనకు వచ్చారు.
అంతకుముందు 125 ఏళ్లు జీవించాలన్న అభిలాష ఉన్నా, ఒంటరితనంతో నిరాశా నిస్పృహలే కాలమేఘాలు ఆయనకు కప్పివేశాయి. గాడ్సే చేతుల్లో హతమవటానికి ఒక్క రోజు ముందు అంటే 1948 జనవరి 29న ఒక వీలునామా వంటిది ఆయన వ్రాశారు. దేశానికి కాంగ్రెస్ స్వాతంత్య్రాన్ని సాధించింది, కనుక పార్టీని రద్దుచేయాలని, గ్రామీణ ప్రాంతాలలో నిరుపేదలకు సేవచేసే ఒక ఐచ్ఛిక సంస్థగా కాంగ్రెస్ రూపాంతరం చెందాలని అభిలషించారు. ఈ అభిప్రాయం కాంగ్రెస్ నేతలకు నచ్చలేదు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చి అప్పటికి ఆరు నెలలు కూడా కాలేదు. అత్యంత ప్రజాదరణ, జనాకర్షణ కల్గిన అనేక మంది నాయకులు ఉన్న పార్టీని ఎవరు రద్దుచేసుకుంటారు? అధికార మత్తులో జోగుతున్న మంత్రివర్యులకు గాంధీ పెద్ద తలనొప్పి అయ్యారు.
గాంధీ తన రాజకీయ వారసుడిగా నెహ్రూను సూచించారు. పటేల్‌ను కాదని నెహ్రూను ఆయన దేశంమీద రుద్దటమే ఆయన చేసిన పొరపాటు. నెహ్రూ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే గాంధీ తన పొరపాటును గ్రహించారు. నెహ్రూ నాయకత్వ పోకడలతో ఆయన అసంతృప్తికి లోనయ్యారు. 1947 డిసెంబరులోనే కొత్త ప్రభుత్వాన్ని ఆయన మంద్రస్థాయిలో విమర్శించటం మొదలెట్టారు. సైనిక వ్యయం తగ్గించమని, ఉద్యోగులు ప్రజాసేవకులుగా ఉండాలని, వారికి జీత భత్యాలు తలసరి ఆదాయం కంటే ఎక్కువగా ఉండకూడదని, ఉన్నత స్థానాల్లో పనిచేయటానికి ఐచ్ఛికంగా పనిచేసేవారని నియమించాలని, చరఖాను మర్చిపోవద్దని హెచ్చరించేవారు. ఆయన అభిప్రాయాలను నెహ్రూ పరిగణనలోకి తీసుకోలేదు. కశ్మీర్ సమస్యకు గాంధీ సూచించిన శాంతియుత పరిష్కారాన్ని నెహ్రూ కనీసం అధ్యయనం చెయ్యలేదు. పైగా ప్రభుత్వ వ్యవహారాల్లో, విధానాల్లో ఆయన జోక్యాన్ని నెహ్రూ నిరసించేవారు. విదేశీ వ్యవహారాల్లో తను నిష్ణాతుడినని నెహ్రూ అభిప్రాయం. గాంధీ విదేశీ వ్యవహారాల గురించి ఏ సలహాయిచ్చినా అది తన ప్రజ్ఞాపాటవాలను, ప్రావీణ్యాన్ని చిన్నబుచ్చటం క్రింద భావించేవారు. గాంధీ ఆలోచనలు, సిద్ధాంతాల నుండి నెహ్రూ ప్రభుత్వం దూరంగా జరిగింది. గ్రామ ప్రాంతాల అభివృద్ధి, శ్రమ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించటం, అందరికీ ఉపాధి కల్పన, స్వయం పోషక జనవాసాల నిర్మాణం మొదలైన వాటి నుండి దూరంగా జరిగి సోవియేట్ రష్యా అభివృద్ధి నమూనాను గుడ్డిగా అనుకరించటానికి నెహ్రూ పూనుకొన్నాడు.
గాంధీ బ్రతికి ఉన్నప్పుడే ఆయన ఆలోచనలకు, అభిప్రాయాలను ముసలితనపు చాదస్తంగా కాంగ్రెస్ నాయకత్వం కొట్టివేసింది. వామపక్షాలు గాంధీని అభివృద్ధి నిరోధకుడిగా ముద్రవేసి విమర్శించేవారు. మతోన్మాదులు వారు హిందువులైనా, ముస్లిములు అయినా దేశంలోని పరిస్థితులు అన్నిటికీ ఆయనే కారణమని ఆక్షేపించేవారు. అంబేద్కర్ వంటి నాయకులు దళితుల ప్రగతిని గాంధీ అడ్డుకొంటున్నారని విమర్శించేవారు. 1947 నాటికే ఆయన ఎవరికీ అక్కరలేని వాడు అయ్యాడు. ఆయన ఆశ్రమాల్లో ఉంటున్న వాసులు కూడా ఆయనను లక్ష్యపెట్టటం మానివేశారు. హిందూ, ముస్లిమ్ నాయకులు తనను దూరంగా పెడ్తున్నారని, తన మాటను ఏమాత్రం లక్ష్యపెట్టకుండా మతం పేరతో అరాచకాలకు, హత్యలకు, మానభంగాలకు పాల్పడుతున్నారని ఆయన తీవ్ర ఆవేదన చెందేవారు.
1934 నుండి 1948 వరకు ఆయనపై ఆరుసార్లు హత్యాయత్నం జరిగింది. 1934లో ఒకసారి, 1944లో రెండుసార్లు, 1946లో ఒకసారి, 1948 జనవరి 20న ఐరోసారి హత్యాయత్నం జరిగింది. 1948 జనవరి 30న ఆయన హత్యకు గురయ్యారు. బ్రిటిషువారు ఆయనకు తగిన రక్షణ కల్పించకపోవటంలో ఆశ్చర్యం లేదు. కాని కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన రక్షణ గురించి అసలు పట్టించుకోలేదు. 1948 జనవరి 20న ఆయన ప్రసంగిస్తున్న సభపై బాంబు దాడి జరిగినా ఆయన భద్రత గురించి నెహ్రూ ప్రభుత్వం పట్టించుకోలేదు. గాడ్సే బృందమే అంతకుముందు రెండుసార్లు హత్యాయత్నం చేసినట్లు పోలీసు రికార్డులలో నమోదైనా, గాంధీ హత్యకు కుట్ర జరుగుతోందని నిఘా వర్గాలు హెచ్చరించినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన ప్రభుత్వ వైఖరి అనేక అనుమానాలకు దారితీస్తుంది. గాంధీని చంపింది గాడ్సే అయినా, ఆ ఘాతకానికి ఒడగట్టటానికి, సునాయాసంగా ఆ అకృత్యం చేయటానికి అనువైన పరిస్థితులు కల్పించబడ్డాయన్న అనుమానాలు ఎప్పటికీ నివృత్తికావు. గాడ్సే బృందంతోపాటు మరో అజ్ఞాత వ్యక్తి కూడా కాల్పులుచేసాడని, గాడ్సే మూడుగుళ్ళు పేలిస్తే, ఆ అజ్ఞాత వ్యక్తి నాలుగో గుండు పేల్చాడని కొందరి అభిప్రాయం. అజ్ఞాత వ్యక్తి బ్రిటీషు వారి నిఘా విభాగానికి చెందినవాడని కొందరి అనుమానం. గాడ్సే పారిపోవటానికి ప్రయత్నించకుండా చేతులు పైకెత్తి ఉలుకు, పలుకు లేకుండా నిలబడటం కారణంగానే పట్టుబడ్డాడు తప్ప పారిపోతే పట్టుకోవటానికి కూడా పోలీసులు అక్కడ ఎవ్వరూ లేరు. అమెరికా దౌత్య కార్యాలయంలో పనిచేసే హెర్బర్‌థామస్ రైనర్ గాంధీజీ దర్శనానికి వచ్చి, హత్యకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచాడు. కాల్పులు జరిపి అక్కడే నిల్చున్న గాడ్సేను పట్టుకొని, నిరాయుధుడ్ని చేసి పోలీసులకు అప్పగించింది రైనరే.
గాంధీ బతికి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వంతో తీవ్రంగా విభేదించేవారు. పంచవర్ష ప్రణాళికలకు, భారీ పరిశ్రమలకు, సైనిక ఆధునీకరణకు, హైద్రాబాద్, గోవాలలో సైనిక చర్యకు, పెద్ద నీటిపారు ప్రాజెక్టులకు వ్యతిరేకించేవారు. నెహ్రూకు గాంధీ, గాంధీకి నెహ్రూ పెద్ద ఇబ్బందిగా అయ్యేవారు. స్వతంత్ర భారతంలో ఆయన సంతోషంగా ఉండేవాడు కాదు. ఆయన మరణం ఆయనకే కాక, ఆయన అనునాయకులకు, ప్రత్యర్థులకు కూడా పెద్ద ఉపశమనం.
గాంధీ మరణవార్త విని డా.అంబేద్కర్ లక్ష్మీకబీరుకు వ్రాసిన లేఖలో ఈ విధంగా అన్నాడు. ‘‘నా ఉద్దేశంలో గొప్ప వ్యక్తులు దేశానికి గొప్పసేవలు అందిస్తారు. కాని కొన్నిసార్లు వాళ్ళే దేశప్రగతికి అడ్డం అవుతారు. గాంధీ దేశానికి పెద్ద ప్రమాదకారిగా మారాడు. అన్ని ఆలోచనలను ఆయన అడ్డగించాడు. సమాజంలోని చెడ్డవారికి, స్వార్థపరశక్తులకు కేంద్రంగా మారిన కాంగ్రెస్‌ను ఆయన నడిపారు. అలాంటి పార్టీకి దేశాన్ని పాలించే అర్హత లేదు. చెడు నుంచి ఒక్కోసారి మంచి వస్తుందని బైబిలులో చెప్పినట్లు, గాంధీ మరణం ద్వారా దేశానికి మంచే జరుగుతుందని ఆశిద్దాం.’’ గాంధీ మరణం నాయకులను కదిలించలేకపోయింది. జరగవలసిందేదో జరిగిందన్న అభిప్రాయంతోనే వారున్నారు. కాని సామాన్యజనం గాంధీ మరణవార్తను విని తట్టుకోలేక పోయారు. కన్నీటి ధారలతో ఆయనకు నివాళులు అర్పించారు. రాధాకృష్ణన్ అన్నట్లుగా ఆయన ఆత్మను ఏనాడో చంపివేశారు. ఆయన శరీరానే్న గాడ్సే చంపాడు.
(నేడు గాంధీజీ వర్ధంతి)

-డా. సారంగపాణి