Others

విభజన హామీల సాధనకు జనఘోష రైలుయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా ఇచ్చిన పలు హామీల అమలు పట్ల మోదీ ప్రభుత్వం గత నాలుగున్నరేళ్ళకు పైగా నేరమయ నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. ఈ విషయమై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్రంలోని దాదాపు అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, మేధావులు, యువకులు, విద్యార్థులు, వివిధ వర్గాల ప్రజలు ఆందోళనలు చేస్తున్నా ఎటువంటి స్పందన కనిపించడం లేదు. ఆంధ్రుల జనఘోషను ఢిల్లీ పాలకులకు వినిపించడానికి ఉత్తరాంధ్ర చర్చా వేదిక ఆధ్వర్యంలో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. రైల్వే జోన్ విషయమై హైకోర్టులో పిల్ వేశాము. వెనుకబడిన ప్రాంతాలకు కేటాయించిన నిధులను వెనక్కి తీసుకోవడం పట్ల కూడా కోర్టులో న్యాయం కోరుతున్నాం.
గత ఏడాది పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఢిల్లీకి రైలు యాత్ర నిర్వహించాం. మోదీ ప్రభుత్వ హయాంలో చివరి బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31న ప్రారంభమవుతున్నాయి. చివరి బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టనున్నారు. అంతకన్నా ముందే ఏపీ ప్రజల ఘోషను వివిధ పక్షాల నాయకులు, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు జనఘోష రైలుయాత్ర తలపెట్టాం. రాజకీయాలతో సంబంధం లేకుండా ఆంధ్రుల జనఘోషను ఢిల్లీలో వినిపించి, రాష్ట్ర హక్కులను సాధించడానికి ఈ యాత్ర చేపట్టాం.
ఈనెల 27న విశాఖపట్నంలో ఉదయం 7.30 గంటలకు ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో ఉత్తరాంధ్ర ప్రతినిధి బృందంతో ఢిల్లీకి బయలు దేరుతున్నాం. ఢిల్లీలో ఉండే ఐదు రోజులు కూడా ఉత్తరాంధ్ర చర్చా వేదిక సభ్యులంతా నలుపు దుస్తులను ధరించి కేంద్ర మంత్రులు, వివిధ పక్షాల నాయకులు, ఎంపీల వద్దకు వెళ్లి వినతిపత్రాలను సమర్పిస్తారు. పలు ఆందోళన కార్యక్రమాలను చేపట్టి కేంద్రంపై వత్తిడి తీసుకు వచ్చి ఏపీకి న్యాయం చేయమని కోరతాము. ఈసారి జనఘోష రైలుయాత్రలో ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల నుండి కూడా భారీ సంఖ్యలో ప్రజలు తరలి వస్తున్నారు. కళా బృందాలను కూడా తీసుకు వెళ్లి భాజపా ప్రభుత్వం, ప్రధాని మోదీ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని తెలియచెప్పే విధంగా సన్నాహాలు చేస్తున్నాము. అప్పటి ప్రధాని డా. మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలు, విభజన చట్టంలోనిఅంశాలు అమలు కానందుకు నిరసనగా ఈ ఆఖరి ప్రయత్నం చేస్తున్నాము.
వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమలకు బుందేల్‌ఖండ్ తరహాలో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజి, విశాఖపట్నంకు రైల్వే జోన్, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు క్యాప్టివ్ మైన్‌ల కేటాయింపు, గిరిజన విశ్వవిద్యాలయం , విశాఖలో హైకోర్టు బెంచ్, పోలవరం ప్రాజెక్ట్ ఖర్చును పూర్తిగా కేంద్రమే భరించడం, ఉత్తరాంధ్రకు ఎయిమ్స్ ఆసుపత్రి, ఉత్తరాంధ్ర మరో భోపాల్ కాకుండా పర్యావరణాన్ని రక్షించడం వంటి డిమాండ్లతో జనఘోష రైలుయాత్ర చేబడుతున్నాము.
చట్ట ప్రకారం ఇవ్వవలసిన నిధుల గురించి మాట్లాడకుండా ఏపీకి మరే రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులు ఇచ్చామని కేంద్ర మంత్రులు, భాజపా నాయకులు అసంబద్ధ వాదనలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. కేంద్రం నిర్లక్షపూర్వక ధోరణి అనుసరించడానికి మనలో ఐక్యత లోపించడమే కారణమని చెప్పక తప్పదు. కేంద్రం చేస్తున్న అన్యాయం గురించి తెదేపా, వైకాపా, కాంగ్రెస్, జన సేన, సిపిఐ, సిపిఎం, ఇతర వామపక్షాలు, లోక్‌సత్తా ఇతర ప్రజా సంఘాలు గొంతెత్తి ప్రశ్నిస్తున్నా, పలు ఆందోళనలు చేబడుతున్నా- ఇవన్నీ ఎవరికి వారుగా చేస్తూ ఉండడంతో కేంద్ర పాలకులు లెక్క చేయడం లేదు. తెలంగాణ ఉద్యమంలో జేఏసీ నీడలో అని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు సమైక్యంగా పోరాటం చేయడాన్ని మనం గుర్తుంచుకోవాలి. సమైక్య ఉద్యమాల వల్లనే కేంద్రాన్ని మన రోదన వినేటట్లు చేయగలమని గ్రహించాలి. అందరం ఒకే వేదికపైకి రాగలిగితేనే ఈశాన్య ప్రాం తాల మాదిరి మన రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్రతిపత్తి సాధించుకోగలం.
ఏపీ పట్ల కేంద్రం నిర్లక్ష్య ధోరణికి ఇప్పటి వరకు మొదటి సంవత్సరానికి సంబంధించిన వనరుల లోటు అంశాన్ని పరిష్కరించక పోవడమే ప్రబల నిదర్శనం. 2014-15 సంవత్సరానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న వనరుల లోటు రూ 19,015.48 కోట్లు. అందులో ఇప్పటికే చేసిన ఖర్చులు, చెల్లించాల్సినవి ఉన్నప్పటికీ ఆదాయ వనరుల సమస్య, నిధుల కొరత వళ్ళ విభేదించిన వ్యయం కలిపి ఉన్నాయి. ఈ మొత్తం లోటులో రూ 10,335.07 కోట్లు స్పష్టంగా నిర్ధేశిత ప్రమాణాల ప్రకారం చేసిన వ్యయం. మార్చి 31, 2015 నాటికి పెండింగ్ లో ఉన్న బిల్లులు, చేసిన చెల్లింపులను కేంద్రం తనిఖీ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 నిబంధనలు, పార్లమెంట్‌లో అప్పటి ప్రధాని ఇచ్చిన హామీకి అనుగుణంగా ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయాలి. మిగిలిన రూ 8,660.41 కోట్లు కచ్చితంగా వనరుల లోటు అని తీర్మానించలేము. కొత్త పథకాలు, ప్రమాణీకరించని వ్యయం కింద పరిగణించి, భారత ప్రభుత్వం విచక్షణతో నిర్ణయం తీసు కోవచ్చు. ఇంత స్పష్టంగా ఉన్న ఈ అంశాన్ని పరిష్కరించడం పట్ల కేంద్రం ఎటువంటి శ్రద్ద చూపడం లేదు.
చట్టంలోని అసంబద్దత వలన రాష్ట్ర నికరాదాయంలో రూ 3,8290.36 కోట్ల నష్టం వచ్చింది. ఇది పార్లమెంట్ ఆమోదించిన చట్టంలోని నిబంధనల తప్పిదాల వల్లన కలగడంతో, అవసరమైతే ఒక సారి తనిఖీ చేసుకొని, ఈ మొత్తాన్ని పూర్తి స్థాయిలో కేంద్రమే భర్తీ చేయవలసి ఉంది. సిఎస్‌ఎస్ లో కేంద్ర నిధుల వాటా 90 శాతానికి బదులుగా రూ 16,447 కోట్లు కేంద్రం రాష్త్రానికి చెల్లించాల్సి ఉంది. ఈ ప్రత్యేక సాయాన్ని అందించడానికి విదేశీ తోడ్పాటు ప్రాజెక్ట్ ఏ మాత్రం సరిపోదు. దీని ద్వారా ఇప్పటిదాకా అరకొర నిధులే విడుదలయ్యాయి. ఇతర మార్గాల ద్వారా సాయం అందించవలసి ఉన్నా కేంద్రం పట్టించుకోవడం లేదు.
పోలవరం ప్రాజెక్ట్ మొదటి దశను 2019 నాటికి పూర్తి చేయడానికి అంతకు ముందు చేసిన వ్యయం తాలూకు పెండింగ్ లో ఉన్న బిల్లులకు కలిపి రూ. 8,711.19 కోట్లు, రెండవ దశను పూర్తి చేయడానికి 2019-20లో రూ 27,494 కోట్లు కేంద్ర సాయంగా అందవలసి ఉంది. సవరించిన ప్రాజెక్ట్ వ్యయ అంచనాలను నిబంధనలకు అనుగుణంగా కేంద్రం ఆమోదించవచ్చు. ఇటువంటి ప్రాథమిక అంశాలను తేల్చడానికి సంవత్సరాలు గడుస్తున్నా ఎందుకని కేంద్రం కాలయాపన చేస్తున్నది? పెండింగ్ లో ఉన్న సమస్యలను పది రోజులలో పరిష్కరిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పి ఏడాది గడుస్తున్నా దిక్కు లేకుండా పోయింది.
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం రూ 24,350 కోట్ల అంచనాతో ప్రతిపాదనలను రూపొందించింది. ఆ ప్యాకేజి గురించి ఇప్పటి వరకు కేంద్రం నోరు మెదపడం లేదు. జనాభా, ద్రవ్యోల్భణంలకు అనుగుణంగా ఇది దాదాపుగా బుందేల్ ఖండ్ ప్యాకేజి తో సమానంగా ఉంది. వెనుకబడిన ప్రాంతాల ప్రత్యేక ప్యాకేజి కింద ఇప్పటి వరకు మూడేళ్లకు పైగా కాలానికి రూ 1,050 కోట్లను విడుదల చేసింది. రానున్న సంవత్సరాలలో మరో రూ. 700 కోట్లను చెల్లింప వలసి ఉంది. దుగ్గరాజపట్నం వద్ద నౌకాశ్రయం అభివృద్ధికి రూ 7,988 కోట్లు ఖర్చవుతుందని తాత్కాలికంగా అంచనా వేశారు. ఆ ప్రాంతంలో పోర్టు ఏర్పాటు ఆచరణలో నష్టదాయకమని కేంద్రం తేల్చి, మరో ప్రాంతాన్ని సూచించామని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రామాయపట్నం పోర్ట్ గురించి రాష్ట్రం ప్రతిపాదనలు పంపితే కేంద్రం నుండి స్పందనే లేదు.
జాతీయ ప్రాధాన్యత గల 11 విద్యా, వైద్య సంస్థలను రాష్ట్రంలో ఏర్పాటుకు మొత్తం 12,746.38 కోట్ల మేరకు వ్యయం కావలసి ఉండగా, అందులో కేవలం 6.63 శాతం మేరకు 845.42 కోట్లను మాత్రమే కేంద్రం ఇప్పటి వరకు విడుదల చేసింది. 93 శాతం ఇంకా చెల్లింపవలసి ఉంది. అన్ని సంస్థలు తాత్కాలిక ప్రాంగణాలలోనే నడుస్తున్నాయి. నిర్దిష్ట కాలపరిమితితో కేంద్రం తగిన ప్రణాళికలను రూపొందించలేదు. 13వ షెడ్యూల్ లోని వౌలిక వసతుల ప్రాజెక్ట్‌లను సమీక్షిస్తే ఐదు ప్రాజెక్టుల అమలు అసలు ప్రారంభం కాలేదు. మూడు అమలులో తొలి దశలోనే ఉన్నాయి. వీటిల్లో పెట్రో కెమికల్ కాంప్లెక్స్, మెట్రో రైలు ప్రాజెక్ట్ లు, వైజాగ్-చెన్నై పారిశ్రామిక కారిడార్, రాజధాని ప్రాంతానికి వేగవంతమైన రైలు, రోడ్ రవాణా సంధానత, అంతర్జాతీయ విమానాశ్రయాలు వంటివి కీలకం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను, ఉపాధి రంగాన్ని వేగవంతం చేసే ఇటువంటి ప్రాజెక్ట్‌ల పట్ల కేంద్రం దృష్టి సారించడం లేదు.
రాజధాని అభివృద్ధికి కేంద్రం రూ 1,500 కోట్లు విడుదల చేయగా, రాష్ట్రం 1,632.48 కోట్లకు వినియోగ పత్రాలను సమర్పించింది. వీటి ఆధారంగా నీతి ఆయోగ్ 666 కోట్లను వెంటనే, రూ 334 కోట్లను వచ్చే ఏడాది విడుదల చేయమని సిఫార్సు చేసినా కేంద్రం పట్టించుకోవడం లేదు. ఎటువంటి ఆర్థిక భారం లేని రైల్వే జోన్ విషయంలో కూడా కేంద్రం సానుకూలంగా అడుగు వేయక పోవడం, హామీల గురించి మాట్లాడక పోవడం ఏమాత్రం క్షంతవ్యం కాదు. ఇందుకు భారీ మూల్యం చెల్లింపవలసి వస్తుంది. అంతా కలిస్తేనే కేంద్రం మెడలు వంచి మన హక్కులను, ప్రయోజనాలను సాధించుకోగలం.

-కొణతాల రామకృష్ణ, కన్వీనర్, ఉత్తరాంధ్ర చర్చా వేదిక