Others

దళిత యుగ మహా గళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవయుగ కవిచక్రవర్తి గుర్రం జాషువా కవిత్వం ఇప్పటికీ, ఎప్పటికీ సజీవ దృశ్య కావ్యం. ఆయన కవిత్వపు చిక్కదనం, చక్కదనం మహా మహా అద్భుతం మరియు అనితర అసాధ్యం. అదియునూ జాషువా ఒక్కరికే సొంతం. అసమాన సమాజం మనుగడలో ఉన్నంత వరకూ జాషువా కవిత్వానికీ మనుగడ తప్ప, మరణం ఉండదు. కుసుమ ధర్మన్న, బీర్నీడి మోషే వంటి దళిత తొలి గళాలు ఉన్నా, వర్ణ అధర్మంపై పిడిగుద్దులు గుద్దిన తొలి దళిత మహాగళం జాషువానే.
మహాకవి కాళిదాసు ‘మేఘం’ ద్వారా ప్రియురాలికి ప్రణయ సందేశం పంపితే, కవి సామ్రాట్ జాషువా ‘గబ్బిలం’ ద్వారా ఈశ్వరునికి తుకతుకనుడుకు నశ్రుసందేశం పంపాడు. అందలి కధానాయకుడు మన్మదాగ్ని తప్తుడు. ఇందలి కధానాయకుడు క్షుదాగ్ని పీడితుడు. అతడి శిక్షకాలం ఒక ఏడాదైతే, ఇతని శిక్షకాలం ఆజన్మాంతము అంటూ భరతోర్వరకుం గడగొట్టు బిడ్డడై జన్మమెత్తిన అరుంధతీ సుతుండ గూర్చి జాషువా గళ మొత్తాడు. వాని రెక్కల కష్టంబులేనినాడు / సస్యరమ పండి పులకింప సంశయించు / వాడు చమటలోడ్చి ప్రపంచమునకు భోజనము బెట్టువానికి భక్తి లేదు - అని నిగ్గదీసి చాటాడు. వాని నుద్ధరించు భగవంతుడే లేడు? అని ప్రశ్నించాడు. వాడు జేసికొన్న పాపకారణమేమి/ యింతవరకు వానికెఱుక లేదు -అని ఘీంకరించాడు. అతని గాలి సోకితే గసలి బుసకొట్టు నాల్గుపడగల హైందవ నాగరాజు అంటూ వర్ణ్ధర్మంపై ధర్మయుద్ధం ప్రకటించాడు. 1941 దశకంలో ఒక ప్రక్క జాతీయవాదం, గాంధేయవాదం మరోప్రక్క సామ్యవాదం, సంస్కరణవాదాల నడుమ వీటన్నింటితో కలపోతగా కలం కదిలిస్తూనే దుర్మార్గమైన అంటరాని మంటలపై చండ్రనిప్పులు చెరిగారు. జాషువా కావ్య జగత్త్తులో సుస్థిరత కోసం పెనుగులాడారు. ప్రాధమికోపాధ్యాయునిగా జీవితం ప్రారంభించి ఆనాటి మూకీ చిత్రాలకు వ్యాఖ్యాతగా ఊరూర తిరిగారు. రెండవ ప్రపంచ యుద్ధంలో యుద్ధ ప్రచారకునిగా పనిచేశారు. స్వాతంత్య్రం ఆనంతరం 1956 నుండి 1960 వరకు ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో తెలుగు ప్రొడ్యూసర్‌గా ఉద్యోగం చేశారు. వీరేశలింగం, చిలకమర్తి, తిరుపతి వెంకట కవులు ఇలా ఎందరితోనో ఆశీర్వాద సహవాసాలు చేశారు.
ఫిరదౌశి కావ్యంలో రాజు మరణించె నొకతార రాలిపోయె/ కవియు మరణించె నొకతార గగనమెక్కె/ రాజు జీవించు రాతి విగ్రహములందు/ సుకవి జీవించె ప్రజల నాలుకలయందు - అని కవి ఔన్నత్యం చెప్పారు. సత్యహరిశ్చంద్ర పద్య నాటకంలో జాషువా కలం నుంచి జాలువారిన కాటి సీను పద్యాలు ప్రజల నాల్కలపై ఇప్పటికీ నడయాడుతూనే ఉన్నాయ. గండపెండేరం ధరించి, కనకాభిషేకాలు పొంది, గజారోహణం చేసి, పగటి దివిటీల పల్లకీలో జాషువా సగౌరవంగా ఊరేగారు.
చివరగా మహాకవి గుర్రం జాషువాను తొలి దళిత మహాగళం అని అంటే కొందరికి గిట్టకపోవచ్చు. ఇంకొందరికి నచ్చకపోవచ్చు. జాషువా లాంటి విశ్వకవిని ఒక జాతికో, ఒక కులానికో కట్టడి చేయటం క్షమార్హం కాదని వారు ఆగ్రహించనూవచ్చు. నిజానికి జాషువాను దళిత మహాగళంగానో, సామాజిక విప్లవకారునిగానో పేర్కొనటం అంటే ఆయన అలాంటి దిగువ జాతిలో పుట్టి, అంటరాని పెనుమంటల్లోంచి ఎదిగి కడగొట్టు బిడ్డడి అశ్రు సందేశాన్ని తుకతుకమని ఉడికించగలిగాడు అని అర్థం. మరో జాతిలోనో, కులంలోనో పుట్టి కడగొట్టు బిడ్డడి కష్టాలను, గసరి బుసకొట్టే హైందవ నాగరాజును గూర్చి ఇంతటి శరాఘాతాలను సంధించగలిగిన కవీంద్రులెవరున్నారు? అలాంటి ప్రయత్నం మరెవ్వరు చేసినా అది ప్రతిష్టకు, స్వయంభూకు ఉన్నంత వ్యత్యాసం ఉండదా? ఇవన్నీ లోతుగా చర్చించాల్సిన అంశాలే.

- పోతుల బాలకోటయ్య, 98497 92124