Others

ఇక్కడ కరువు లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళ్లని ఆకాశం గూట్లో పెట్టి
నేలపైన చినుకు జాడ కోసం
ఎదురుచూస్తుంటాడు సేద్యగాడు

ఐనా ఇక్కడ కరువు లేదంటాడు ‘వాడు’
పచ్చగడ్డి పేరుకైనా లేని నేలలో
పగలంతా తిరిగి తిరిగి
సాయంత్రానికి బీడుపడ్డ చెరువుగట్టు పై
నురగల్ని నెమరేస్తూ కూచుంటాయ పసరాలు
ఐనా యక్కడ కరువు లేదంటాడు వాడు

కడవ నెత్తికెత్తుకొని
కాలినడకన క్రోసెడు దూరం నడిచి
అడుగంటిన బురద బావిలో
నీళ్లు పిండుకొని
బిందెతో పాటు మండుటెండల్ని కూడ
నడినెత్తిన మోసుకుంటూ చేరుకొంటుంది
పెంటి పావురం వొకటి
ఐనా యక్కడ కరువు లేదంటాడు వాడు.

బడికెళ్లిన పిల్లకాయలు
మిట్టమధ్యాహ్నం రోడ్డుమీద
మరీచికల ప్రవాహం చూసి
ఖాళీ గినె్నలతో పరిగెడుతుంటారు
నిన్నటి దాకా లేళ్లే పరిగెత్తడం చూసిన కవులు
కలాల్లో కన్నీటి సిరా నింపి
వట్టిపోయన గోమాత లాంటి
భూమి తల్లిని వర్ణిస్తుంటారు
ఐనా యక్కడ కరువు లేదంటాడు వాడు

ఊళ్లో బతికిన శవాలనొదిలేసి
స్మశానంలో సమాధులు లెక్కపెడతాడు వాడు
తోపులో ఉరితాళ్లు వేలాడుతున్న
కొమ్మల్ని కసిచూపు చూసి
కుక్కమూతి పిందెలు కాస్తున్న చెట్లని
వరుసబెట్టి ఫొటోలు తీస్తాడు
సగం కూలిన గుడిసెల్ని చూడకుండా
రచ్చబండల్ని, కల్లుపాకల్ని నమోదు చేసుకుంటాడు
గుట్టలు పడిన పశువుల అస్థికల గుట్టల్ని
చిన్నచూపు చూసి
గుంతలు పడ్డ బాటపైన నిలబడతాడు
ఐనా యక్కడ కరువు లేదంటాడు వాడు!

- ఈతకోట సుబ్బారావు 8008562742