Others

అగాథ బాధలపై సెర్చ్‌లైట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అగాథ బాధలపై సెర్చ్‌లైట్
================

జ్ఞాపకాల్లో ఇంద్రవెల్లి
(వ్యాసాలు, కవితలు, రిపోర్టు)
సంపాదకులు: జయధీర్ తిరుమలరావు, ఎస్.సుధాకర్
పుటలు: 9+94, వెల: రూ.50లు;
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు

ఎక్కడో వున్న అమెరికా గురించీ, రష్యా గురించీ తెలిసినంతైనా ఇక్కడే మన రాష్ట్రాల్లో పుట్టిన, నివసిస్తున్న మన గిరిజన ఆదివాసీ జన సమూహాల గురించి తెలుసునా అంటే తెలియవలసినంత తెలియదనే చెప్పాలి. అలా తెలియజెప్పడానికి వచ్చిన పొత్తాల్లో ఇదిగో మన ముందుకొచ్చింది జ్ఞాపకాల్లో ఇంద్రవెల్లి. దేశ స్వాతంత్య్ర సాధన మన దేశీయుల్ని రక్షించుకోడానికే గాని భక్షించుకోడానిక్కాదు. విలాసవంత జీవితాలు కోరుకోకుండా మా నేలలో మా కొండల్లో, మా అడవుల్లో, మా గూడేలలో మా సంస్కృతిలో మా భాషల్లో మా మానాన మమ్మల్ని బతకనీయండి- అని మాత్రమే కోరుకునే సత్తెకాలపు మనుషుల బతుకు తెరువులతో ఆటలు, వారి గురించిన వేటలు మానవత్వ తత్వానికే కళంకాలు. నినాదాలూ, వివాదాలూ తీవ్రతరం కాకుండా దొరతనాలు పరిష్కరణలకు ముందుచూపుతో మంది మంచికి పూనుకుంటే అకారణ మరణాలుండేవి కావు. గతంలో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలోని దౌష్ట్యకాండపై మరిన్ని నిజాల్ని, పాలకుల నైజాల్నీ తెలిపే పుస్తకమిది. అంతేకాదు, ఇందులో ప్రజాసేవాంకితుల నిజనిర్ధారణల రిపోర్టువల్ల గణాంకాలతో సంబంధిత వివరాలతో- ఆలోచింపజేసి కళ్ళుతెరిపించే లోతట్టు అంశాలు ఎన్నో కందిరీగల తుట్టలా వున్నాయి. వీటివల్ల సమతుల్య అభివృద్ధికి ఆదివాసీ గిరిజనులు ఎప్పుడు నోచుకుంటారో అని కళ్ళూ చెమరుస్తాయి. అమరవీరుల శవాలు కూడా బంధువులకు అందకపోవడం, చనిపోయిన వారి సంఖ్యలో సమాచారంలోనే తేడాపాడాలుండడం గమనిస్తే మానవత్వం తన చిరునామానే కోల్పోతోందేమో అనిపిస్తుంది.
ఈ పుస్తకంలో వ్యాసాలు నేరుగా ప్రజల దగ్గర సేకరించిన సత్యదృష్టి కలవి; పరిశీలన, అధ్యయనాల సారభూత సాక్ష్యాలు కలవి. ‘‘రాతి స్తూపం కాదది, గోండు తల్లుల గుండె మడి’’ అని రాసిన సంపాదక వాక్యాల్లో ఆచార్య జయధీర్ తిరుమలరావు న్యాయ సమ్మతమైన ఒక డిమాండును తెలిపారు. ‘‘గోండుల పక్షాన నిలిచి, నాయకత్వం వహించి ప్రాణాలు కోల్పోయిన ప్రాంతంలో కొమురం భీం స్మృతివనం నిర్మించిన కొత్త ప్రభుత్వం- ప్రభుత్వం లెక్కల ప్రకారమే ఇంద్రవెల్లిలో మరణించిన పదముగ్గురి బలిదానాల స్ఫూర్తిస్తూపం గల ప్రదేశాన్ని మరింత గొప్పగా... స్మృతి కేంద్రంగా రూపొందించాలి’’ అనేది ఆ కోరిక. అంతేకాక గోండులు తమ గోడులు దొరతనానికి చెప్పుకోదగిన ప్రశాంత వాతావరణం కల్పించి వారి యాతనలు తీర్చి వారి జాతరలు జరుపుకొనేలా చూడాలనీ కోరారు. ఈ పుస్తకంలో అరుణదారలోని రిపోర్టు వేయడంవల్ల అనేకం తెలిశాయి. ఏడెనిమిది వ్యాసాలు, 15 కవితలు వున్నాయి. వ్యాసాలన్నీ ఉపయోగకరంగా విశే్లషణాభరితంగా ఆలోచనీయాలుగా ఉన్నాయి. అన్నీ ఆత్రంగా చదువుకోవలసినవే. కవితలలో సూర్యవంశ గోండుల హిమాలయ శిఖరం కరుణారసం చిందే ఆర్ద్ర కవిత. అందులో ఇక్కడ ఎదుగుతున్న / ప్రతీ లేత మొక్క / ఎదిగేకొలదీ / ఇంద్రవెల్లి స్తూపం వైపు / వినయంగా తలవాల్చి / సగర్వంగా తల ఎత్తుకుని / నిదానంగా / ఎదుగుతుంది / ఏ పోటీ ఏ పరుగూ లేకుండా / ప్రకృతి సహజంగా / తన పని పూర్తిచేస్తుంది అంటారు. అడవిలో/ ఎదగడానికి / చెట్టుకి కూడా / చట్టం అడ్డు / చెట్టుకి పట్టా ఉండాలా అనడంలో చెట్టంత ఆదివాసి ప్రశ్నిస్తున్నట్లే నిలదీస్తున్నట్లే వుంటుంది.
మృత్యుంజయ ‘స్తబ్దంగుండే ఆకుల శబ్దంలో’ ఇంద్రవెల్లి అడవుల్లో ఆకుల శబ్దంకాక తుపాకుల శబ్దం వినపడుతుందనడంలో శబ్ద్భావ శక్తి తారాజువ్వవుతుంది. ఇంద్రవెల్లివారు ఇంద్ర పదవి అడగలేదని ఇంద్రభోగం అడగలేదని అస్తిత్వం కోసమే ఆరాటమూ పోరాటమూ అని తెలిపారు. గాజోజు నాగభూషణం ‘అడివి అంటుకోకముందే/ పచ్చదనం గురించి కొంచెం పట్టించుకోండి’ అంటూ పాలక నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపారు. భూపతి వెంకటేశ్వర్లు ‘రేపటి ఇంద్రవంక’లో ‘‘గిరిజనుడెప్పుడూ చెలికాడే.../ కాదంటేనే విలుకాడు / హానిచేస్తే తప్ప అడవి మృగాన్ని కూడా వేటాడడు/ దెబ్బతీస్తే తప్ప దెబ్బతీసే స్వభావం రక్తంలో లేదు’’ అంటూ గిరిజన తత్త్వాన్ని ప్రకటించారు. ఇంద్రపాల శ్రీనివాస్ ‘చీడ పురుగులకు చివరి క్షణం’లో కవిత్వ బల వాక్యాలు చెబుతూ ‘అడవి కడుపుగొడితే/ చిరుత కూడా/ ఉద్యమం చేస్తుంది/... నా పుడమి పుత్రులారా!/ మనిషిలోంచి/ మృగాలను తరిమికొట్టి/ భూగోళాన్నంతా ఒక్క నాగలితో దున్ని/ ప్రతి ఖండానికి కడుపునిండా అన్నం పెట్టాలనుంది’ అని ప్రాంతీయ సమస్య నుండి సార్వజనీన కవితాకాంక్ష తెలిపారు. ఇటువంటివింకా ఈ పుస్తకంలో మరెన్నో.
‘‘శాంతిభద్రతల పేరుతో లేనిపోని కట్టుకథలను నమ్మకుండా గాయాలను మాన్పడం ప్రభుత్వం పని. ఆ దిశగా ఆలోచనలు చేయడం ద్వారా గోండుల నమ్మకాన్ని పొందగలం. ఈనాడు అది అవసరం. స్వేచ్ఛా తెలంగాణకి అనివార్య సంకేతం కావాలి’’ అని శుభాకాంక్షించిన పెద్దలు చుక్కా రామయ్యగారి ఆకాంక్ష ఆలోచనీయం.
ఇంద్రవెల్లిపై ఈ పుస్తకం ఒక టార్చిలైటు మాత్రమేకాదు, సెర్చ్‌లైటు కూడా. సాహసం, శ్రమ, ఓపికలతో కూడుకున్న ఈ పుస్తకాన్ని అందించిన సంపాదకులు అభినందనీయులు.

-- సన్నిధానం నరసింహశర్మ