Others

పుస్తకం మారిన వాక్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలం మళ్లీ కొత్తద్దంలో తనను చూసుకోబోతున్నవేళ
నిదుర లేచిన పిట్ట గొంతు విప్పి చిలికిన
తొలి కువకువలాంటి వాక్యానివి

మూడవఝాము రాతిరి మీద
మిగలపండిన ‘మాల్కౌన్స్’లా
మురిపాల వానలు గుమ్మరించి
నిలువెల్లా థిల్లానాలు పూయంచిన వాక్యానివి

పుష్యమాసపు చలిగింతలేవో
గంధపు పూతలు పూసిపోతుంటే
మనసును కొరికే ఏదో అనుభవాన్ని
తూరుపు గాలుల్లోంచి తుషార వనాల్లోకి
నడిపించిన వెనె్నలతొనలాంటి వాక్యానివి

పందెపు గిత్తలా పొంగులెత్తే ఊపిరిని
తపనల మునివేళ్ళతో నిమిరి
కొత్త వేకువల పొత్తుల్ని తెంపుకొచ్చి
నాలో పట్టనన్ని కాశ్మీరాన్ని పంపి
ఇంద్రచాపాల్ని కాపలా పెట్టిన వాక్యానివి

అప్పుడెప్పుడో కొత్త కావ్యం కోసం
మనసు పాళీతో వెచ్చవెచ్చగా చెక్కుకున్న సిరా శిల్పమై
మెరుపులు మెరుపులుగా బిత్తరపరచిన వాక్యానివి

పగళ్ళు రాత్రిళ్లను వేయ చంద్రమండలాలుగా
పండించుకున్న వెలుగు ‘పచ్చ’ మీద
దొంగచాటుగా వాలిన గ్రీష్మశిఖ
కొత్త కలల కైతలకు కట్టలు తెంచిన
కాలాల్లోకి - ఇప్పుడు - నువ్వు
జాతర కట్టిన సంరంభమై దుంకిన వాక్యానివి

చివరంచుల్ని విరగపండించి
మనసుమాలిగా పరిమళింప చేసుకుంటే
మునిమాపుల్ని, వరద నదుల్ని
కణుతులుగా తగిలించిన చేతికర్రన సిరిమువ్వవై
సిత్రచిత్ర కావ్యాలెన్నిటినో
గుండెలకెత్తుకున్న వాక్యానివి
ప్రతిసారీ ‘తవ్వకం’లో చిగుర్చే సెలయేళ్లను
కొత్త పేజీలుగా జతచేసుకుంటూ
నందివర్ధనం చెట్టును రంగుల పండుగలో
ముంచి లేపుతున్న వాక్యానివి

స్వరం తెగిన ఆనందోబ్రహ్మ కోసం
మంచుపొద్దుల మడుగును చప్పరించుకుంటున్న
ప్రాణ వేదానికి, గుమికూడిన జడివానల్ని
పులిసిపోయన ముందు కాలాల్ని
ముడుపు కట్టి ఇచ్చిన వాక్యానివి

గొంతెండుకుపోయన బతుకునెంతగా
హృదయమంతం చేసినా
ఒకే పుస్తకం కొమ్మన రెక్క ముడుచుకోవడం
పొడిబారినట్లనిపించిందో ఏమో
ఇప్పుడు నువ్వు - చెట్టు మారిన పాలగువ్వలా
పుస్తకం మారిన వాక్యానివి.

--యార్లగడ్డ రాఘవేంద్రరావు