Others

శ్రీనాథకృత శ్రీకంఠ పంచకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రచయిత:
డాక్టర్ రామవరపు శరత్‌బాబు,
252 పుటలు; రూ.250/-లు,
ప్రతులకు:
రచయిత, ప్రశాంతి సదన్,
జి1, 46-18-8,
మండావారి పేట, దొండపర్తి,
విశాఖపట్టణం- 530016 ఆం.ప్ర.
శ్రీనాథ గ్రంథ కథా ప్రపంచం.. శ్రీకంఠ పంచకం
*
వాఙ్మయంలో అనవసర గ్రంథమంటూ ఏదీ వుండదు. కానీ సాహిత్యంలో అవసర గ్రంథాలని కొన్ని తలలెత్తి దృశ్యమానమవుతాయి. అటువంటి వాటిలో ఒకటి ఈ ‘శ్రీనాథకృత శ్రీకంఠ పంచకం’. శ్రీనాథ మహాకవి ఒక విలక్షణ కవి. ఆయన రాసిన శృంగార నైషధం, హరవిలాసం, భీమేశ్వర పురాణం, శివరాత్రి మాహాత్మ్యం, శ్రీ కాశీఖండం గ్రంథాల కథల్ని హంసగమన సమాన మృదుమధుర వచనంలో ఇవ్వడంవల్ల మూలగ్రంథాల కథల్ని మూలల్లో ఉంచకుండా పాఠక ప్రజాబాహుళ్యానికి ఇచ్చే మేలు పనిచేశారు డాక్టర్ రామవరపు శరత్‌బాబు. సంస్కృతాంధ్రాల్ని డిగ్రీలను మించి చదువుకొని, అనేక అంతర్జాతీయ జాతీయ సదస్సులందు పరిశోధనా జ్ఞానపత్ర సమర్పణ చేసి, చెప్పుకోదగ్గ విశే్లషణాత్మక గ్రంథాలు 12 ఇప్పటికే వ్రాసి, ఇప్పుడీ శ్రీనాథ కథాదర్శనం ప్రజలచేత చేయిస్తున్నారు. శ్రీ కంఠపంచకం అనడం ద్వారా శైవ సంబంధ ఆపాదన తక్కిన నాల్గు పొత్తాలకూ సరిపోతుంది గాని నైషధానికి ఎలా సరిపోతుందంటే- ఛత్రి న్యాయం గొడుగు క్రింద- ‘‘నైషధం ప్రత్యక్షంగా శివుని పేర్కొనకపోయినా నల దమయంతులకు దూత అయిన ‘హంస’ శివుడేనని విద్వల్లోకం భావిస్తోంది’’ అంటారు, బలపరచుకొంటారు.
భారతీయ సంస్కృతిని సామాన్య ప్రజలకు యువతీ యువకులకు వాటి ఆత్మప్రబోధం ద్వారా ఉపకరించాలనే సత్సంకల్పంతో ‘ఆనంద లహరి’ సంస్థను శొంఠి శారదాపూర్ణ సంయుక్త ఆధ్వర్యంలో స్థాపించి ప్రధాన ఆర్ష గ్రంథాలను ప్రకటించి అదే సంస్థద్వారా ఈ గ్రంథాన్ని ప్రకటించారు. వీరి సంస్థకు కుదురు విశాఖపట్టణం.
ఈ గ్రంతంలో ప్రధానంగా కథలివ్వడం జరిగినా, రచయిత పండితుడు మంచి విశే్లషకుడూ అవడంవల్ల కొన్ని ప్రత్యేక జ్ఞానాంశాలూ తెలిపే అవకాశం వుంది.
ఉదాహరణకు శివరాత్రి మాహాత్మ్యకథను కొనసాగిస్తున్న సందర్భంలో చతుర్థాశ్వాసంలో-
శ్రీనాథుని - ‘నిష్ఠాసంపద నర్ఘ్యపాణు లగుచున్’ అనే పద్యాన్నిచ్చి విశ్వనాథ సత్యనారాయణగారి శివధనుర్భంగ ఉద్భూత ధ్వని పద్యం ‘నిష్ఠావర్షదమోఘ మేఘపటలీ’ అనే పద్యాన్ని ఇచ్చారు. శ్రీనాథుని పద్యంలో ష్ఠకారాన్ని 9సార్లు ఆవృత్తి కానిస్తే, విశ్వనాథ 4మార్లే ఆవృత్తికానిచ్చారని, అయినా ఓజోగుణం విశ్వనాథ పద్యమంతటా అల్లుకుందని, శ్రీనాథుని పద్యంలో చివరి పాదంలోనే ఓజోగుణం పరచుకొందని విశే్లషించారు. ప్రకృతి సంబంధంగా శ్రీనాథుని పద్యంలో ఓజోగుణం వర్ణనకంత నప్పదని, వీర రౌద్ర రసాల్లోనే ఆ గుణం నప్పుతుందని అంటూ కవి సమ్రాట్టు పద్యంలోనే ఔచిత్యం ఒకింత గుణోపేతంగా ఉందనడం శరత్‌బాబు సత్యదృక్పథ సద్విమర్శకు అద్దంపట్టింది.
వచనంలో శ్రీనాథుని గ్రంథ కథల్నిస్తూనే మధ్యమధ్య ప్రాణభూతమైన శ్రీనాథ పద్యాల్ని ఉల్లేఖించడం బంగారానికి తావి అబ్బినట్లైంది. అటనట మూల గ్రంథ శ్లోకాలూ కొన్ని యిచ్చారు.
‘‘నేటి యాంత్రికయుగంలో ప్రౌఢమైన భాషలోఉన్న సారస్వతాన్ని అర్థం చేసుకోగల పాండిత్యం, చదువటానికి తగిన సమయాన్ని వెచ్చించే వెసులుబాటూ లుప్తమైనందువల్ల ఉద్గ్రంథాలీవిధంగా సంక్షిప్తీకరిస్తే నేటితరం, భవిష్యత్తరం చదివి ఒక విహంగ వీక్షణ మాత్రంగానైనా మన సాహిత్యకాణాచిపై కొంతలో కొంతైనా అనురక్తి, భక్తివిశ్వాసాలు పెంపొందించుకోగలుగుతారనేదే నా ఆకాంక్ష’’ అన్నారు. రచయిత, గ్రంథం ముందరి నా మాటల్లో.
సుష్టుగా చదువుకొని, ది బెస్టు బుక్స్‌ని మాత్రమే రాసే ఈ తెలుగు శరత్‌బాబు శ్రీనాథుని సాహిత్యపు వెనె్నలను కథాభిమాన హృదయ భూములపై చక్కగా ప్రసరింపజేశారు. తన సదాశయ లక్ష్యక్రియాభాగంగా. ఈ గ్రంథం శ్రీనాథ గ్రంథ కథాప్రపంచ దర్శనంగా భావిద్దాం.

- సన్నిధానం నరసింహశర్మ