Others

జ్ఞానానికి ‘ఎర్ర రంగు’ పులిమితే ఎలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్క్సిస్టు జ్ఞాన సిద్ధాంతం
రచన: రావు కృష్ణారావు
పేజీలు: 152, వెల: రూ.120/-
ప్రతులకు:
విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్,
విజయవాడ - 520 004.
*
రెండు వర్గాల సిద్ధాంతం మార్క్సిజం. గతమంతా వర్గ పోరాటాల చరిత్ర అన్న నిర్వచనం చుట్టూ ఆ చైతన్యం పరచుకుని ఉంటుంది. మానవ మనుగడకు, రెండువర్గాల సిద్ధాంతానికి పొంతన కుదరదు.
లక్షల సంవత్సరాల మానవ మనుగడలో ‘వర్గ స్పృహ’ ఇటీవల కాలానికి సంబంధించింది. ఆ స్పృహ వెలుగులో మొత్తం మానవ చరిత్రను పరిశీలించాలని భావిస్తారు మార్క్సిస్టులు. చివరకు జ్ఞానానికి సైతం ఆ ‘‘ఎర్ర రంగు’’ను పులుముతారు. ఇది పూర్తిగా హాస్యాస్పదం. అనాలోచితం. తర్క రహితం, విచక్షణా హీనం. మనిషి కొన్ని రసాయనాల, వాయువుల సమ్మిళితంతో కూడుకున్న (ప్రాణి) వాడని అంటారు. ఈ రసాయనాలు, వాయువుల సాంద్రత లేదా అవి బయటి పరిస్థితులకు స్పందించే వైనం ఒకే తీరుగ ఉండదు. ఈ ఒక్క ప్రక్రియనే ప్రపంచాన్ని ఇంత వైవిధ్యంగా తీర్చిదిద్దింది. ఇంకా తీర్చిదిద్దుతూనే ఉంది. ఈ అతిసాధారణ సూత్రీకరణను సైతం వర్గ దృష్టితో చూస్తూ మార్క్సిస్టు జ్ఞాన సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం దానిపై పుంఖాను పుంఖాలుగా పుస్తకాలు ప్రచురించడం ఎంతటి అజ్ఞానమో ఇట్టే అర్థమవుతోంది. గురుత్వాకర్షణ శక్తిని గుర్తించడం జ్ఞానం... లిపిని రూపొందించుకోవడమూ జ్ఞానం ఇలా సమస్త ఆవిష్కరణల వెనుక మనిషి ‘అవసరం’దాగుంది. జిజ్ఞాస తొంగిచూస్తుంది. దీన్ని సైతం మార్క్సిస్టు దృష్టికోణంలో బంధించాలని భావిస్తారు మార్క్స్ అభిమానులు. దాంతో తకరారు తలెత్తుతుంది. అదే గత 170 ఏళ్లుగా కొనసాగుతూ ఉంది.
క్రీస్తుపూర్వపు బుద్ధుని చైతన్యానికి, జ్ఞానానికి అనంతరం గొప్ప విప్లవాత్మక ఆలోచనలు చేసిన ఆదిశంకరాచార్యుల చైతన్యానికి, జ్ఞానానికి హస్తిమశకాంతరం కనిపిస్తుంది. ఆధునిక శాస్ర్తియ ఆలోచనలకు చాలాముందుగానే మానవ ‘చైతన్యం’ లోతులను పసిగట్టారు. ప్రజలకు పంచారు. అలాగని ఆ చైతన్యం ఘనీభవించి అక్కడే స్థిరపడలేదు. ఆ చైతన్యం అందించిన జ్ఞానం, వెలుతురు, చూపు ఆధారంగా అనేక ఆలోచనలు వెలువడ్డాయి. దీన్నంతా వర్గపోరాటాల చరిత్రలో అంతర్భాగంగా తిలకించడం మార్క్స్ అభిమానులకు ఇష్టం. కాని వాస్తవం మరోలా ఉంది. అది కాలం కల్పించిన అద్భుత జ్ఞాన సంచయం. ఈ వాస్తవాన్ని దర్శించడానికి నిరాకరించడం దానివెనుక వర్గ ఆధిపత్యం దాగుందని తీర్పు ప్రకటించడం ‘తిక్క’ వ్యవహారం తప్ప సరైన, సవ్యమైన శాస్ర్తియ దృక్పథం ఏమాత్రం అవదు.
ఇది భారతదేశ... లేదా భరత ఖండం భావనే కాదు ప్రపంచంలోని ఇతర ప్రాచీన నాగరికతల్లోనూ మనకు కనిపిస్తుంది. ఆయా కాలాల జ్ఞానం, చైతన్యం, తెలివితేటలు ద్యోతకమవుతాయి. అన్ని నాగరికతల్లో ఒకే స్థాయి చైతన్యం, ఒకే తీరు స్పందన, ఒకే విధమైన విజ్ఞానం వెలుగుచూడదు. మనిషిలోని అవే రసాయనాలు, వాయువులు.. స్వల్ప సాంద్రత వ్యత్యాసాలతో ఇన్ని వైవిధ్యాలను, వైశిష్ట్యాలను, విస్తృత విజ్ఞానాన్ని దాచుకున్నాయి. ఆ విజ్ఞానం కాలంతోపాటు బాహ్యప్రపంచం కల్పించే ప్రేరణకు స్పందించి లక్షణంలోనూ విలక్షణత సుబోధకంగా కనిపిస్తున్నప్పటికీ దాన్ని ‘వర్గదృక్పథం’తో వీక్షించాలని, అప్పుడే శ్రామిక వర్గానికి న్యాయం జరుగుతుందని విశే్లషించి చెప్పడం విడ్డూరంగాక ఏమవుతుంది?
ప్రతి పరిణామం, ప్రతి ఆవిష్కరణ, ప్రతి చారిత్రక మలుపు కొద్దిమంది ప్రయోజనంకోసమేనని విశే్లషించడం, వింగడించడం ఏ రకంగా సమర్ధనీయమవుతుంది? తర్కానికి ఎలా నిలుస్తుంది?..
మానవాళిని రెండుగా విడదీసి చూడ్డంతో ఏర్పడిన అజ్ఞానమిది. తర్కానికి నిలవని భావ దారిద్య్రమిది. వారు చెప్పే ‘‘ఆ కొద్దిమంది’’ విడిగా ఊపిరి పీల్చుకుంటున్నవారు కాదు. వేరుగా జన్మించిన వారు కాదు. వారు మానవాళిలో అంతర్భాగమే. ఆ ‘‘కొద్దిమంది’’లోనూ ‘‘ఎక్కువమంది’’లోని చైతన్యమే, తొంగిచూస్తున్నది. అవే రసాయనాలు... వాయువులు గూడుకట్టుకుని ఉన్నాయి. ఆ చైతన్యాన్ని నిందించడం న్యాయ సమ్మతమా?... మాలోని వాడివే మా మనిషివే నీవు ఉప్పొంగిన చైతన్యంతో, ఆ చైతన్యం అందించిన జ్ఞానంతో అందనంత ఎత్తులకు ఎదుగుతున్నావు... అని స్మరిస్తున్నవారున్నారు. ఇది సత్యం... వాస్తవం. ఈ సత్యాన్ని, వాస్తవాన్ని మార్క్సిస్టు రంగు కళ్ళద్దాలతో చూడ్డం నేర్చుకోవాలని దబాయించడం ఒక రకంగా నేరం. సమూహం... సమాజం... వ్యక్తీకరణ, అనుకరణ, అనుసరణ చైతన్య కెరటం ఉత్థాన పతనాలు, ఎగుడుదిగుళ్లు వర్గ దృక్పథానికి అందనివి. దానికి ఉదాహరణలు మన సింధు నాగరికత, సుమేరియా, బాబిలోనియన్, మాయా, రోమన్ తదితర నాగరికతలను చెప్పుకోవచ్చు. ఈ భూగోళంలోని ఎనె్నన్నో నాగరికతలు ఉద్భవించి అంతరించాయి, కొన్ని పలుచనయ్యాయి. దీని వెనకాల కొద్దిమంది ప్రయోజనం... కొద్దిమంది లాభం దాగుందనుకోవడం పూర్తిగా హ్రస్వదృష్టి. ఆ హ్రస్వదృష్టితోనే కారల్ మార్క్స్ ఆలోచనలు కొనసాగాయి. లక్షల సంవత్సరాల మానవాళి కృషి, దాని ఫలితం ‘కొంతమంది’ గద్దలా తన్నుకుపోతున్నారనే సంకుచిత భావన, అనాగరిక ఆలోచన పూర్తిగా అజ్ఞానంతో కూడుకుంది. ఎప్పుడూ సత్యం... అసత్యం మధ్యనే పోరాటం జరుగుతుంది తప్ప వర్గాలమధ్య పోరాటం కాదు. కాని మార్క్సిస్టులు దీన్ని అంగీకరించరు. అంటే సత్యాన్ని అంగీకరించరన్నమాట. ఆ సంగతే ‘మార్క్సిస్టు జ్ఞాన సిద్ధాంతం’ పుస్తకం తన పరిధిలో తాను ప్రకటిస్తోంది.

- వుప్పల నరసింహం