ధనం మూలం

పైసా లేని మైఖేల్ జాక్సన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు.. లెక్కలేనంత ఆదాయం.. బంగారు ప్లేటులో, బంగారు స్పూన్‌తో తినేంత ఆస్తి. అలాంటి వ్యక్తికి మరణించే నాటికి ఎంత ఆస్తి ఉండాలి? ఆస్తి మాట దేవుడెరుగు.. పాప్ రారాజు మైఖేల్ జాక్సన్ మరణించే నాటికి నాలుగు వందల మిలియన్ డాలర్ల అప్పులో మునిగిపోయారు. ఆదాయం లేక కాదు... సంపాదించిన డబ్బును ఎలా కాపాడుకోవాలోతెలియక. మనీ మేనేజ్‌మెంట్ లేకపోవడం వల్ల అప్పుల్లో మునిగిపోయారు.
అప్పటి వరకు ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్‌లు చేసేదే డ్యాన్స్ అనుకున్న తెలుగు సినిమా ప్రేక్షకులు చిరంజీవి డ్యాన్స్ చూసి విస్తుపోయారు. ఆయనకు ఫిదా అయ్యారు. ప్రభుదేవాను చూసిన తరువాత వావ్ డ్యాన్స్ అంటే ఇదీ అనుకున్నారు. చిరంజీవి, ప్రభుదేవాలు తెలుగు వారికి తెలిసిన నటులు. ఇలా ప్రపంచంలో ఎన్నో భాషల్లో ఎంతో మంది డ్యాన్సర్లకు ఏలకలవ్య గురువు మైఖేల్ జాక్సన్.
అది శరీరమా? మైనపు ముద్దనా? శరీరాన్ని ఎలా అంటే అలా బొమ్మలా తిప్పేస్తున్నాడని ప్రపంచం ఆశ్చర్యపోయింది. అతని ఏకలవ్య శిష్యులే తిరుగులేని హీరోలుగా నిలబడితే ఇక ఆ గురువు ఎలా ఉండాలి.
నిజంగా ఎలా ఉండాలో అలా లేరు. మైఖేల్ జాక్సన్ మరణించిన తరువాత వేల కోట్ల ఆస్తుల మాట దేవుడెరుగు నిండా అప్పుల్లో మునిగిపోయాడని తెలిసి ప్రపంచం విస్తుపోయింది.
శరీరాన్ని మైనపు ముద్దలా ఎటు పడితే అటు తిప్పడంలో నైపుణ్యం సాధించారు కానీ మనీ మేనేజ్‌మెంట్‌లో మైఖేల్ జాక్సన్ ఘోరంగా విఫలమయ్యారు. తన పిల్లలకు తనను నమ్ముకున్న వారికి ఏమీ మిగల్చకుండా పోయారు.
పాప్ సామ్రాజ్యపు రారాజుగా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. 20 మంది టాప్ సింగర్స్ రంగంలో నిలిస్తే 103 దేశాల నుంచి పది మిలియన్ ఓటర్లు మైఖేల్ జాక్సన్‌ను మొదటి స్థానంలో నిలిపారు. మైఖేల్ జాక్సన్‌వి 61 మిలియన్ అల్బమ్స్ అమ్ముడు పోయాయి.
లెక్కలేనంత డబ్బు సంపాదించాడు, ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించాడు. కానీ డబ్బు వ్యవహారాలకు సంబంధించి సరైన ప్రణాళిక లేకపోవడంతో అప్పులతో జీవితాన్ని ముగించాడు. 17 మిలియన్ డాలర్లతో 1988లో కాలిఫోర్నియా వద్ద నెవర్‌ల్యాండ్‌ను కొనుగోలు చేయడమే అతనికి గుదిబండా మారిందని అంటారు. నెవర్ ల్యాండ్‌లో ఉద్యోగి కుమారుడి పట్ల అభ్యంతరకరంగా వ్యవహరించారని 2004లో మైఖేల్ జాక్సన్‌పై ఒక కేసు నమోదైంది. ఆ కేసులో అరెస్టు చేశారు. కేసులో రాజీ కోసం డబ్బు బాగానే ఖర్చు చేశాడని అంటారు. విచ్చల విడిగా డబ్బు ఖర్చు. సరైన ప్రణాళిక లేకుండా పెట్టుబడులు పెట్టడం, కోర్టులు కేసులతో నిండా మునిగిపోయారు. తనపై ఉన్న కేసుల విచారణలో న్యాయవాదులకే 22 మిలియన్ అమెరికన్ డాలర్లు ఖర్చు చేశారు. తన శరీరం రంగును మార్చుకోవడానికి వైద్య ఖర్చులకే 61వేల డాలర్లు ఖర్చు చేశారు.
ఒకవైపు కోట్ల రూపాయలు సంపాదిస్తూ, మరోవైపు తన ఖర్చుల కోసం, జాక్సన్ బ్యాంకుల్లో అప్పు కూడా చేశాడు. బ్యాంక్ ఆఫ్ అమెరికా లో రెండువందల మిలియన్ డాలర్ల అప్పు చేశాడు. 4.5 మిలియన్ డాలర్ల వడ్డీ కట్టేవారు. ప్రపంచ వ్యాప్తంగా జాక్సన్‌కు పేరు, బోలెడు సంపాదన ఉన్నా ప్రమాదాన్ని గ్రహించిన అమెరికా బ్యాంకు జాక్సన్ అప్పును ఇతరులకు అమ్మేసింది. అమెరికాలో బ్యాంకులు ఇలా అప్పులను అమ్ముకునే సౌకర్యం ఉంది. లెక్కల్లో తేడాలు ఉండొచ్చు కానీ మైఖేల్ జాక్సన్ మరణించే నాటికి నిండా అప్పుల్లో మునిగిపోయారనేది మాత్రం వాస్తవం.
ఎంతటి క్లిష్టమైన చికిత్సనైనా పొందే స్థాయిలో ఉన్న మైఖేల్ జాక్సన్ లాంటి ప్రముఖ వ్యక్తులు 7--80 ఏళ్ల వయసు వరకు కూడా హాయిగా బతకొచ్చు కానీ 48 ఏళ్లకే తనువు చాలించారు.
ఎంత సంపాదిస్తున్నారని కాదు.. సంపాదించిన డబ్బు ఎలా మేనేజ్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారనేది ముఖ్యం. సావిత్రి నుంచి మైఖెల్ జాక్సన్ వరకు అందరిదీ ఇదే కథ.
మహానటి సినిమా తరువాత ఇప్పుడు మరోసారి సావిత్రి జీవితం గురించి అందరూ చర్చిస్తున్నారు. కన్నతల్లి తప్ప నన్ను అందరూ మోసం చేశారు. స్పృహలో ఉంటే ఆ మోసాన్ని తలుచుకుంటూ ఉండలేను. అందుకే మద్యానికి అలవాటు పడ్డాను అని సావిత్రి చెప్పుకొచ్చారు. హీరోలను మించి పాపులారిటీ, డబ్బు సంపాదించిన సావిత్రి చివరి దశలో ఏమీ లేకుండా అద్దె ఇంట్లో తనువు చాలించారు. భర్త, బంధువులు, పిల్లలు, నమ్మిన వారు అందరూ ఆమెను మోసం చేశారు.
తండ్రి లేని బిడ్డ చిన్నప్పటి నుంచే బంధువుల ఇంట్లో పెరగడం, సినిమాల కోసం ప్రయత్నాలతో ఆమెకు లోకం ఎలా ఉంటుందో తెలియకుండా పోయింది.
సావిత్రి జీవితానికి మైఖేల్ జాక్సన్ జీవితానికి సంబంధం లేకపోవచ్చు కానీ..
సావిత్రి ఐనా మైఖేల్ జాక్సన్ అయినా మరెవరైనా తమ రంగంలో అత్యున్నత స్థానానికి వెళ్లి ఎంత సంపాదించినా, సంపాదించిన డబ్బును ఏం చేస్తున్నామనే అవగాహన ఉండాలి. వారి వారి రంగాల్లో వారు అత్యున్నత స్థాయికి చేరి ఉండవచ్చు. ఆ స్థానం శాశ్వతం కాదు. ఆ స్థాయి గుర్తింపు, ఆదాయం శాశ్వతం కాదు. ఎందుకంటే వయసు మీరుతుంది. ఆ రంగంలో పోటీ పెరుగుతుంది. కాలం మారుతుంది. కాలం మారినప్పుడు మన స్థానం మారవచ్చు అనే అవగాహన ఉండాలి.
ఇలాంటి వారి జీవితాలు ప్రముఖులకే కాదు. అందరికీ ఒక చక్కని పాఠం. మనీ మేనేజ్‌మెంట్ తెలియకపోతే చివరి దశలో అష్టకష్టాలు తప్పవు. జీవితం చివరి దశ కూడా బాగుండాలంటే ప్రారంభంలోనే జీవితం పట్ల సరైన అవగాహన అవసరం అని ఇలాంటి వారి జీవితాలు లోకానికి చాటి చెబుతున్నాయి.

-బి.మురళి