Others

శ్రీకృష్ణ పాండవీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు, తమ ఎన్‌ఏటి రామకృష్ణ కంబైన్స్
బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం -శ్రీకృష్ణపాండవీయం. 1966
జనవరి సంక్రాంతిన విడుదలైంది. మీర్జాపురం రాజావారు జయా ఫిలింస్ బ్యానర్‌పై 1938లో నిర్మించిన ‘శ్రీకృష్ణ జరాసంధ’ (వేమూరి గగ్గయ్య, ఎంవి రాజమ్మ కాంబినేషన్) చిత్రం కొంత ప్రేరణగా, భారత భాగవత గ్రంథాల్లోని, ఉప కథలను జోడించి సముద్రాలతో రచన చేయించి చిత్రకథను ఎన్టీఆర్ సిద్ధం చేసుకున్నారు. నెగెటివ్ పాత్రను పాజిటివ్‌గా మలచి మెప్పించగల మేటి ఎన్టీఆర్ పురాణాలను శోధించి సుయోధనుని పాత్రను మరింతగా తీర్చిదిద్ది శ్రీకృష్ణునిగా, తొలిసారి సుయోధనునిగా ద్విపాత్రాభినయం చేసిన చిత్రమిది.
రచన: సీనియర్ సముద్రాల
పాటలు: కొసరాజు, సి నారాయణరెడ్డి
నృత్యం: వెంపటి సత్యం
కళ: టివియస్ శర్మ
ఛాయాగ్రహణం: రవికాంత్ నగాయిచ్,
ఎడిటింగ్: జిడి జోషి
సంగీతం: టివి రాజు
స్టంట్లు: సాంబశివరావు, స్వామినాథన్
నిర్మాత: త్రివిక్రమరావు
చిత్రానువాదం, దర్శకత్వం:
ఎన్టీ రామారావు
కుంతీదేవి (ఎస్ వరలక్ష్మి) శ్రీకృష్ణుని (ఎన్టీఆర్) తన కుమారులకు ఎల్లవేళలా అండగా ఉండమని కోరటం చిత్ర ప్రారంభం. పాండవుల ప్రజ్ఞను ఓర్వలేని సుయోధనుడు (ఎన్టీఆర్) మనోగతం, శకుని వృత్తాంతం, వారణాసిలో పాండవుల లక్షాగృహ దహనయత్నం, శ్రీకృష్ణుని సాయంతో భీముడు కుటుంబాన్ని రక్షించుకోవటం, హిడింబి ప్రేమ, భీముడు హిడింబాసురుని సంహరించటం, భీమునికి హిడింబికి వివాహం, కుంతీదేవి కోరికపై శ్రీకృష్ణుడు రుక్మిణీ కల్యాణ ఘట్టం, ఏకచక్రపురవాసులైన పాండవులు, భీముడు బకాసురుని సంహారం, అర్జునుడు (శోభన్‌బాబు) మత్స్యయంత్రం ఛేదించి ద్రౌపదిని చేపట్టటం, తల్లిమాటపై ఆమె వారందరికీ పత్ని కావటం, ఇంద్రప్రస్తానికి వచ్చిన పాండవులు మరల భీముడు జరాసంధుని (ముక్కామల)తో పోరాడి సంహరించటం, పాండవులు రాజసూయ యాగం నిర్వహణ, సుయోధనుడు మయసభలో భంగపడటం, పాండవ ద్వేషం హెచ్చటం, యాగానంతరం శ్రీకృష్ణునికి అగ్రపూజ నిర్వహిస్తున్నందుకు పాండవులనూ, శ్రీకృష్ణునీ నిందించిన శిశుపాలుడు (రాజనాల) సుదర్శన చక్రంతో శ్రీకృష్ణుని చేత మరణించటం, విశ్వరూప సందర్శనంతో చిత్రం ముగుస్తుంది.
కొన్ని ముఖ్యపాత్రల్లో ధర్మరాజు (బాలయ్య), శకుని (్ధళిపాళ), నారదుడు (కాంతారావు), రుక్మి (సత్యనారాయణ), రుక్మిణి తండ్రి భీష్మకుడు (నాగయ్య), రుక్మిణి (కెఆర్ విజయ), చెలికత్తె మాలతి (గీతాంజలి), హిడింబి (నాగరత్నం), ధృతరాష్ట్రుడు (మల్లాది), భీష్ముడు (మిక్కిలినేని), ద్రోణుడు (కెవియస్ శర్మ), కర్ణుడు (ప్రభాకరరెడ్డి), దుశ్శాసనుడు (జగ్గారావు), అగ్నిద్యోతనుడు (వంగర) నర్తకీమణులు భారతి, తిలకం.
కథాపరంగా భీముని పాత్రకు ప్రాధాన్యం ఉండటంతో దానికి ప్రముఖ కన్నడ నటుడు ఉదయకుమార్‌ను ఎన్నుకోవటంలో ఎన్టీఆర్ విజ్ఞత గోచరిస్తుంది. భీమునిగా ఉదయకుమార్ ఆవేశకావేశాలను, కొంత చతురతను, శౌర్య, ప్రతాపాలను సన్నివేశానుగుణంగా ప్రదర్శించి ఆకట్టుకున్నారు. మిగిలిన పాత్రధారులంతా తమ ప్రజ్ఞాపాటవాలను, నటకౌశలాన్ని పాత్రలకు తగినట్టు అభినయించారు. వారిలో నయవంచక శకునిగా ధూళిపాళ, అందాలతార కెఆర్ విజయ రుక్మిణిగా తన ముగ్ధమోహన సౌందర్యంతో, లలిత శృంగారాభినయంతో మురిపించటం ఎన్నదగిన అంశాలు.
ఇక సుయోధనునిగా ఎన్టీఆర్ పాత్ర ప్రవేశంలోనే ఒక గాంభీర్యాన్ని ఆహార్యంలో తలపై పెద్దకిరీటం, వెనుకవేలాడే చేలాంచలం, పాండవులను తలచుకుంటూ పలికే మాటలు ‘దిగ్దిశాంత విశ్రాంత యశో విరాజితమై, నవఖండ భూమండల పరివ్యాప్తమైన ఈ కురుమహాసామ్రాజ్యమును శాసించు రారాజును’ అని ఒక పర్యాయము, మరోసారి మయసభలో భంగపడి ద్రౌపదిని తలచుకుంటూ ‘పాంచాలి పంచభర్తృక, నీవా నన్ను పరిహసించునది? సకల మహీపాల మకుట మాణిక్య శోభా నీరాజితుడైన రారాజును నేడొక అబల బంధకీ అపహసించుటయా’ అంటూ సన్నివేశంలో కిరీటం లేకుండా అటుఇటూ తిరుగుతూ, ద్రౌపది మంటపాల మధ్యలో ముగ్గురిగా పలువురిగా కన్పించటం, దుర్యోధనుని తలచుట్టూ వందలకొద్ది గిర్రున తిరగడం, శకుని మాటలు ఆలకించి కొంత యోచన, కొంత ఆనందం రారాజు ముఖంలో ప్రతిఫలించటం ఆకట్టుకునేలా చిత్రీకరించి అబ్బురమనిపించారు.
ఇక రెండోవైపు స్వాతికాభినయంతో కూడిన శ్రీకృష్ణునిగా చల్లని, చక్కని చిరునవ్వుతో శాంత, అభయముద్రను చేపట్టి, ఆపన్నులనాదుకోవటం, భీమునిలో పౌరుషం రేకెత్తించడంలో సుయోధనుని చెయ్యగలిగింది లేనపుడు చేయి కలపటం మంచిది అని అనునయించటం, శిశుపాలుని నిందలు చిరునవ్వుతో సహించి చివరకు ఆగ్రహంతో చక్రం ప్రయోగించటం, రెండు పాత్రలను ఎంతో కఠోర దీక్షా దక్షతలతో వైవిధ్యభరితంగా మెప్పించటం ఆ నట సార్వభౌమునికే చెల్లింది. తరువాత వచ్చిన పౌరాణిక చిత్రాల్లో 3 పాత్రలు, 5 పాత్రలు ధరించటానికిది నాంది పలికింది. దర్శకునిగా సన్నివేశాలను తీర్చిదిద్దటంలో చిత్రీకరణలో వైవిధ్యాన్ని చూపటం విశేషం.
ఛాయాగ్రాహకులు రవికాంత్ నగాయిచ్, కళాదర్శకులు టివియస్ శర్మ రూపొందించిన అద్భుతమైన మయసభ సెట్టింగ్స్, దుర్యోధనుని సభ, లాక్షాగృహం, హిడింబి నృత్య సన్నివేశం సెట్, రుక్మిణి మందిరం, బకాసురుని వద్ద ఎముకల గుట్టలు, జరాసంధుని భవనం ముందువైపు, హిడింబాసురుడు చెట్లనుండి పడిన కాయలన్నీ తినటం, భీముని దెబ్బకు అవి నోటినుంచి కింద పడడం, మత్స్యయంత్రం దానికి కృష్ణుని మురళీ అడ్డుపడడం, ఇంకా పలు సభా భవనాలు, శిల్పసుందరులు, ముఖ్యంగా మయసభలో ఓ పుష్పం శిల్పంపై తుమ్మెదలు నిజమైన పుష్పం అని భ్రమపడి తిరుగాడ్డం అద్భుతంగా చిత్రీకరించారు.
సాంబశివరావు, స్వామినాథన్‌లు ఈ చిత్రంలో భీమ, హిడింబాసుర, భీమబకాసుర, భీమ జరాసంధ యుద్ధాలను ఎంతో వివరంగా వైవిధ్యంగా రూపొందించటం మెచ్చతగినది.
టివి రాజు, ఎన్టీఆర్ కాంబినేషన్‌లోని చిత్రాల గీతాలన్నీ అమృతానంద స్వరాలతో అలరిస్తాయి. అదే కోవలోనే ఈ చిత్రంలోని గీతాలు మనకు వినిపిస్తాయి.
శ్రీకృష్ణుడు, భీమునిపైన చిత్రీరించిన గీతం, దీనిలో శ్రీకృష్ణుడు ఒకవైపు మధ్యలో శయ్యపై నిద్రిస్తున్న భీముడు, మరోవైపు మారువేషంలో శ్రీకృష్ణుడు మూడు ఒకే ఫ్రేములో చూపటం, సందేశాత్మక గీతం -మత్తువదలరా నిద్దుర మత్తు వదలరా’ (కొసరాజు- ఘంటసాల). భీముడు, బండినిండా ఆహారంతో వెళ్తూ పాడే పాట -్భళాభళీ నా బండి పరుగూతీసే బండి (కొసరాజు- మాధవపెద్ది). భీముని మోహించిన హిడింబి నాగరత్నంపై చిత్రీకరించిన గీతం -చాంగురే బంగారు రాజా గొప్పగా అలరిస్తుంది. ఈ గీతంలో -కైపున్న మచ్చకంటి చూపు/ అది చూపుకాదు పచ్చల పిడిబాకు, విచ్చిన పూరేకు..’ (సినారె -జిక్కి) అంటూ సాగే చరణానికి చేతిలో పిడిబాకు, మరో చేతిలో పూవుతో రత్నను చూపటం, మరోసారి పెద్ద శంఖంపై ఇద్దరు, ముగ్గురు, ఐదుగురిగా రత్న కన్పించటం ఉదయకుమార్‌ను కవ్విస్తూ నృత్యభంగిమలలో ఆకట్టుకోవటం చక్కని చిత్రీకరణతో సాగుతుంది. చిత్రం చివర మయసభలో సుయోధనుడు ఎన్టీఆర్, నర్తకీమణులు భారతి బృందం చక్కని నృత్యంతో సాగే అద్భుత గీతం -స్వాగతం సుస్వాగతం కురుసార్వభౌమా (సినారె -పి లీల, పి సుశీల). చక్కని సంగీతం సాహిత్యాలతో జోడుగుర్రాల్లా ఈ గీతం సాగుతుంది. మిగిలిన గీతాలు సముద్రాల రాశారు. ఎన్టీఆర్, కెఆర్ విజయపై చిత్రీకరణ, పెళ్ళికిముందు రుక్మిణి అంతఃపురంలో వారిరువురూ బయట గీతాంజలి నృత్యం, సత్యనారాయణలపై చిత్రీకరణ -ప్రియురాల సిగ్గేలనే, నీ మనసేలు మగవాని చేరి (ఘంటశాల, పి సుశీల). చక్కని అలరింపుతో సాగిన పాట నేటికీ అలరించటం విశేషం. నారదుడు కాంతారావుపై చిత్రీకరించిన గీతం -ఏమిటయా నీ లీల కృష్ణా ఎందులకీ గోల మాయాలీల’ (పిబి శ్రీనివాస్). పురోహితుడు వంగరపై చిత్రీకరించిన గీతం -కృష్ణా యదుభూషణా (పిబి శ్రీనివాస్). రుక్మిణి, శ్రీకృష్ణుల తొలిరేయి చెలుల నృత్యగీతం -నల్లనివాడైనా ఓ చెలీ చల్లనివాడేలే’ (జిక్కి, ఎల్‌ఆర్ ఈశ్వరి బృందం). పద్యాలన్నీ సీనియర్ సముద్రాల రాశారు. జరాసంధునిపై ‘దుర్మదాంధుడు/ బాందవ ద్రోహి, కపటి’, మరోపద్యం ‘సాటిరాజందునా! శాపోహతమైన’ (మాధవపెద్ది), శిశుపాలునిపై పద్యాలు ‘పిట్టనొకదాని పడమొత్తి’, పాలుదాప వచ్చిన పడతి’, కన్ను మరుగైన, అత్తకొడుకుకు నిశ్చయంబైన కన్య (పిఠాపురం), శ్రీకృష్ణునిపై చిత్రీకరించిన వికృత రూపుని నిన్ను, ఏకచక్రపురంలో పాండవులపై చిత్రీకరించిన పద్యం ‘ప్రీతినర్ధుల నాదరించు ధర్మసుతుడు (ఘంటసాల). మిగిలినవి భాగవతంలోనివి. రుక్మిణిపై ‘కనియెన్ రుక్మిణి చంద్రమండల ముఖున్’ (ఘంటసాల), ఘనుడా భూసురుడు (పి సుశీల), నమ్మితి నామనంబున’ (సుశీల), ‘ప్రాణేశా నీ మంజు భాషలు’ (సుశీల), ‘లగ్నంబెల్లి వివాహంబు’ (సుశీల), అగ్నిద్యోతనుడిపై ‘ఆయెల నాగ నీకు తగున్’ (పిబి శ్రీనివాస్), నారదునిపై ‘నల్లనివాడు పద్మ నయనంబులవాడు’ (పిబి శ్రీనివాస్), శ్రీకృష్ణునిపై పద్యం ‘వచ్చెద విదర్భ భూమికి’ (ఘంటసాల). పాటలు, పద్యాలు, అద్భుతరసానుభూతితో వీనులవిందుగా మురిపించాయి.
‘శ్రీకృష్ణపాండవీయం’ చిత్రం ఘన విజయం సాధించింది. రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారాలలో ఉత్తమ ద్వితీయ చిత్రంగా పురస్కారం పొందింది.
పిల్లలకు, పెద్దలకు మన పౌరాణికాలలో విశేషాలు ఎంతో అర్ధవంతంగా, పంచభీమ ప్రహసనం, గాంధార రాజసుతుల చెరసాల, వెనె్నముక నుంచి పావులు తయారుకావటం, శకుని దుర్బోధలకు కారణం ఇటువంటి సంగతులు అద్భుతమైన చిత్రీకరణతో వాటికి శాశ్వతత్వాన్ని ఈ చిత్రం ద్వారా కలుగచేయటం ఎంతో అభినందించదగ్గ విషయం. ఒక చరిత్రకు ఆధారంగా నిలిచిన విశిష్ట చిత్రం ‘శ్రీకృష్ణపాండవీయం’. ఈ యాభై సంవత్సరాలుగా ఈ చిత్ర గీతాలు నేటికీ నిత్యనూతనంగా విరాజిల్లటం ఓ మధురానుభూతికి ఆలవాలం కావటం ప్రత్యేక విశేషం.

-సివిఆర్ మాణిక్యేశ్వరి