AADIVAVRAM - Others

మార్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కిష్టసాగర్ గ్రామంలో పాపయ్య అనే వ్యాపారి ఉండేవాడు. అతని శక్తియుక్తులతో వ్యాపారాన్ని దినదినాభివృద్ధి చేశాడు. లాభాలు సంపాదించి బోలెడంత డబ్బు కూడబెట్టాడు. అయినా రేకుల షెడ్డులోనే భార్యాపిల్లలతో జీవితాన్ని గడిపేవాడు. సాదాసీదా దుస్తులు ధరించేవాడు. ఒక్క పైసా దానం చేసేవాడు కాదు. కిష్టసాగర్ ఊరి వారందరూ అతణ్ని ‘పిసినారి పాపయ్య’ అనేవారు.
అతని భార్యా కొడుకులిద్దరూ ‘సన్నబియ్యం తిందాం. మంచి వస్త్రాలు ధరిద్దాం. ఓ పెద్ద ఇల్లు కట్టుకుందాం’ అని ఎన్నోసార్లు చెప్పేవారు. దానికతడు ‘డబ్బు విలువ మీకు తెలియదు. కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేయకూడదు’ అనేవాడు.
‘ఎవరు సంపాదించినది వారు అనుభవించడం, తన కుటుంబం కోసం, తన కోసం సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడం వృధా కాదు కదా’ అని భార్య ఎంత చెప్పినా వినేవాడు కాదు. అతడి పిసినారితనం చూసి కొడుకులకు పెళ్ళి సంబంధాలు కూడా రావడం లేదు.
ఓ రోజు కిష్టసాగర్ నుండి రంగంపేట గ్రామానికి బంధువుల ఇంటికి వెళ్లాల్సి వచ్చింది పాపయ్య. మార్గమధ్యంలో అలసటగా ఉంటే తాగడానికి పాలు తీసుకుని నడక ప్రారంభించాడు. పాలు ఉన్న చెంబును తాడుతో ఒక కర్ర చివరికి వేలాడగట్టాడు. కర్రను భుజమీద పెట్టుకుని ఉదయమే బయల్దేరాడు. పది క్రోసుల దూరం నడవగానే ఆయాసం వచ్చింది. ఎండ బాగా ఉంది. కాసేపు విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత బయల్దేరదామని ఓ చెట్టు నీడలోకి వెళ్లాడు. చెంబు నిలబడి ఉండేలా కర్రను పక్కన పెట్టుకుని చెట్టుకింద ఒరిగాడు. చల్లగాలి వొంటికి హాయిగా తాకింది. మగత నిద్ర ఆవహించింది.
పాలచెంబు పక్కనే ఒక పుట్ట ఉంది. ఆ పుట్టలో మహిమ గల నాగరాజుకు ఆకలిగా ఉంది. నిద్రలో పాపయ్య కర్రవైపు జరిగాడు. కర్రతోపాటు పాలచెంబు కదిలి బోర్లా పడింది. అందులోని పాలన్నీ పుట్టలో పడ్డాయి. పుట్టలో పడిన పాలను నాగరాజు తాగేసి ఆకలి తీర్చుకున్నాడు. ఇంత ఎండలో తన కోసం పాలు తెచ్చి పోసిన వారికేదన్నా సహాయం చెయ్యాలనుకుని నాగరాజు పుట్టలోంచి బయటికొచ్చాడు.
ఆలోగా పాపయ్య లేచి ఖాళీ చెంబును చూసి బాధపడ్డాడు. ఆ తర్వాత బుస్సుమంటూ పడగ విప్పిన నాగరాజుని చూసి భయపడ్డాడు. దీంతో నాగరాజు ‘మానవా! భయపడకు. మండుటెండలో నాకు పాలు తెచ్చి పోసిన నీవు పుణ్యాత్ముడివి. ఆ పాలను నేను తృప్తిగా తాగాను. నీకేం కావాలో కోరుకో’ అన్నాడు.
ఊరి వారంతా తనను పిసినారి అని వెక్కిరించడం పాపయ్యకు గుర్తుకొచ్చింది. ‘నాగరాజా! నేను సంపాదించిన దాన్ని నేను అనుభవించేలా వరమివ్వు’ అన్నాడు.
నాగరాజుకి ఆశ్చర్యం వేసింది. తను సంపాదించినది తాను అనుభవించటానికి ప్రాప్తం అనేది ఉండాలి. ఇన్నాళ్లూ అది తెలుసుకోక ఎంతో ధనాన్ని కూడబెట్టాడు. కానీ సౌఖ్యం లేదు. ప్రతి ఒక్కరితోనూ ఛీత్కారాలు.. చీదరింపులు. ఆఖరికి భార్యాపిల్లలు కూడా నిష్ఠూరమాడారు. ఇదంతా మనోదృష్టితో తెలుసుకొన్న నాగరాజు ‘నువ్వు పెద్ద కోరికనే కోరావు. నా ఆకలి తీర్చినందుకు నీకు ఆ వరాన్ని అనుగ్రహిస్తాను. జీవితాంతం సుఖంగా వర్థిల్లు’ అని దీవించాడు.
నాగరాజు పుట్టలోకి వెళ్లగానే.. తనకు జ్ఞానోదయమైందని భావించాడు.
ఉన్నపళంగా ఇంటికి బయల్దేరి వెళ్లి.. కాలక్రమంలో పూరిగుడిసె స్థానంలో పెద్ద ఇల్లు కట్టుకొన్నాడు. ఆనాటి నుంచి మంచి వస్త్రాలు ధరించటం మొదలుపెట్టాడు. ఇది చూసిన గ్రామ ప్రజలు పాపయ్యలోని మార్పుని గ్రహించారు. కొద్ది నెలల్లోనే కొడుకులిద్దరికీ పేదింటి పిల్లల్ని చూసి పెళ్లిళ్లు చేశాడు.
అప్పట్నుంచీ ఆధ్యాత్మిక చింతనలో గడపటం మొదలుపెట్టాడు. తనను కలిసిన వారికి అతడు చెప్పేది ఒక్కటే. పిసినారితనం శాపం. సంపాదించినది అనుభవించాలన్నా ప్రాప్తం కావాలని.

-ఐతా చంద్రయ్య