ఓ చిన్నమాట!

ఏది ముఖ్యం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిసెంబర్ నెల వచ్చినప్పుడల్లా ఇంటిని కొంత ఖాళీ చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటాను. దినపత్రికలు, వారపత్రికలు, ప్రత్యేక సంచికలు, టెలిఫోన్ బిల్లులు, నల్లా బిల్లులు, ఎలక్ట్రిసిటీ బిల్లులు, పుస్తకాలు, వ్రాసిన కాగితాలు, పాతబడిన బట్టలు, రాసిన డైరీలు, రాయని డైరీలు, క్యాలెండర్లు, తీర్పుల ప్రతులు, ఇట్లా ఎన్నో.
పుస్తకాల షెల్ఫులు కిక్కిరిసిపోతాయి. బట్టలతో అల్మరాలు నిండిపోతాయి. దినపత్రికల కటింగ్స్‌తో అల్మరాలు నిండిపోతాయి. ఏది తీసి పారేద్దామని అనుకున్నా కష్టంగానే ఉంటుంది. ఒక కాగితం వెనుక ఎన్నో జ్ఞాపకాలు. మనస్సు ఎక్కడికో పోతుంది. చాలా వస్తువుల కాగితాలు, కటింగ్స్, రాతలు ఎలా వచ్చి చేరాయో అర్థం కాదు. కొన్ని వాక్యాలు ననే్న ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. నేనే రాశానా అని ఆశ్చర్య ఆనందానికి లోనవుతుంటాను. కొన్ని వస్తువులు - అమ్మ వాడుకున్న వస్తువులు, బాపు ఉపయోగించిన వస్తువులు ఎక్కడికో తీసుకొని వెళ్తుంటాయి. పాతపడిపోయినా పారెయ్యలేం. స్థలం లేక ఇబ్బంది పడుతూ ఉంటాను.
డిసెంబర్ నెల ఓ అగ్నిపరీక్ష పెడుతుంది. పాత రసీదులు, బట్టలు, పాతబడిన గినె్నలు, బిల్లులు, ఇలా ఎన్నో ఏది పారెయ్యాలో, ఏది పారెయ్యకూడదో తోచదు. పాత పుస్తకాలు, మాసపత్రికలు నాతో ఆటలాడుకుంటాయి. ఏది అవసరమైంది. ఏది కాదు. ఏది ముఖ్యమైంది. ఏది కాదు ఆలోచనల్లో డిసెంబర్ ఎగిరిపోతుంది.
అల్మరాని సర్దుకోవడం అంత సులువు కాదు. మన మనస్సు సర్దుకున్నంత కష్టం. ఓ కవయిత్రి ఇలా అంటుంది.
అసలైతే అరగంటలో
సర్దుకోవచ్చు ఈ అలమరని...
హృదయపు అరలు కూడా కొన్నున్నాయి
అందుకే ఇంతాలస్యం.
ఇంకా ఇలా చెబుతుంది-
ఉత్తరాలు ఊహాజగత్తులు
ప్రత్యుత్తరాల పదబంధాలు
ప్రణయ పుప్పొడి గంధాలు
హృదయంలో ముంచి రాసినవేమో
దేన్నీ తీసివేయాలనిపించదు.
* * *
జీవితపు అంచులు అనంతంలోకి
విస్తృతమయ్యేవేళ
జాలిగా బేలుగా బోలుగా
అలా నిలబడిపోకుండా
నన్ను నేను సర్దుకోవల్సిందే!
ఏది ముఖ్యమైంది? మనమే ముఖ్యం. మనలో ప్రేమించే గుణం ముఖ్యమైంది. హృదయం నిండా మంచితనం మరింత ముఖ్యమైంది. వీటిని బయట పడెయ్యకుండా జాగ్రత్తగా ఉంచితే చాలు. మిగతావి ఏవి తీసివేసినా ఫర్వాలేదు. మనల్ని మనం సర్దుకోవాలి. మనలోకి మనం తొంగి చూసుకోవాలి.

మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు, రచనలు, కార్టూన్లు, ఫొటోలు bhoomisunday@deccanmail.comకు పంపించవచ్చు.

-జింబో 94404 83001