ఓ చిన్నమాట!

ఆదరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ మూడు సంవత్సరాల క్రితం గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలను చూడాలని ప్లాన్ చేసుకున్నాం. అందులో ముఖ్యమైనవి ద్వారక, సోమ్‌నాథ్‌లు. అది డిసెంబర్ చివరి వారం. అందువల్ల హోటల్స్ దొరకవని చెప్పారు. ద్వారక, సోమ్‌నాథ్‌లలో వున్న న్యాయాధికారులని సంప్రదించాను. ప్రభుత్వ అతిథి గృహాలలో వసతి దొరకడం కష్టమని, మంచి దర్శనం చేయిస్తామని చెప్పారు. మామూలు రోజుల్లో హోటల్స్‌కి వుండే అద్దెకి ఐదింతలు ఎక్కువగా వసూలు చేస్తున్నారు. కోర్టు వాళ్లు అడిగితే లేవని చెబుతున్నారని చెప్పారు.
ఈ విషయమే ఓ న్యాయవాద మిత్రునికి చెప్పాను. అతను హైదరాబాద్‌లో వున్న బార్ కౌన్సిల్ సభ్యుడు. అతనికి పరిచయం వున్న గుజరాత్ బార్ కౌన్సిల్ న్యాయవాద మిత్రునికి చెప్పాడు. అతను వుండేది జామ్‌నగర్. అది ద్వారకకి 130 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అతనితో మాట్లాడాను. ద్వారకాలో తనకు మిత్రులున్నారని, వసతి కల్పిస్తారని సమస్య లేదని చెప్పారు.
అహ్మదాబాద్ నుంచి బయల్దేరే సమయానికి మా ట్రావెల్ ఏజెంట్ ఫోన్ చేసి ద్వారకాలో వసతి దొరికిందని చెప్పాడు. ఆ మర్నాడు రాజ్‌కోట్ నుంచి ద్వారకాకి బయల్దేరాం. మేము దార్లో వుండగా జామ్‌నగర్‌లోని న్యాయవాద మిత్రుడు మనోజ్ యం.అనద్‌కట్ ఫోన్ చేసి జామ్‌నగర్‌కి వచ్చి బ్రేక్‌ఫాస్ట్ చేసి వెళ్లమని చెప్పాడు. ఓ గంట టైం పోతుందని అనుకొని వద్దని చెప్పాను. కానీ ఆయన వినలేదు. బైపాస్‌లో వేచి వుండి వాళ్లింటికి తీసుకొని వెళ్లాడు. ఆతిథ్యం ఇచ్చాడు. జిలేబీలు, దోక్లా, పూరీ పండ్లూ కేకలు ఇట్లా ఎన్నో బ్రేక్‌ఫాస్ట్‌లో పెట్టాడు. అరగంట అని చెప్పాడు కానీ గంటన్నర అయ్యింది. అతని ఆదరణ ముందు మేం కాలాన్ని మర్చిపోయాం. ఏదో దగ్గరి మిత్రుల ఇంటికి వెళ్లినట్టు అనుభూతి చెందాం.
ద్వారకాకి బయల్దేరే ముందు మూడు కవర్లు ఇచ్చాడు. ఒక దాంట్లో స్వీట్స్, మరో దాంట్లో కేకులు, మూడవ దాంట్లో జామ్‌నగర్ కచోరీలు. వద్దంటే ఊరుకోలేదు. అతను, అతని భార్యా కారు దాకా వచ్చి సాగనంపారు. ద్వారకాలో అతని న్యాయవాద మిత్రుడు మమ్మల్ని కలుస్తాడని, అతను మా వసతి సౌకర్యాలు చూస్తాడని చెప్పాడు. అప్పటి నుంచి ఎప్పుడు ఏ ప్రయాణం చేసినా జామ్‌నగర్ న్యాయవాద మిత్రుడు మనోజ్ గుర్తుకొస్తాడు. వాళ్ల ఆదరణే గుర్తుకొస్తుంది.
అతను మాతో ఏం మాట్లాడినాడో గుర్తులేదు. కానీ అతను మాపై చూపించిన ఆదరణని ఎప్పటికీ మర్చిపోలేం. దగ్గరి స్నేహితుల దగ్గరికి వెళ్లిన అనుభూతిని అతను మాకు కల్పించాడు.
మనం ఎవరితోనైనా ఏం మాట్లాడినామో గుర్తుండకపోవచ్చు. కానీ వాళ్లు పొందిన అనుభూతిని వాళ్లను మనం చూసిన పద్ధతిని మాత్రం ఎవరూ మర్చిపోరు.

- జింబో 94404 83001