జాతీయ వార్తలు

దిగివచ్చిన కేంద్ర సర్కార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశంలోని కోట్లాదిమంది ప్రభుత్వ,ప్రైవేట్ రంగం ఉద్యోగులు గట్టిగా వ్యతిరేకించటంతో దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల భవిష్య నిధి (ఇపిఎఫ్)పై పన్ను ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మంగళవారం లోక్‌సభ జీరో అవర్‌లో తనంతట తానుగా ప్రకటన చేస్తూ ఇపిఎఫ్‌పై పన్ను విధించాలనే ప్రతిపాదనను ఉపసంహరించుకున్నట్లు వెల్లడించారు. జాతీయ పింఛన్ పథకం చెల్లింపుదారులకు కల్పించిన 40 శాతం మినహాయింపు మాత్రం యథాతథంగా కొనసాగుతుందన్నారు. దేశంలో పింఛన్ విధానాన్ని మరింత పటిష్ఠం చేయాలనే ఆలోచనతో భవిష్యనిధి విత్‌డ్రాయల్స్‌పై 60 శాతం పన్ను విధించాలని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. అయితే దీనికి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగులు, కార్మికులను దూరం చేసుకోవటం మంచిది కాదని భావించిన కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనపై దిగిరాక తప్పలేదు. ఇపిఎఫ్‌పై పన్ను ప్రతిపాదనను పునఃపరిశీలించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక మంత్రి జైట్లీకి సూచించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పన్ను ప్రతిపాదనను తీవ్రంగా తప్పుపట్టారు. చివరికి బిజెపికి అనుబంధంగా ఉన్న ఉద్యోగ, కార్మిక సంఘాలు సైతం భవిష్యనిధిపై పన్ను విధించాలన్న జైట్లీ ప్రతిపాదనను గట్టిగా వ్యతిరేకించాయి. కాగా తమ డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టాలనే అంశంపై ఉద్యోగులకు ఎక్కువ స్వేచ్ఛను కల్పించటంతోపాటు ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులకు పింఛన్ భద్రత కల్పించాలనే ఆలోచనతో పన్ను విధించాలని భావించినట్టు మంత్రి స్పష్టం చేశారు. అలాగే ఉద్యోగులు, కార్మికులు తమ భవిష్యనిధిలోని మొత్తం డబ్బును వాపస్ తీసుకోకుండా చూడటం కూడా ప్రతిపాదన లక్ష్యమన్నారు. నెలకు 15 వేల రూపాయల వరకు వేతనం తీసుకునే ఉద్యోగుల కోసం ఇపిఎఫ్ పథకాన్ని అమలు చేస్తే ఇంతకంటే ఎక్కువ వేతనం ఉన్న వారు కూడా చేరిపోయారని జైట్లీ తెలిపారు. మొత్తానికి ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు పన్ను ప్రతిపాదనను గట్టిగా వ్యతిరేకించటంతో ఉపసంహరించుకోవల్సి వచ్చిందని ఆర్థిక మంత్రి వెల్లడించారు.
కాగా జైట్లీ ఈ ప్రకటన చేసేందుకు లేవగానే కాంగ్రెస్ పక్షం నాయకుడు మల్లికార్జున ఖర్గే జోక్యం చేసుకుంటూ బడ్జెట్‌పై చర్చ జరిగే సమయంలో ఈ ప్రకటన చేయాలి తప్ప ఇప్పుడెలా చేస్తారని ప్రశ్నించారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ బదులిస్తూ ఇపిఎఫ్‌పై ప్రకటన చేసేందుకు జైట్లీకి తానే అనుమతి ఇచ్చానని అన్నారు. ఇలాఉండగా భవిష్యనిధిపై పన్ను విధించే ప్రతిపాదనను ఉపసంహరించుకోవడాన్ని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్వాగతించారు. కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ కూడా జైట్లీ ప్రకటనను స్వాగతించారు.

మంగళవారం లోక్‌సభలో ప్రసంగిస్తున్న
కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ