జాతీయ వార్తలు

హర్యానాలో మళ్లీ హింస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్: రిజర్వేషన్ల కోసం జాట్ సామాజికవర్గ ప్రజలు సాగిస్తున్న ఆందోళనలతో అట్టుడుకుతున్న హర్యానాలో సోమవారం కూడా హింసాకాండ కొనసాగింది. గత తొమ్మిది రోజుల నుంచి సాగుతున్న ఈ ఆందోళనల్లో మృతుల సంఖ్య 19గానే ఉన్నప్పటికీ ఆందోళనకారులు సోమవారం భద్రతా సిబ్బందిపై రాళ్లు రువ్వి దాడులకు పాల్పడటంతో పాటు ప్రభుత్వ వాహనాలకు నిప్పు పెట్టారు. ఆందోళనకారులు ఢిల్లీ-అంబాలా రహదారితో పాటు మరికొన్ని రోడ్లను దిగ్బంధించడంతో అడ్డంకులను తొలగించేందుకు భద్రతా దళాలను రంగంలోకి దింపాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌తో పాటు నీటి సరఫరాను ఆందోళనకారులు అడ్డుకోవడంతో వారిని చెదరగొట్టి అన్ని ప్రాంతాల్లో అడ్డంకులను తొలగించాల్సిందిగా భద్రతా దళాలను ఆదేశించినట్లు కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు ఢిల్లీలో తెలిపారు. జాట్లకు రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌ను పరిశీలించేందుకు బిజెపి కమిటీని నియమించడంతో జాతీయ రహదారులతో పాటు రాష్ట్ర రహదారులపై ధర్నాలను ఉపసంహరించుకుంటున్నట్లు ఎఐజెఎఎస్‌ఎస్ (ఆలిండియా జాట్ ఆరక్షణ్ సంఘర్ష సమితి) సోమవారం సాయంత్రం ప్రకటించింది.
సోనీపట్‌తో పాటు రోహ్తక్, కైథాల్, హిస్సార్ తదితర పలు జిల్లాలో ఆందోళనకారులు సోమవారం తాజాగా గృహదహనాలకు పాల్పడటంతో మళ్లీ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. సోనీపట్ జిల్లాలో సోమవారం ఒక రోడ్డుపై అడ్డంకులను తొలగించేందుకు ప్రయత్నించిన సైనిక, పారా మిలటరీ, పోలీసు సిబ్బందిపై ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పాటు లాఠీలతో దాడి చేశారని, ఈ దాడిలో కొంత మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారని సోనీపట్ డిసిపి రాజీవ్ రతన్ తెలిపారు. అలాగే ఆందోళనకారులు కొన్ని ప్రభుత్వ వాహనాలకు నిప్పు కూడా పెట్టారని ఆయన చెప్పారు. జాట్ ఆందోళనకారులు మునాక్ కాలువను దిగ్బంధించడంతో హర్యానా నుంచి ఢిల్లీకి నీటి సరఫరా నిలిచిపోయిన విషయం విదితమే. అయితే హర్యానా పోలీసులు, సిఆర్‌పిఎఫ్‌తో పాటు సైనిక దళానికి చెందిన దాదాపు 150 మంది సిబ్బంది సోమవారం తెల్లవారు జామున 4 గంటలకు మునాక్ కాలువను ఆధీనంలోకి తెచ్చుకున్న కొద్ది గంటలకే వారు తాజాగా దాడులకు పాల్పడ్డారని, దీంతో హిస్సార్ నగర పరిధిలోని హన్సీ సబ్-డివిజన్‌లో గల ఐదు గ్రామాలతో పాటు కైథాల్‌లో మళ్లీ కర్ఫ్యూ విధించామని రాజీవ్ రతన్ వివరించారు.
తొమ్మిది రోజుల నుంచి జాట్లు నిర్వహిస్తున్న ఆందోళనల్లో మొత్తం 19 మంది ప్రాణాలు కోల్పోయారని హర్యానా సీనియర్ మంత్రి రామ్ విలాస్ శర్మ తెలిపారు. ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ అధ్యక్షతన సోమవారం మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం మాట్లాడుతూ, రిజర్వేషన్లు కల్పించే విషయమై రానున్న శాసనసభ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టడం జరుగుతుందని, కనుక ఆందోళనలు విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. హర్యానాలో తాజాగా తలెత్తిన హింసాకాండ నేపథ్యంలో పరిస్థితిని ప్రధాని మోదీకి హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వివరించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఇటు కేంద్రం, అటు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను గురించి వివరించారు.