జాతీయ వార్తలు

బెంగాల్‌లో కాంగ్రెస్‌తో చేతులు కలపనున్న లెఫ్ట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది నెలలు మాత్రమే ఉండడంతో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్, బిజెపి కూటమిని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు ఒక కూటమిగా ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్‌తో చేతులు కలపడం ద్వారా రాష్ట్రంలో తన పలుకుబడిని విస్తరింపజేసుకోవడానికి బిజెపి శతవిధాలా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. 2014 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో దారుణంగా పరాజయం పాలయిన కాంగ్రెస్ పార్టీకి వామపక్షాలతో చేతులు కలపడం తప్ప మరో మార్గం లేదు కనుక ఆ పార్టీతో వారు పొత్తు పెట్టుకునేందుకు అవకాశాలు బాగా ఉన్నాయని మీడియాలో జోరుగా కథనాలు వస్తున్నాయి. వామపక్షాలతో పొత్తు పెట్టుకోవాలని స్థానిక కాంగ్రెస్ గట్టిగానే కోరుతోంది కానీ పార్టీ హైకమాండ్ మాత్రం దీనిపై ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదు.
ఆర్థిక సంస్కరణల్లో ప్రధానమైన జిఎస్‌టి బిల్లుకు తృణమూల్ కాంగ్రెస్ బహిరంగంగానే మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ పార్టీ కేంద్రంలో మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి వైపు మొగ్గవచ్చనే దానికి అది ఓ సంకేతమని పరిశీలకులు అంటున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ బిజెపితో చేతులు కలిపే ప్రసక్తే లేదు కనుక లెఫ్ట్ పార్టీలతో అది చేతులు కలిపేందుకే అవకాశాలున్నాయి. అంతేకాదు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని కోరుతున్న వారిలో ముఖ్యుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సిపిఎం సీనియర్ నాయకుడు బుద్ధదేవ్ భట్టాచార్య ఒకరు. తృణమూల్ కాంగ్రెస్‌ను గద్దె దింపాలంటే ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవాలని జనం కోరుకుంటున్నారని ఆయన గత వారం అన్నారు. ‘ఈ రెండు పార్టీల పొత్తు గురించి బోలెడంత మంది మాట్లాడుతున్నారు. వాళ్లంతా ఈ పొత్తు గురించి ఎందుకు మాట్లాడుతున్నారో మీరు అర్థం చేసుకోవాలి. టిఎంసిని అధికారంలోంచి దింపాలంటే మనమంతా కలిసికట్టుగా పోరాడాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వ్యక్తుల మధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయి అయితే అందరి లక్ష్యం ఒక్కటే. అది తృణమూల్‌ను ఓడించడం. అందుకు మనమంతా కలిసికట్టుగా పోరాడాలి’ అని భట్టాచార్య పార్టీ కార్యకర్తలతో అన్నారు.
పశ్చిమ బెంగాల్‌లో సిపిఎం గనుక కాంగ్రెస్‌తో చేతులు కలపడానికే నిర్ణయించుకున్న పక్షంలో దాని ప్రభావం కేరళలో ఆ పార్టీపై పడడం ఖాయం. కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. సిపిఎం బెంగాల్‌లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించుకుంటే కేరళలో బిజెపి ఈ పొత్తును తనకు అనుకూలంగా మలుచుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తుందనేది వాస్తవం. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎన్నడూ లేనంతగా కష్టకాలంలో ఉంది. అందుకే లోక్‌సభ ఎన్నికల సమయంలో పొత్తు తెగతెంపులు చేసుకున్నా త్వరలో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకోసం కరుణానిధి నేతృత్వంలోని డిఎంకెతో మరోసారి ఎన్నికల పొత్తు కుదుర్చుకున్న విషయం తెలిసిందే.

పీటర్ ముఖర్జియాపై చార్జిషీట్
ముంబయి, ఫిబ్రవరి 16: షీనా బోరా హత్య కేసులో నిందితుడు, ఇంద్రాణి భర్త పీటర్ ముఖర్జియాపై ఇక్కడి స్థానిక కోర్టులో సిబిఐ చార్జిషీట్ దాఖలు చేసింది. అడిషనల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆర్.వి.అడోన్ ఎదుట సిబిఐ మంగళవారం సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేసింది. పీటర్‌ను గత ఏడాది నవంబర్ 19న అరెస్టు చేసిన విషయం విదితమే. కాగా, పీటర్ బెయిల్ దరఖాస్తును సిబిఐ స్పెషల్ కోర్టు కొట్టివేసింది. ఇప్పటివరకు చార్జిషీట్ దాఖలు కాకపోవడం, విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో బెయిల్‌కు కోర్టు నిరాకరించింది. పీటర్ ముఖర్జియా ఆర్థర్ రోడ్ జైల్లో వుండగా, ఆయన భార్య ఇంద్రాణి బైకుల్లా మహిళా జైలులో ఉన్నారు.

కేరళలో ఆర్‌ఎస్‌ఎస్
కార్యకర్తపై సిపిఎం దాడి
తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో మృతి

కన్నూర్, ఫిబ్రవరి 16: సిపిఎం-బిజెపి మధ్య రాజకీయ హింసకు పెట్టింది పేరుగా ఉన్న కన్నూరు జిల్లాలో తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త సుజిత్ ఇంటిపై సోమవారం అర్ధరాత్రి కొందరు దుండగులు దాడి చేసి తీవ్రంగా కొట్టడంతో అతను మృతిచెందాడు. తల్లిదండ్రులు, సోదరుడు అడ్డుపడినా ఫలితం కనిపించకపోగా, వారిని సైతం గాయపరిచారు. తీవ్రంగా గాయపడిన సుజిత్‌ను ఆసుపత్రికి తీసుకువెళ్ళేలోగానే మరణించగా, గాయాల పాలైన అతని తల్లిదండ్రులు, సోదరుడ్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన సిపిఎం-బిజెపి నేతల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. దాడికి బాధ్యులుగా భావిస్తున్న సిపిఎంకు చెందిన 10మంది కార్యకర్తలను పోలీసులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సుజిత్ మరణానికి సిపిఎం బాధ్యత వహించాలని బిజెపి ఆరోపిస్తుండగా, ఒక బాలికను అవమానించడం వల్ల అతనిపై దాడి చేశారని, మాకు ఎలాంటి సంబంధం లేదని సిపిఎం ఎదురు దాడి చేసింది. బిజెపి నేత హత్య కేసులో నిందితుడైన సిపిఎం జిల్లా కార్యదర్శి పి.జయరాజన్‌కు ముందస్తు బెయిల్ రాకపోవడంతో హింసకు తెరతీసిందని బిజెపి కన్నూర్ జిల్లా అధ్యక్షుడు సత్యప్రకాష్ ఆరోపించారు. సుజిత్ హత్యకు నిరసనగా కన్నూర్, పాపినెస్సెరి, అజికోడ్ తదితర ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించేందుకు బిజెపి సన్నాహాలు చేస్తోంది. సుజిత్ ఇంటిపై జరిగిన దాడి ఘటనలో రాజకీయ కారణాలు లేవని, స్థానిక కారణాలవల్లే ఈ ఘటన చోటుచేసుకుందని, ఇందులో సిపిఎంకు ఎలాంటి సంబంధం లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కె.బాలకృష్ణన్ పేర్కొన్నారు.
కన్నూరులో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలపై నిరంతరం దాడులు జరుగుతున్నాయని, సుజిత్‌పై దాడి కూడా ఇందులో భాగమేనని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కుమ్మానం రాజశేఖరన్ ఆరోపించారు.