జాతీయ వార్తలు
గడప దాటొద్దు..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, మార్చి 21: కరోనాపై యుద్ధానికి యావత్ భారతం సన్నద్ధమైంది. ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటలు వరకు ‘జనతా కర్ఫ్యూ’ పాటించటం ద్వారా కోవిడ్-19 మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశ ప్రజలు సమాయత్తమయ్యారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలు ఇళ్లలో ఉండిపోవటం ద్వారా కరోనావైరస్ వ్యాప్తి గొలుసు తుంచేందుకు సిద్ధమయ్యారు. జనతా కర్ఫ్యూ ప్రభావం శనివారం నుంచే కనిపించటం ప్రారంభమైంది. ప్రజలందరూ శనివారం నుంచి తమ కార్యకలాపాలను వాయిదా వేసుకుని రాకపోకలను తగ్గించుకోవడం కనిపించింది. జనతా కర్ఫ్యూకు దేశ ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుండడంతో ఆదివారం రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన ఆదివారం జనతా కర్ఫ్యూను విజయవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ప్యూ పాటించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 19 తేదీ నాడు జాతికి పిలుపునిచ్చారు. కాగా జనతా కర్ప్యూ అమలును నరేంద్ర మోదీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రధాన మంత్రి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం అధికారులు జనతా కర్ఫ్యూ అమలు ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. దీనికితోడు పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పార్లమెంటు సభ్యులు ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కర్ఫ్యూను కచ్చితంగా అమలు చేసేందుకు ప్రత్యేక కృషి జరుగుతోంది. దేశంలోని నాలుగు మెట్రో నగరాలు ఢిల్లీ, ముంబయి , కోల్‌కతా, చెన్నైతోపాటు బెంగళూరు, హైదరాబాద్ తదితర పెద్ద పట్టణాలలో జనతా కర్ప్యూను విజయవంతం చేయటంపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నారని అంటున్నారు. జనాభా అత్యధికంగా ఉండే మహా నగరాలు, మెట్రో పాలిటన్ నగరాల్లో సామాజిక దూరం (సోషల్ డిస్టెన్స్)ను కొనసాగేలా చేయటం ద్వారా కరోనావైరస్ వ్యాప్తి గొలుసును తుంచాలన్నది జనతా కర్ఫ్యూ ప్రధాన లక్ష్యం. ప్రధాన మంత్రి ఇచ్చిన పిలుపును పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమర్ధించడంతో జనతా కర్ప్యూ సత్ఫలితాలను ఇస్తుందని అంచనా వేస్తున్నారు. నరేంద్ర మోదీ జనతా కర్ప్యూ పిలుపును తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు పూర్తి స్థాయిలో సమర్ధించడంతోపాటు మరో అడుగు ముందుకేసి తెలంగాణలో ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు అంటే 24 గంటలు కర్ఫ్యూ పాటించాలని రాష్ట్ర ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇలాంటి పిలుపు ఇవ్వకపోయినా జనతా కర్ఫ్యూను సమర్ధించడంవల్ల ఆదివారం అన్ని రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందని భావిస్తున్నారు. కరోనా వైరస్ ప్రాణాంతకమేనన్న వాస్తవాన్ని గ్రహించిన దేశ ప్రజలు స్వచ్ఛందంగానే జనతా కర్ఫ్యూను పాటించేందుకు సిద్ధమయ్యారు. రైళ్లు,
విమానాలు, బస్సు ప్రయాణాలను దాదాపుగా నిషేధించటం వలన రాకపోకలు పూర్తిగా స్తంభించిపోతాయని అంచనా వేస్తున్నారు. ఢిల్లీ, హైదరాబాద్, ముంబయి ఇతర నగరాల మెట్రోలు తమ సేవలను నిలిపివేస్తున్నాయి.
కరోనా వైరస్‌కు ముందస్తు జాగ్రత్తగా ఇప్పటికే పలు దేవాలయాలల్లో పూజలను నిలిపివేయటంతో పాటు ఆలయాలను కూడా మూసి వేశారు. క్రైస్తవ మత గురువులు కూడా చర్చిల్లో ఆదివారం ప్రార్థనలను దాదాపుగా నిలిపివేశారు. మామూలుగా అయితే దేశంలోని ప్రతి చర్చిలో ప్రతి ఆదివారం విధిగా ప్రార్థనలు జరగుతాయి. క్రైస్తవులందరికీ ఆదివారం విశ్రాంతి దినం కావడంతో ప్రతి కుటుంబం చర్చిలకు వెళ్తుంది. అలాంటిది నరేంద్ర మోదీ జనతా కర్ఫ్యూ పిలుపును అందుకుని ఆదివారం ప్రార్థనలను నిలిపివేశారు. మతపరమైన కార్యక్రమాలు కూడా నిలిపివేయటం వలన మంచి ఫలితాలు ఉంటాయని భావిస్తున్నారు. దేశంలోని 130 కోట్ల మంది నుండి 70 లేదా 80 శాతం మంది ప్రజల కదలికలను నిలిపివేయగలిగితే కరోనా వైరస్ వ్యాప్తి గొలుసును కొంత వరకైనా తుంచ గలుగుతామని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
ఇదిలా ఉంటే ఆదివారం రాత్రి 9 గంటలకు జనతా కర్ఫ్యూ ముగిసిన వెంటనే పెద్ద సంఖ్యలో రోడ్లపైకి రాకూడదని కర్నాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప పిలుపు ఇచ్చారు. జనతా కర్ఫ్యూ ముగిసిన వెంటనే జనం పెద్ద ఎత్తున రోడ్లపైకి వస్తే ఓ మహత్తర కార్యక్రమం లక్ష్యం దెబ్బతింటుందని ఆయన స్పష్టం చేశారు. కర్ఫ్యూ సమయం ముగిసిన తరువాత కూడా ఇళ్లలోనే ఉండాలన్న యడ్డియూరప్ప ఇదే సందేశాన్ని మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సూచించారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ రాష్ట్రంలోని ఇరవై లక్షల మంది రోజువారీ కార్మికులకు ప్రతి వ్యక్తికి వెయ్యి రూపాయల చొప్పున దిన భత్యం ప్రకటించారు. రోజువారీ కార్మికులెవ్వరు కూడా పనిలోకి వెళ్లవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
*చిత్రం... జన సంచారం లేక నిర్మానుష్యంగా మారిన ఢిల్లీ రహదారులు