జాతీయ వార్తలు
జమ్మూకాశ్మీర్ ప్రశాంతం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, మార్చి 18: జమ్మూకాశ్మీర్‌లో గత సంవత్సరం ఆగస్టులో అధికరణం 370ని రద్దు చేసినప్పటి నుంచి ఈ ఎనిమిది నెలల కాలంలో ఉన్నంత ప్రశాంతత గతంలో ఎన్నడూ లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ బుధవారం లోక్‌సభలో చెప్పారు. జమ్మూకాశ్మీర్‌కు బడ్జెట్ కేటాయింపుపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జమ్మూకాశ్మీర్‌లో కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పాలన అమలులోకి వచ్చిన తరువాత ఆ ప్రాంత ప్రజలలో కొత్త ఆశలు, ఆకాంక్షలు రేకెత్తాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన అభివృద్ధి గణాంకాలను ఉదహరించారు. జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలను నిర్బంధించడంపై ప్రతిపక్ష సభ్యులు మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ ముగ్గురిలో ఫరూక్ అబ్దుల్లా ఇటీవల విడుదలయ్యారు. అయితే, జితేంద్ర సింగ్ ప్రతిపక్ష సభ్యులపై ఎదురుదాడికి దిగారు. జమ్మూకాశ్మీర్‌లో మిలిటెన్సీ పెచ్చరిల్లిన గత 30 ఏళ్ల కాలంలో 40వేల మంది ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారని, వారి గురించి ప్రతిపక్ష సభ్యులకు ఎలాంటి బాధ లేదని, కేవలం రెండు మూడు కుటుంబాల గురించే వారు బాధ పడుతున్నారని మంత్రి విమర్శించారు. గత 30 ఏళ్లలో నిర్బంధంలో ఉన్న వారి సంఖ్యతో పోలిస్తే ఇప్పుడు నిర్బంధంలో ఉన్న వారి సంఖ్య చాలా తక్కువ అని ఉధంపూర్ ఎంపీ కూడా అయిన జితేంద్ర సింగ్ అన్నారు. అధికరణం 370ని రద్దు చేస్తే భూకంపం వస్తుందని, అగ్ని పర్వతాలు బద్ధలవుతాయని కొంత మంది దుశ్శకునాలు పలికారని, అవన్నీ తప్పని నిరూపితమయిందని మంత్రి అన్నారు. కాని, ఈ అధికరణం రద్దయిన తరువాత జమ్మూకాశ్మీర్‌లో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు 13శాతం పెరిగాయని, ఎక్సైజ్ సుంకం 7.5 శాతం పెరిగిందని, 60వేల మంది కొత్త పింఛనుదారులు వేర్వేరు పథకాలలో తమ పేర్లను నమోదు చేసుకున్నారని ఆయన వివరించారు. పీఎం ఆవాస్ యోజన పథకం కింద 2008లో కేవలం 1,008 కొత్త ఇళ్లు మాత్రమే నిర్మించగా, 2019లో 18,534 కొత్త ఇళ్లు నిర్మించడం జరిగిందని ఆయన చెప్పారు. నిధుల వినియోగం 48 శాతం పెరిగిందని ఆయన వివరించారు. అలాగే 50వేలకు పైగా కొత్త ఉద్యోగాలు సృష్టించడం జరిగిందని ఆయన చెప్పారు. ప్రతిపక్షాల ప్రకారం ఇది ‘దుష్ట స్థితి’ అయితే, జమ్మూకాశ్మీర్‌కు సంబంధించినంత వరకు ఇదే స్థితి కొనసాగుతుందని మంత్రి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒక్క ఎయిమ్స్ (అఖిల భారత వైద్య విజ్ఞానాల సంస్థ) కూడా లేదని, కాని జమ్మూకాశ్మీర్‌లో రెండు ఎయిమ్స్‌లు, ఎనిమిది నుంచి తొమ్మిది వరకు వైద్య కళాశాలలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ‘మోదీ నాయకత్వంలో జమ్మూకాశ్మీర్‌లో కొత్త కలలు, కొత్త ఆశలు, కొత్త ఆకాంక్షలు రేకెత్తాయి’ అని ఆయన అన్నారు. అధికరణం 370 రద్దు తరువాత జమ్మూకాశ్మీర్‌లో అణచివేత చర్యలు కొనసాగుతున్నట్టు దుష్ప్రచారం జరిగిందని ఆయన అన్నారు. అయితే, బ్రాడ్‌బ్యాండ్, ల్యాండ్‌లైన్, వైఫై కనెక్షన్లు పనిచేశాయని, ఉగ్రవాదులను దృష్టిలో పెట్టుకొని కేవలం మొబైల్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని మాత్రమే నిలిపివేసినట్టు ఆయన వివరించారు. ఎక్కడ కర్ఫ్యూ విధించలేదని, కేవలం సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు మాత్రమే జారీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు.