జాతీయ వార్తలు

‘కరోనా’ ఆంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 16: ప్రపంచ మహమ్మారిగా తయారైన కరోనావైరస్ ఆంక్షలు దేశ రాజధాని ఢిల్లీలోనూ మొదలయ్యాయి. ఎక్కడా 50మందికి మించి గుమిగూడడాన్ని ఈనెల 31వ వరకు నిషేధించినట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో స్పష్టం చేశారు. మతపరమైన, కుటుంబ, సామాజిక, రాజకీయ, సాంస్కతిక తదితర కార్యక్రమాలు ఎటువంటివైనా సరే 50మందికి మించి ఉండడాన్ని ఈనెల 31వరకు నిషేధిస్తున్నట్లు సీఎం వివరించారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఈ ఆంక్షలను విధిస్తున్నట్లు ఆయన చెప్పారు. వారాంతపు మార్కెట్‌లను సైతం నిర్వహించరాదని ఆదేశించామన్నారు. షాపింగ్ మాల్స్‌పైనా నిషేధం ఉన్నప్పటికీ ప్రవేశ ద్వారం వద్ద, స్టోర్ల వద్ద శానిటైజర్లను అమ్మవచ్చని చెప్పారు. షాహిన్‌బాగ్, జామియా మిలియా ఇస్లామియా వర్సిటీల వద్ద కూడా నిరసనలపై ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ ఆంక్షలను ఉల్లంఘిస్తే ఎలాంటి వారైనా సరే ఉపేక్షించేది లేదని కేజ్రీవాల్ పేర్కొన్నారు. 90 రోజులుగా పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరసత్వ రిజిస్ట్రీ, జాతీయ జనాభా రిజిస్టర్‌లను (సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్) వ్యతిరేకిస్తూ షాహిన్‌బాగ్, జామియా వర్సిటీ వెలుపల ఇంతవరకు కూర్చొని నిరసన తెలుపుతున్నారు.
ఇక్కడ కూడా ఆందోళన చేయడంపై నిషేధం విధించినట్లు సీఎం పేర్కొన్నారు. ‘మతపరమైన, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ సభలు తదితర 50మందికి మించి ఉండే ఎలాంటి కార్యక్రమమైనా సరే మార్చి 31వరకు నిషేధిస్తున్నట్లు’ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ‘జిమ్‌లు, నైట్ క్లబ్‌లు, స్పాలను’ నిలిపివేయాలని ఆదేశించామన్నారు. పెళ్లిళ్లపై నిషేధం విధించడం లేదనీ.. అయితే, కార్యక్రమాన్ని వాయిదా వేసుకోమని మాత్రం చెబుతున్నామని సీఎం పేర్కొన్నారు. ‘కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్దారమైన ఏడుగురిలో నలుగురు క్రమంగా కోలుకొంటున్నారు’ అని సీఎం తెలిపారు. కేసులు సంఖ్య పెరిగే ప్రమాదంతో పాటు వారికి చికిత్స కూడా అవసరమని భావించి ఇప్పటికే పలు ఆసుపత్రుల్లో బెడ్‌ల సంఖ్యను సరిపడినంతగా పెంచామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. లెమన్ ట్రీ, రెడ్ ఫాక్స్, ఐబిస్ హోటళ్లలో క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు సీఎం చెప్పారు. మార్చి 31వ తేదీ వరకు సినిమా తియేటర్లు, స్కూళ్లు, వర్సిటీలు పనిచేయకుండా ఆదేశాలను ఇప్పటికే చర్యలు తీసుకొన్నామని కేజ్రీవాల్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలుకు అనుగుణంగా సమన్వయంతో పనిచేసే విధంగా చర్యలు ప్రారంభించామని వివరించారు.
*చిత్రం... ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్