జాతీయ వార్తలు
సింధియా 12న బీజేపీలోకి..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ: మధ్య ప్రదేశ్‌లో రాజకీయాలు మలుపులు తిప్పి చివరకు కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన జ్యోతిరాదిత్య సింధియా ఈ నెల 12న బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. అంతేకాదు ఆ మర్నాడే బీజేపీ తరఫున రాజ్యసభకూ నామినేషన్ దాఖలు చేసేందుకు ఆ పార్టీ అధినాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంగళవారం హస్తినలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సింధియా సమావేశమైన కొద్ది సేపటికే కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన బీజేపీ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో జ్యోతిరాదిత్య సింధియాను మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలిసింది. రాజ్యసభకు పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కోసం జరిగిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో జ్యోతిరాదిత్య సింధియా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం ఉదయం కాంగ్రెస్‌కు రాజీనామా చేయగానే సాయంత్రం బీజేపీలో చేరనున్నట్లు తొలుత ప్రచారం జరిగింది. అయితే ఆయనను వెంటనే పార్టీలోకి తీసుకోకుండా 12న పార్టీలో చేర్చుకుని 13న రాజ్యసభకు నామినేషన్ వేయించాలని బీజేపీ అధినాయకత్వం నిర్ణయించినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. సింధియా 12న మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో బీజేపీ తీర్థం తీసుకోనున్నారు. సింధియా వర్గంతో పాటు బీజేపీ మధ్యప్రదేశ్ శాఖ ఈ బహిరంగ సభను ఏర్పాటు చేస్తోంది. ఈ బహిరంగ సభకు హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తదితర మంత్రులు హాజరు కానున్నారు. సింధియా రాజ్యసభ సభ్యుడైన అనంతరం కేంద్ర మంత్రివర్గంలో క్యాబినెట్ హోదా మంత్రిగా చేర్చుకోనున్నారు. ఇదిలాఉండగా సింధియా బీజేపీలో చేరడం స్వగృహానికి రావడమేనని యశోధర రాజే సింధియా ఇంకా పలువురు బీజేపీ నాయకులు వ్యాఖ్యానించారు. జ్యోతిరాదిత్య సింధియా తండ్రి మాధవ రావు సింధియా దాదాపు పది సంవత్సరాల పాటు జనసంఘ్‌లో పని చేశారు, నాయనమ్మ విజయరాజె సింధియా కాంగ్రెస్ నుంచి బీజేపీలో చాలా కాలం క్రితం చేరారు. ఈ లెక్కన జ్యోతిరాధిత్య సింధియా బీజేపీలో చేరడం స్వగృహానికి రావడం లాంటిదేనని యశోధర రాజే సింధియా అన్నారు.
సింధియా దారిలో మరికొందరు
జ్యోతిరాదిత్య సింధియా తరహాలో మరి కొందరు కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా యువ నాయకులు త్వరలోనే కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి కమలం గూటికి చేరుకోనున్నట్లు తెలిసింది. రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్, హర్యానా యువ నాయకుడు దీపేందర్ సింగ్ హుడ్డా, మహారాష్ట్ర యువ నాయకుడు మిలింద్ దేవరా తదితర నాయకులు కాంగ్రెస్‌కు రాజీనామా చేయవచ్చుననే మాట వినిపిస్తోంది. ఇదిలాఉండగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాత్రి పొద్దుపోయేంత వరకు కూడా సింధియా రాజీనామాపై స్పందించలేదు.
*చిత్రం...జ్యోతిరాదిత్య సింధియా