జాతీయ వార్తలు

పతనం అంచున కమల్‌నాథ్ సర్కార్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం పతనం అంచుకు చేరుకుంది. పార్టీ సీనియర్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసి బీజేపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేయగా ఆయన వర్గానికి చెందిన 22 మంది కాంగ్రెస్ శాసన సభ్యులు పార్టీకి, శాసనసభ్యత్వాలకు రాజీనామా చేశారు. వారు తమ రాజీనామా పత్రాలను శాసనసభ స్పీకర్ నర్మదా ప్రసాద్ ప్రజాపతికి పంపించినట్లు తెలిసింది. ఇదిలాఉంటే బెంగళూరులో మకారం వేసిన ఆరుగురు రాష్ట్ర మంత్రులు తుల్సీ సిలావత్, గోవింద్ సింగ్ రాజ్‌పుత్, ప్రభురాం చౌదరి, ఇమర్తి దేవి, ప్రద్యుమ్నసింగ్ తోమర్, మహేంద్ర సింగ్ సిసోడియాను మంత్రివర్గం నుండి తొలగించాలని ముఖ్యమంత్రి కమల్‌నాథ్ రాష్ట్ర గవర్నర్
లాల్జీ టాండన్‌కు లేఖ రాశారు. బొటాబొటి మెజారిటీతో అధికారంలో కొనసాగుతున్న కమల్‌నాథ్ ప్రభుత్వం ఏ క్షణంలోనైనా కుప్పకూలవచ్చు.
ఇదిలావుండగా, జ్యోతిరాదిత్య సింధియా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసిన అనంతరం కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్టు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. జ్యోతిరాదిత్య సింధియా ప్రధాన మంత్రిని కలిసిన కొన్ని నిమిషాలకే కాంగ్రెస్ అధినాయకత్వం ఆయనను పార్టీ నుండి బహిష్కరించింది. ఢిల్లీ, భోపాల్‌లో మధ్యప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన పరిణామాలు చకచకా జరిగిపోయాయి. జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరిన తరువాత ఆయనను రాజ్యసభకు ఎంపిక చేస్తారనే మాట వినిపిస్తోంది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం చేసిన జ్యోతిరాదిత్య సింధియాను తదుపరి కేంద్ర మంత్రివర్గం విస్తరణలో చేర్చుకున్నా ఆశ్చర్యపోకూడదని అంటున్నారు.
కాగా, సోమవారం రాత్రి ప్రత్యేక విమానంలో బెంగళూరుకు వెళ్లిన 17 మంది కాంగ్రెస్ శాసనసభ్యులతోపాటు మరో నలుగురు కాంగ్రెస్ శాసన సభ్యులు తమ రాజీనామా పత్రాలను స్పీకర్‌కు పంపించారు. శాసన సభ్యులు హర్దీప్ సింగ్ డాంగ్, రాజ్యవర్దన్ సింగ్, బ్రజేంద్ర సింగ్ యాదవ్, జస్పాల్ జజ్జి, సురేష్ ధాకడ్, జస్వంత్ జాతవ్, సంతరాం సిరోనియా, మున్నాలాల్ గోయల్, రణవీర్ సింగ్ జాతవ్, ఓపీఎస్ బడోనా, కమలేష్ జాతవ్, గిరిరాజ్ దండోతియా, రఘురాజ్ కంసానా, ఐదల్ సింగ్ కంసానా, బైసహులాల్ సింగ్ తదితరులు తమ రాజీనామా లేఖలను స్పీకర్ ప్రజాపతికి పంపించినట్లు చెబుతున్నారు. శాసనసభ స్పీకర్ నర్మదా ప్రసాద్ ప్రజాపతి ఈ శాసనసభ్యులు తమ శాసన సభ్యాత్వాలకు చేసిన రాజీనామాలను ఆమోదించిన మరుక్షణం కమల్‌నాథ్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోతుంది. కమల్‌నాథ్ ప్రభుత్వం పతనం కాగానే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ ఏర్పాట్లు చేసుకుంటోంది. మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి, జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందిన నాయకుడిని ఉప ముఖ్యమంత్రిగా నియమిస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలావుండగా, కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గత రెండేళ్ల నుండి జ్యోతిరాదిత్య సింధియాకు పెద్ద గా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఇదిలాఉంటే జ్యోతిరాదిత్య సింధియా గతంలో మధ్యప్రదేశ్ పీసీసీ అధ్యక్ష పదవి కోసం చేసిన ప్రయత్నాలను ముఖ్యమంత్రి కమల్‌నాథ్ వమ్ము చేశారు. దీనికితోడు జ్యోతిరాదిత్య సింధియా పంపించే చిన్నచిన్న సిఫారసులను సైతం కమల్‌నాథ్ తిరస్కరించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధినాయక్వం రాజ్యసభ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించడంతో జ్యోతిరాదిత్య సింధియా గత్యంతరం లేని పరిస్థితిలో బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం కాకుండా చూడాలనే గట్టి పట్టుదలతో ఉన్న మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్, ముఖ్యమంత్రి కమల్‌నాథ్, జ్యోతిరాదిత్య సింధియా మధ్య రాజీ కుదిర్చేందుకు చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు. కమల్‌నాథ్ ఏకపక్షంగా వ్యవహరించడం, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తనను ఏమాత్రం పట్టించుకోకపోవడంతో జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారని ఆయన వర్గం వారు చెబుతున్నారు. దాదాపు 18 సంవత్సరాల పాటు కాంగ్రెస్‌లో కొనసాగిన జ్యోతిరాదిత్య సింధియా నాలుగుసార్లు లోక్‌సభకు ఎంపిక కావడంతోపాటు కేంద్రంలో మంత్రిగా కూడా వ్యవహరించిన విషయం తెలిసిందే.
*చిత్రాలు.. కమలనాథ్ *జ్యోతిరాదిత్య సింధియా