జాతీయ వార్తలు

కరోనాపై ‘రెడ్ అలర్ట్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 9: యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ భారత్‌ను కూడా అనుక్షణం వణికిస్తూనే ఉంది. వ్యాధిని దీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు ఇందుకు కేంద్ర బలగాల సహాయాన్ని తీసుకోవాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఇదిలా ఉంటే.. నిన్నటి వరకు 39 కేసులు పాజిటివ్‌గా తేలగా సోమవారానికి ఈ సంఖ్య 43కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక బులెటిన్‌లో పేర్కొంది. ఆరోగ్య శాఖ వివరాల మేరకు.. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కేరళలోని ఎర్నాకులం, జమ్మూలో ఈ నాలుగు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే, ఇంతవరకు కరోనా కారణంగా ఒక్క మృతి కూడా సంభవించలేదని స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో ఆదివారం సంభవించిన మృతిపై వివరణ ఇస్తూ.. కోవిడ్ -19 అనుమానిత లక్షణాలతో అతన్ని ముర్షిదాబాద్ ఆసుపత్రిలి చేర్పించినప్పటికీ నమూనా పరీక్షల అనంతరం నెగిటివ్‌గా తేలిందనీ పేర్కొంది. సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఈ వ్యక్తిని కరోనా అనుమానిత లక్షణాలు ఉండడంతో అదుపులోకి తీసుకొని నమూనాలను పంపించగా.. నెగిటివ్ అని తేలింది. కరోనాకు సంబంధించి మూడు వేల మూడు మంది నమూనాలను పరీక్షలకు పంపగా.. రెండు వేల 694మందికి నెగిటివ్‌గా తేలింది. ఇందులో ముగ్గురికి కేరళలోని ఆసుపత్రుల్లో చికిత్స అందించి ఆరోగ్యం మెరుగుపడిన అనంతరం డిశ్చార్జ్ చేశారు. ఇదిలా ఉండగా.. వివిధ దేశాల నుంచి భారత్‌కు వచ్చిన ఎనిమిది వేల 255 విమానాల్లో విచ్చేసిన 8,74,708 మందికి ఆయా విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో అనుమానిత లక్షణాలున్నట్లుగా 1921మందిని గుర్తించారు. కేంద్ర ఆరోగ్య శాఖ కరోనాపై అప్రమత్తంగా ఉంటూనే వివిధ దేశాల నుంచి వచ్చిన వారు వారి ఆరోగ్య స్థితిపై ధ్రువీకరణ పత్రాన్ని ఎలాంటి తప్పులు దొర్లకుండా నింపి సదరు అధికారులకు అందించాలని సూచిస్తోంది. అన్ని రాష్ట్రాలు కోవిడ్-19 పట్ల అప్రమత్తంగానే ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
అప్రమత్తంగా ఉన్నాం
కరోనా వైరస్‌కు సంబంధించి ప్రభుత్వం అనుక్షణం అప్రమత్తంగానే ఉందనీ కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్ సోమవారం ఇక్కడ స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాలకు ఆయా భాషల్లో వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అవసరమైన సూచనలు ఎప్పటికప్పుడు తమ శాఖ అందిస్తోందని ఆయన తెలియజేశారు. ‘కరోనాకు సంబంధించి అన్ని రాష్ట్రాలకు సూచనలను సవివరంగా తెలియజేస్తున్నాం.. వ్యాధిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాపిడ్ యాక్షన్ బృందాలను నియమించాలని సూచించాం... మరిన్ని ఆధునిక పరికరాలతో కూడిన ల్యాబ్‌లను ఏర్పాటు చేసుకోవాలని వారికి స్పష్టం చేశాం’ అని మంత్రి పేర్కొన్నారు. ఢిల్లీలో కరోనాను ఎదుర్కొనేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సహా ఇతర మంత్రులతో సమన్వయ సమావేశం నిర్వహించామని చెప్పారు.
దేశవ్యాప్తంగా 75 ప్రత్యేక వార్డులు
కరోనా వ్యాధిని ఎదుర్కొనేందుకు వీలుగా దేశ వ్యాప్తంగా 37 ప్రాంతాల్లో ఐదువేల 400 మందికి చికిత్స అందించేందుకు క్వారంటైన్ సదుపాయాలతో కూడిన బెడ్‌లను ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర సాయుధ పోలీసు బలగాలను (సీఏపీఎఫ్) కేంద్రం ఆదేశించింది. ఈ బలగాల్లో సీఆర్‌పీఎఫ్, సరిహద్దు భద్రతా దళాలు, సీఐఎస్‌ఎఫ్, ఇండో-టిబెటిన్ సరిహద్దు పోలీసులు, సహస్త్ర సీమ బల్, ఎన్‌ఎస్‌జీ ఉంటాయి. కరోనా వ్యాధిగ్రస్థులకు అత్యవసర చికిత్స అందించేందుకు వీలుగా 75 ఐసొలేషన్ (ప్రత్యేక) వార్డులను ఏర్పాటు చేయాలని వీరికి సూచించినట్లు చెప్పారు. దేశ వ్యాప్తంగా 37 ప్రాంతాల్లోవీటిని నెలకొల్పాలని వీరికి ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. వ్యాధిని ఎదుర్కోవడమే ధ్యేయంగా క్వారంటైన్ సదుపాయాలను అందించేందుకు ఆయా బలగాలకు చెందిన డాక్టర్లు, పారా మెడికల్, శానిటేషన్ సిబ్బందిని తరలించనున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారి స్పష్టం చేశారు.
*చిత్రం...మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్