జాతీయ వార్తలు

ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌లో దీర్ఘకాలంగా నిర్బంధంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలతోపాటు అందర్నీ తక్షణమే విడుదల చేయాలని ప్రముఖ రాజకీయ పార్టీల నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీరిని నిర్బంధంలో ఉంచడానికి తగిన కారణాలేవీ లేవని, అలాగే ప్రజాప్రయోజనాలకు, జాతీయ ప్రయోజనాలకు, రాష్ట్ర ప్రయోజనాలకు వీరివల్ల ముప్పు ఉంటుందన్న దానికి ఆధారాల్లేవని ఒక సంయుక్త ప్రకటనలో ఈ పార్టీల నేతలు కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన తెలపడం కూడా ఒక భాగమని, అయితే దీనిని మోదీ సర్కారు అణచివేస్తోందని, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వాలకు తీవ్ర విఘాతం కలిగిస్తోందని ఈ నేతలు ఆరోపించారు. కుంటిసాకులతో ఈ ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులను గత ఏడు నెలలుగా నిర్బంధంలో ఉంచడాన్ని బట్టి చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో స్పష్టమవుతోందని అన్నారు. ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మాజీ ప్రధాని దేవగౌడ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా తదితరులు ఈ ప్రకటనను జారీ చేశారు. ఈ ముగ్గురు మాజీ ముఖ్యమంత్రుల గతాన్ని చూస్తే వారు ప్రజాప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించిన దాఖలాలు ఎక్కడా లేవని తెలిపారు. ప్రతిఒక్కరి అభిప్రాయాలను గౌరవించాలని, అలాగే భిన్నత్వంలో ఏకత్వ భావనకు పట్టం కట్టాలన్న రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగానే మోదీ సర్కారు వ్యవహరిస్తోందని అన్నారు. గతంలో ఎన్నడూ లేనిరీతిలో ప్రజాస్వామ్య విలువలు, ప్రాథమిక హక్కులు, పౌర స్వేచ్ఛకు తీవ్ర స్థాయిలో విఘాతం కలుగుతోందని, ఫలితంగా అసమ్మతికి ఆస్కారమే లేకుండా పోతోందని వారు ఆరోపించారు. నిరవధికంగా వీరిని నిర్బంధంలో ఉంచడం అన్నది వారి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని ఈ సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఇటీవల శ్రీనగర్‌లో విదేశీయులు చేసిన పర్యటన కూడా కేంద్ర ప్రభుత్వం ఓ పథకం ప్రకారం చేసిన ప్రయత్నమేనని అన్నారు.