జాతీయ వార్తలు

కమల్‌నాథ్ కలవరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 9: మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ప్రభుత్వం రాజకీయ సంక్షోభంలో కూరుకుపోతోంది. పరిస్థితి దిన దిన గండంగా మారడంతో పార్టీ అధిష్ఠానం ఆందోళన చెందుతోంది. గత వారం అకస్మాత్తుగా మాయమైన పది మంది కాంగ్రెస్ శాసన సభ్యుల అచూకీ తెలుసుకుని వారికి నచ్చజెప్పి ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలని తంటాలు పడిన ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు ఇప్పుడు సొంత పార్టీ అసమ్మతి నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందిన 18 మంది శాసన సభ్యులు ఝలక్ ఇచ్చారు. జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందిన ఐదుగురు రాష్ట్ర మంత్రులు, 13 మంది శాసన సభ్యులు భోపాల్‌లో మాయమై బీజేపీ అధికారంలో ఉన్న కర్నాటక రాజధాని బెంగళూరులో ప్రత్యక్షం కావడంతో కమల్‌నాథ్ కలవరపడ్డారు. కమల్‌నాథ్ మంత్రివర్గానికి చెందిన ఐదుగురు మంత్రులతో పాటు మొత్తం 18 మంది రహస్యంగా బెంగళూరుకు వెళ్లిపోవడమే కాకుండా తమ సెల్ ఫోన్‌లను స్విచ్ ఆఫ్ చేసుకున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి కమల్‌నాథ్ దేశ రాజధాని ఢిల్లీకి వచ్చి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో మంత్రివర్గం విస్తరణ, రాజ్యసభ టికెట్ల కేటాయింపు గురించి చర్చలు జరపనున్న సమయంలో ఒకేసారి ఐదుగురు మంత్రులు, 13 మంది శాసనసభ్యులు బెంగళూరుకు చేరుకోవడంతో కాంగ్రెస్‌లో కలకలం ప్రారంభమైంది. గత వారం మాయమైన వారిలో 8 మంది మాత్రమే వెనకకు వచ్చారు. మిగతా ఇద్దరు శాసనసభ్యులు, రఘురాజ్‌సింగ్ కంసానా, హర్దీప్‌సింగ్ డాంగ్‌ల ఆచూకీ ఇంత వరకు తేలలేదు. వారిప్పటికి బెంగళూరులో బీజేపీ సంరక్షణలో ఉన్నారనే మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఒకేసారి ఐదుగురు మంత్రులు, 13 మంది శాసన సభ్యులు బెంగళూరులో ప్రత్యక్షం కావడంతో కమల్‌నాథ్ ప్రభుత్వం ఉంటుందా? ఊడుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత వారం మాయమైన వారితో పాటు మరికొందరిని మంత్రివర్గంలో చేర్చుకోవడం ద్వారా తమ ప్రభుత్వం పతనానికి అడ్డుకట్టవేయాలని కమల్‌నాథ్ ప్రయత్నిస్తుంటే మరో 18 మంది బెంగళూరుకు వెళ్లిపోయారు. దీనితో కమల్‌నాథ్ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చుననే అనుమానాలు బలపడుతున్నాయి. బీజేపీ అధినాయకత్వం తెర వెనక నుంచి ఇదంతా నడిపిస్తోందని కమల్‌నాథ్ ఆరోపిస్తున్నారు. అయితే బీజేపీ నాయకులు మాత్రం ఇదేది నిజం కాదని వాదిస్తున్నారు. కాంగ్రెస్
సభ్యులు తమంత తాము బెంగళూరుకు వెళితే తమను నిందించడం దేనికన్నది వారి ప్రశ్న. మధ్యప్రదేశ్ శాసన సభలో మొత్తం 230 సభ్యులుంటే కమల్‌నాథ్ వద్ద 114 మంది కాంగ్రెస్ సభ్యులతో పాటు కొందరు స్వతంత్ర సభ్యులున్నారు. కమల్‌నాథ్ అతి స్వల్ప మెజారిటీతో ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నారు. కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఒకవైపు బీజేపీ తెర వెనక రాజకీయం కొనసాగిస్తుంటే కాంగ్రెస్ అసమ్మతి నాయకుడు జ్యోతిరాధిత్య సింధియా ప్రత్యక్షంగానే రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. కమల్‌నాథ్‌కు జ్యోతిరాధిత్య సింధియా మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటోంది. కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని పతనం చేయాలనే పట్టుదల బీజేపీ కంటే జ్యోతిరాధిత్య సింధియాకు అధికంగా ఉన్నదని కొందరు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని పతనం చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని తాము ఆరోపిస్తున్నా వాస్తవానికి జ్యోతిరాధిత్య సింధియా అసమ్మతి మూలంగానే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పతనం కావచ్చునని కొందరు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.

*చిత్రం... మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్