జాతీయ వార్తలు

కాంగ్రెస్‌కు రాహులే శరణ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 8: కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహించడానికి అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడు రాహుల్ గాంధీయేనని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి అజయ్ మాకెన్ స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ అధ్యక్ష పదవిని ఆయన మళ్లీ చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. పార్టీలోని సీనియర్ నాయకులు క్రమంగా తప్పుకుని యువతకు అవకాశాలు కల్పించాలని స్పష్టం చేసిన మాకెన్ ‘కాలంతోపాటు సీనియర్ నేతల ఆలోచనలు మారకపోతే ప్రజలు పార్టీ విధేయతలనే మార్చుకోవాల్సి వస్తుంది’ అని అన్నారు. పార్టీ అధ్యక్ష పదవిని రాహుల్ చేపట్టడానికి ఇంతకుమించిన తరుణం మరొకటి లేదని, ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనకు ప్రత్యామ్నాయమే లేదని మాకెన్ ఉద్ఘాటించారు. ఇటు బీజేపీని, అటు ప్రధాని నరేంద్ర మోదీని అన్ని స్థాయిల్లోనూ ఎదుర్కోగలిగే సత్తా ఒక్క రాహుల్ గాంధీకే ఉందని అన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రస్తుత తాత్కాలిక అధ్యక్ష పదవిలో ఉన్న సోనియా గాంధీ అనుభవం, నైపుణ్యం కూడా పార్టీకి ఎంతో అవసరమని, కొత్తగా పగ్గాలు చేపట్టే వ్యక్తికి ఆమె చేయూత ఎంతో అవసరమని మాకెన్ తెలిపారు. ఇందుకు వీలుగా ఈ పదవిలో సోనియా గాంధీ కొనసాగేలా పార్టీ నియమావళిలోనే మార్పులు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రస్తుత అవసరాలను గుర్తించి కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపించడానికి రాహుల్ గాంధీ ముందుకు రావాలని, ఇందుకు అనేక బలమైన కారణాలు కూడా ఉన్నాయని మాకెన్ తెలిపారు. రైతులు, దళితులు, మైనారిటీల కోసం పోరాడుతున్న ఘనత కూడా రాహుల్‌కు ఉందని, ఇవన్నీ కూడా పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఆమోదయోగ్యతను చాటిచెబుతున్నాయని అన్నారు. ఈ విషయంలో ఇంకెంతమాత్రం జాప్యం చేయకుండా తక్షణమే రాహుల్ గాంధీ కాంగ్రెస్ సారథ్యాన్ని చేపట్టాలని, తద్వారా అయోమయం, అనిశ్చితికి తెరదించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా పునర్నిర్మించడంతోపాటు సంకుచిత, ప్రాంతీయ ధోరణులకు అతీతంగా దీనిని తీర్చిదిద్దడానికి రాహుల్ తక్షణమే ముందుకు రావాలని అన్నారు. అలాగే మాటల్లో కాకుండా చేతల్లో నిజాయితీని కనబరిచే రాహుల్ గాంధీ లాంటి నాయకుడు అవసరం దేశానికి ఎంతో ఉందని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో ఆర్థిక వ్యవస్థ దివాలా తీస్తోందని, సామాజికంగా కూడా ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. ఇంత జరుగుతున్నా దేశ రాజధాని నగరమే అల్లర్లతో అట్టుడికినా ప్రస్తుత ప్రభుత్వం ఏమీ చేయలేకపోయిందని తెలిపారు. నరేంద్ర మోదీ మాటలు వినే ప్రజలు ఓటేశారు తప్ప ఆయన మనసులోని అసలు ఉద్దేశాన్ని చూసి కాదని మాకెన్ తెలిపారు. కాంగ్రెస్‌లో వృద్ధ నాయకత్వం స్థానే నవనాయకత్వం రావాల్సిన అవసరం ఎంతో ఉందని, అయితే ఈ మార్పు ఆకస్మికంగా కాకుండా క్రమానుగతంగా రావాలని మాకెన్ తెలిపారు. ప్రజల ఆలోచనలు, అభిమతాలకు అనుగుణంగా పార్టీల తీరు కూడా మారాల్సిన అవసరం ఉందని అన్నారు. అయితే, ప్రస్తుత బీజేపీలో సీనియర్ నేతలు సలహాదారుల పాత్రలకు పరిమితమైనట్టుగా కాంగ్రెస్‌లోని సీనియర్లు కూడా కావాలనుకుంటే స్వచ్ఛందంగా ఆ భూమిక నిర్వహించవచ్చునని అన్నారు.

*చిత్రం... పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి అజయ్ మాకెన్