జాతీయ వార్తలు

జమ్మూలో కరోనా అనుమానితులు పరార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ, మార్చి 5: జమ్మూలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రి ఐసొలేషన్ వార్డులో ఉన్న ఇద్దరు కరోనా అనుమానితులు పరారయ్యారు. ఎట్టకేలకు వారిని వెతికి పట్టుకోవడంతో ఆసుపత్రి సిబ్బంది ఊపిరి పీల్చుకొన్నారు. ఆసుపత్రి అధికారుల కథనం మేరకు.. ఇటలీ, దక్షిణాఫ్రికాల్లో పర్యటించి జమ్మూకు వచ్చిన ఇద్దరు పర్యాటకులను కరోనా అనుమానితులుగా భావించి అదుపులోకి తీసుకొని ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసొలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వీరికి సంబంధించిన నమూనాలను పూణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ)కి పంపారు. రిపోర్టులు రావల్సి ఉండగా.. బుధవారం అర్ధరాత్రి అనుమానిత వ్యక్తి బంధువు బలవంతంగా అతన్ని ఆసుపత్రి నుంచి తీసుకుపోయాడు. ఇదే అదనుగా భావించి మరో అనుమానిత వ్యక్తి కూడా అక్కడినించి జాగ్రత్తగా పరారయ్యాడు. ఆసుపత్రి చుట్టూ కట్టుదిట్టమైన బందోబస్తు ఉన్నప్పటికీ వీరిద్దరూ పరారు కావడంతో అప్రమత్తమైన యంత్రాంగం పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మొత్తమీద వెతికి ఇద్దరినీ అదుపులోకి తీసుకొని ఆసుపత్రి వార్డులో చేర్పించారు. ఒకవేళ నమూనా నివేదకలో పాజిటివ్ అని తేలితే ఇద్దరినీ నిర్బంధంగా వార్డులోనే ఉంచి వైద్య చికిత్స అందిస్తామనీ కరోనా వ్యాధి నియంత్రణ కోసం నోడల్ అధికారిగా నియమించిన డాక్టర్ షఫ్కత్‌ఖాన్ గురువారం విలేఖరులకు తెలిపారు. అనుమానిత లక్షణాలున్న వారినెవరినైనా ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తామని ఆయన వివరించారు. దేశ వ్యాప్తంగా చూస్తే 16మంది ఇటాలియన్లు సహా 29 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయనీ ఆయన పేర్కొన్నారు. వివిధ దేశాల నుంచి ఈ ప్రాంతానికి వచ్చే పర్యాటకులు లేదా మరెవరైనా సరే వారికి సంబంధిత పరీక్షలు నిర్వహించిన అనంతరం విడిచిపెడుతున్నట్లు ఆయన వివరించారు. జమ్మూ కేంద్ర పాలిత ప్రాంతంలో కరోనా పాజిటివ్‌తో ఒకరు మరణించారంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను నమ్మవద్దని ప్రజలకు సూచించామనీ.. ఎలాంటి కరోనా మరణాలు ఇక్కడ సంభవించలేదని ఆయన స్పష్టం చేశారు.