జాతీయ వార్తలు

లోక్‌సభలో రభస రభస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 5: లోక్‌సభ స్పీకర్ టేబుల్ పైనుంచి పత్రాలను లాగివేసినందుకు కాంగ్రెస్‌కు చెందిన ఏడుగురు సభ్యులు సస్పెన్షన్‌కు గురయ్యారు. కాంగ్రెస్ సభ్యులు గౌరవ్ గొగోయ్, టీఎన్ ప్రతాపన్, డీన్ కురియాకోస్, బెన్నీ బెహనమ్న్, మణిక్కం టాగోర్, రాజమోహన్ ఉన్నిథన్, గుర్జీత్ సింగ్ ఔజియాపై సస్పెన్షన్ వేటు పడింది. ప్యానెల్ స్పీకర్ మీనాక్షి లేఖి బడ్జెట్ రెండో విడత సమావేశాలు ముగిసేంత వరకు ఏడుగురు కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసంలో కరోనా వైరస్ కుట్ర జరుగుతోందని బీజేపీ సభ్యుడు హనుమాన్ బేనివాల్ చేసిన ఆరోపణకు నిరసనగా కాంగ్రెస్ సభ్యులు గురువారం లోక్‌సభను పలుమార్లు స్తంభింపజేశారు. మైనింగ్ సవరణ చట్టంపై ఓడింగ్ జరుగుతున్న సమయంలో పోడియం వద్ద గొడవ చేస్తున్న పలువురు కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ టేబుల్ పైఉన్న పత్రాలను లాగివేసి వాటిని ముక్కలుగా చింపి గాలిలో ఎగురవేశారు. దీంతో సభలో తీవ్ర స్థాయిలో గందరగోళం నెలకొంది. మొదట ఢిల్లీ అల్లర్లపై గొడవ చేసిన కాంగ్రెస్ తదితర పక్షాల సభ్యులు ఆ తరువాత సోనియా గాంధీని విమర్శించిన బీజేపీ సభ్యుడు హనుమాన్ బేనివాల్‌పై చర్య తీసుకోవాలంటూ సభలో పెద్ద ఎత్తున గొడవ చేశారు. కాంగ్రెస్ ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ సభా కార్యక్రమాలకు పలుమార్లు అడ్డుపడటంతో లోక్‌సభ గురువారం మూడు సార్లు వాయిదా పడింది. ప్యానెల్ స్పీకర్ మీనాశ్రీ లేఖి మొదట సభలో గొడవ చేసిన ఏడుగురు ఎంపీల పేర్లు ప్రస్తావిస్తూ వీరిని ‘నేమ్’ చేస్తున్నానని ప్రకటించారు. అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ స్పీకర్ టేబుల్ పై నుండి పత్రాలు లాగేసి సభా మర్యాదలకు విరుద్ధంగా వ్యవహరించిన ఏడుగురు కాంగ్రెస్ సభ్యులను రెండో విడత బడ్జెట్ సమావేశాలు పూర్తి అయ్యేంత వరకు సభ నుంచి సస్పెండ్ చేయాలనే తీర్మానాన్ని ప్రతిపాదించారు. ప్యానెల్ స్పీకర్ మీనాక్షి లేఖి మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రతిపాదించిన తీర్మానాన్ని సభ ముందు పెట్టి మెజారిటీ సభ్యుల మద్దతు మేరకు ఏడుగురు కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేశారు. సస్పెన్షన్‌కు గురైన ఏడుగురు కాంగ్రెస్ సభ్యులు తక్షణమే సభ నుండి వెళ్లిపోవాలని మీనాక్షి లేఖి ఆదేశించారు. అయితే పోడియం వద్ద గుమిగూడిన సస్పెండైన సభ్యులతోపాటు ఇతర కాంగ్రెస్, ప్రతిపక్షం సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ సభను స్తంభింపజేశారు. దీంతో స్పీకర్ స్థానంలో ఉన్న మీనాక్షి లేఖి సభను శుక్రవారం ఉదయం వరకు వాయిదా వేసి వెళ్లిపోయారు.
లోక్‌సభ గురువారం ఉదయం సమావేశమైనప్పటి నుంచి సభలో గొడవ, గందరగోళం నెలకొంది. ఢిల్లీ అల్లర్లపై చర్చ జరపాలంటూ కాంగ్రెస్ సభ్యులు తీవ్ర స్థాయిలో గందరగోళం సృష్టించారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని నిర్వహించిన సీనియర్ బీజేడీ సభ్యుడు బర్తృహరి మెహతాబ్ ప్రతిపక్ష సభ్యులకు నచ్చ జెప్పేందుకు తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో ఆయన సభను మధ్యాహ్నం పనె్నండు గంటల వరకు వాయిదా వేసి వెళ్లిపోయారు. లోక్‌సభ తిరిగి సమావేశమైనప్పుడు ప్యానెల్ స్పీకర్ రాజేంద్ర అగర్వాల్ మొదట ప్రభుత్వ పత్రాలను సభకు సమర్పింపజేసిన అనంతరం జీరో అవర్‌లో కరోనా వైరస్‌పై సభ్యులు మాట్లాడేందుకు అనుమతి ఇచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ హనుమాన్ బేనివాల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనావైరస్ సోకిన వారిలో ఎక్కువ మంది ఇటలీ నుంచి వచ్చారంటే సోనియా గాంధీ నివాసంలో ఈ మేరకు ఏదో కుట్ర జరుగుతోందనే అనుమానం కలుగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. బేనివాల్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. వారంతా పోడియం వద్దకు దూసుకొచ్చి హనుమాన్ బేనివాల్‌పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు ఇచ్చారు. కొందరు కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ టేబుల్‌పై ఉన్న పత్రాలను లాగివేసేందుకు ప్రయత్నించారు. ఈ దశలో ప్యానెల్ చైర్మన్ రాజేందర్ అగర్వాల్ సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేసి వెళ్లిపోయారు. లోక్‌సభ రెండు గంటలకు సమావేశమైనప్పుడు కూడా సభ సద్దుమణగలేదు. కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకు వచ్చి గొడవ చేశారు. స్పీకర్ స్థానంలో ఉన్న ప్యానెల్ చైర్మన్ రమాదేవి ప్రతిపక్షం గొడవ, గందరగోళం మధ్యనే మైనింగ్ సవరణ బిల్లుపై చర్చ చేపట్టారు. అప్పటికే పోడియం వద్ద నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూన్న కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ టేబుల్‌పై ఉన్న పత్రాలను లాగేశారు. వాటిని ముక్కలుగా చించేసి గాల్లోకి ఎగరేశారు. కాంగ్రెస్ సభ్యుల ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో సభ దద్దరిల్లిపోయింది. కాంగ్రెస్ సభ్యుల నినాదలతో స్తంభించిపోయిన సభను ప్యానేల్ స్పీకర్ రమాదేవి సాయంత్రం మూడు గంటల వరకు వాయిదా వేశారు. లోక్‌సభ తిరిగి సమావేశం కాగానే సభా కార్యక్రమాలు నిర్వహించేందుకు వచ్చిన ప్యానెల్ చైర్మన్ మీనాక్షి లేఖి మధ్యాహ్నం రెండు గంటలకు స్పీకర్ టేబుల్‌పై నుండి పత్రాలను లాగివేసిన ఏడుగురు కాంగ్రెస్ సభ్యులను ‘నేమ్’ చేశారు. ఇది జరిగిన వెంటనే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి లేచి ఏడుగురు సభ్యులను సస్పెండ్ చేయాలనే తీర్మానాన్ని ప్రతిపాదించారు. బడ్జెట్ రెండో విడత సమావేశాలు ముగిసేంత వరకు ఏడుగురు సభ్యులను సభ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ఆమె ప్రకటించగానే కాంగ్రెస్ సభ్యులు పెద్ద ఎత్తున గొడవ చేశారు. అయితే మీనాక్షి లేఖి అప్పటికే లోక్‌సభను శుక్రవారానికి వాయిదా వేసి వెళ్లిపోయారు.