జాతీయ వార్తలు

కార్మిక కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: మూడున్నర కోట్ల మంది కార్మికులు, వారిపై ఆధారపడిన 12 కోట్ల మంది కుటుంబ సభ్యుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి సంతోష్‌కుమార్ గంగ్వార్ అన్నారు. కాకినాడ సాంబమూర్తినగర్‌లో రూ.110 కోట్లతో నూతనంగా నిర్మించనున్న 100 పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రికి కేంద్ర మంత్రి గంగ్వార్ బుధవారం భూమి పూజ నిర్వహించారు. ఆసుపత్రిని కేంద్రం మంజూరు చేసినా, నిధులు మాత్రం కార్మికులు తమ వేతనాల నుండి కంట్రిబ్యూషన్ ద్వారా సమకూర్చినవేనన్నారు. కార్మికులు 1.75 శాతం, యాజమానులు 4.25 శాతం మొత్తం కలిపి 6 శాతం కంట్రిబ్యూషన్ చెల్లించేవారని, ఈ మొత్తాన్ని 4 శాతానికి తగ్గించామన్నారు. దేశం మొత్తం మీద ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని ఈఎస్‌ఐ ఆసుపత్రులే బాగా పనిచేస్తున్నాయన్నారు. అందులో హైదరాబాద్ ఆసుపత్రి ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి తెలిపారు. కార్మిక సంక్షేమమే లక్ష్యంగా ఈఎస్‌ఐ ఆధ్వర్యంలో దేశంలో 154 ఆసుపత్రులు, 1500 డిస్పెన్సరీలు, 815 బ్రాంచి ఆఫీసులు, 63 రీజనల్, సబ్ రీజనల్ ఆఫీసులు పనిచేస్తున్నాయన్నారు. కాకినాడ ఆసుపత్రిని ఏడెకరాల సువిశాలమైన స్థలంలో నిర్మిస్తున్నామని, కాకినాడ, యానాం ప్రాంతాలలో పనిచేస్తున్న 63వేల మంది కార్మికులు, వారిపై ఆధారపడిన 2.45 లక్షల కుటుంబ సభ్యులకు ఈ ఆసుపత్రి ద్వారా మెరుగైన వైద్య సేవలు అందుతాయని కేంద్ర మంత్రి వివరించారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ కాకినాడలో నిర్మిస్తున్న ఆసుపత్రి ద్వారా కార్మికుల కుటుంబాలకు 14 రకాల సేవలు అందుతాయన్నారు. ఇటీవల విజయనగరంలో 100 పడకల ఆసుపత్రికి భూమిపూజ చేయగా, నేడు కాకినాడలో భూమిపూజ చేశామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈఎస్‌ఐ కుంభకోణంలో సుమారు రూ.300 కోట్లు దోచుకున్నారని, ఈ అక్రమాలకు పాల్పడిన వారంతా జైలుకెళ్లడం ఖాయమన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ కాకినాడ నగర పరిసరాల్లోని ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులు కాలుష్యం కారణంగా కేన్సర్‌కు గురవుతున్నారని, అందువల్ల కాకినాడ ఈఎస్‌ఐ ఆసుపత్రిని కేన్సర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ స్థాయికి తీసుకెళ్లాలని కేంద్ర మంత్రి గంగ్వార్‌కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీలు వంగా గీత, చింతా అనూరాధ, కార్మిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బి ఉదయలక్ష్మి, ఈఎస్‌ఐ మెడికల్ కమిషనర్ ఆర్‌కే కటారియా, ఎమ్మెల్సీలు చిక్కాల రామచంద్రరావు, సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కాకినాడ నగర మేయర్ సుంకర పావని, తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ జి లక్ష్మిశ, ఈఎస్‌ఐ రీజనల్ డైరెక్టర్ వి కాశినాథన్ తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం... ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న కేంద్ర మంత్రి గంగ్వార్