జాతీయ వార్తలు

వెనక్కి తగ్గేదే లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారణాసి, ఫిబ్రవరి 16: ఎంతగా ఒత్తిళ్లు వచ్చినా పౌరసత్వ సవరణ చట్టం, 370 రాజ్యాంగ అధికరణ రద్దు నిర్ణయాలపై వెనక్కి తగ్గేది లేదని ప్రధాని నరేంద్ర మోదీ విస్పష్టంగా ప్రకటించారు. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయాల విషయంలో ప్రభుత్వం చాలా గట్టిగా నిలబడుతుందని, అన్నివైపుల నుంచి ఎంత తీవ్రమైన ఒత్తిళ్లు వచ్చినా రాజీ పడదని తెలిపారు. ఈ రెండు నిర్ణయాల కోసం దేశప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూశారని, వారి ఆకాంక్షలను ప్రతిబింబిస్తూనే తమ ప్రభుత్వం ముందుకెళ్లిందని తెలిపారు. ఆదివారం తన లోక్‌సభ నియోజకవర్గమైన వారణాసిలో పర్యటించి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న మోదీ అనంతరం ఓ బహిరంగ సభలో మాట్లాడారు. కాశ్మీర్‌కు సంబంధించి 370 అధికరణ రద్దు, అలాగే పౌరసత్వ సవరణ చట్టం వంటి నిర్ణయాలు దేశానికి ఎంతో అవసరమని అన్నారు. పౌరసత్వ చట్టంపై దేశవ్యాప్తంగా వారాల తరబడి తీవ్ర స్థాయిలో ఆందోళనలు జరుగుతున్న తరుణంలో ప్రధాని చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత చేకూరింది. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు తీసుకున్న పలు కీలక నిర్ణయాలను మోదీ ప్రస్తావించారు. ముఖ్యంగా అయోధ్య రామాలయ నిర్మాణానికి ఓ ట్రస్టును ఏర్పాటు చేశామని, అది నిర్దేశిత కర్తవ్యాన్ని త్వరితగతిన పూర్తి చేస్తుందని అన్నారు. 1,254 కోట్ల రూపాయల వ్యయమయ్యే 50 ప్రాజెక్టులకు ప్రధాని మోదీ ఇక్కడ శంకుస్థాపన చేశారు. వీడియో లింక్ ద్వారా ఐఆర్‌సీటీసీ మహాకాళ్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు. వారణాసి, ఉజ్జయిని, ఓంకారేశ్వర్‌లోని జ్యోతిర్లింగాలను సంధానం చేస్తూ ఈ ప్రైవేటు రైలు నడుస్తుంది. అలాగే, పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ సంస్మరణ కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు. అలాగే, 63 అడుగుల ఆయన విగ్రహాన్నీ ఆవిష్కరించారు. దీన్‌దయాళ్ స్ఫూర్తితోనే తాము ముందుకు సాగుతున్నామని, దళితులు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నామని మోదీ అన్నారు. గత కొనే్నళ్లలో దాదాపు 25వేల కోట్ల విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులను వారణాసిలో చేపట్టామని తెలిపారు. భారతదేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాధించాలంటే పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని, దేశంలోని అన్ని వారసత్వ, మత ప్రాంతాలను అనుసంధానం చేయాలని తెలిపారు. వీటిని దర్శించుకునేందుకు, చూసేందుకు ఎంతగా మార్గాలు అందుబాటులోకి వస్తే అంతగానూ టూరిజం ద్వారా ఆదాయం పెరుగుతుందని తెలిపారు. పౌరులుగా మన ప్రవర్తన ఎలా ఉంటుందన్న దానిపైనే దేశ భవిష్యత్తు ఆధారపడుతుందని అన్నారు. దేశాన్ని నిర్మించేది ప్రభుత్వాలు కాదని, అక్కడ ఉండే ప్రజలు పాటించే విలువేనని మోదీ తెలిపారు. ఢిల్లీ నుంచి వారణాసికి చేరుకున్న వెంటనే జగద్గురు విశే్వరాధ్యాయ గురుకులం శత వార్షిక ముగింపు ఉత్సవాల్లో మోదీ పాల్గొన్నారు. అలాగే, 19 భాషల్లో అనువదించి శ్రీ సిద్ధాంత్ శిఖామణి గ్రంథాన్ని కూడా మోదీ ఆవిష్కరించారు.
భారతదేశం కొత్త దశాబ్దంలో అడుగుడుతున్న సమయంలోనే ఈ గురుకులం శత వార్షికోత్సవాలు జరగడం యాదృచ్ఛిక్కమేనని అన్నారు. 21వ శతాబ్దంలో మరింతగా రాణించేందుకు ఈ దశాబ్దం ఎంతో కీలకమని అన్నారు. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలకు పట్టం కట్టిన మహానీయులు అనుసరించిన బాటలో ముందుకు సాగాలని, ఆవిధంగా నవభారత నిర్మాణానికి తోడ్పడాలని మోదీ పిలుపునిచ్చారు. స్వచ్ఛ భారత్ ఆశయాన్ని విజయవంతం చేయడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న పౌరులను ఆయన అభినందించారు. అలాగే, భారతదేశంలో తయారైన వస్తువులనే వినియోగించాలని, జల్ జీవన్ మిషన్ విజయవంతం కావడానికీ సహకరించాలని మోదీ పిలుపునిచ్చారు. గంగానది ప్రక్షాళనలో స్పష్టమైన ఫలితాలు కనిపిస్తున్నాయని పేర్కొన్న ఆయన ప్రజల ప్రమేయం వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. నమామి గంగా కార్యక్రమం కింద చేపట్టిన 7వేల కోట్ల రూపాయలతో చేపట్టిన ప్రాజెక్టులు పూర్తయ్యాయని, మరో 21వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయని తెలిపారు. ‘కాశీ ఏక్ రూప్’ అనే ఎగ్జిబిషన్‌ను కూడా దీన్‌దయాళ్ ఉపాధ్యాయ హస్తకళా కేంద్రంలో మోదీ ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన వస్తువులను ఆసక్తిగా పరిశీలించడంతోపాటు కళాకారులతో కూడా మాట్లాడారు.
*చిత్రం... జగద్గురు విశే్వరాధ్యాయ గురుకులం శత వార్షిక ముగింపు ఉత్సవాల్లో మాట్లాడుతున్న మోదీ..