జాతీయ వార్తలు

ఉగ్రవాదంపై పోరాడుదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: ఉగ్రవాదం ప్రపంచానికే శత్రువు, దాన్ని ఎదుర్కొనేందుకు అన్ని దేశాలూ కలిసి కట్టుగా పోరాడాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి పిలుపు ఇచ్చారు. కిషన్ రెడ్డి బుధవారం ఢిల్లీ శివార్లలో ఏర్పాటు చేసిన ఓ అంతర్జాతీయ సదస్సులో మాట్లాడుతూ ఉగ్రవాదం మూలంగా ప్రపంచ దేశాలకు ఆర్థికంగా, సామాజికంగా తీరని నష్టం వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలన్నీ ఒక్క తాటిపైకి రావలసిన అవసరం ఉన్నదని కిషన్ రెడ్డి స్పష్టం
చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమర్థ నాయకత్వంలో భారత దేశం ఉగ్రవాదం పట్ల శూన్య సహనంతో వ్యవహరించటం ద్వారా మంచి ఫలితాలను సాధించిందని ఆయన చెప్పారు. మోదీ పటిష్టమైన, కచ్చితమైన విధానాల వల్ల ఉగ్రవాదంతోపాటు వామపక్ష తీవ్ర వాదం అదుపులోకి వచ్చాయని ఆయన వెల్లడించారు. దేశంలోని పలు ప్రాంతాలలోని ఉగ్రవాద గ్రూపులను ధ్వంసం చేయటం జరిగిందని కిషన్ రెడ్డి ప్రకటించారు. ‘ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక ఆయుధాలతో కూడిన యుద్ధాలను ఎదుర్కొనేందుకు మనలను మనం సిద్ధం చేసుకోవాలి’అని ఆయన పిలుపునిచ్చారు. ఉగ్రవాద సంస్థలు కూడా ఆధునిక ఆయుధ సామాగ్రిని సమకూర్చుకుంటున్నాయని ఆయన హెచ్చరించారు. ఆధునిక ఐఈడీ పేలుడు వస్తువుల ప్రాధాన్యతను గుర్తించటంతోపాటు వాటిని ఎలా ధ్వంసం చేయాలన్నదానిపై కూడా దృష్టి సారించాలని మంత్రి చెప్పారు. ఆధునిక పేలుడు వస్తువులను గుర్తించి అదుపు చేయటం భద్రతా దళాలకు ఎంతో అవసరమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఉగ్రవాదులు, వామపక్ష తీవ్రవాదులను అదుపు చేసేందుకు భద్రతా దళాలు రెండంచెల వ్యూహాన్ని అనుసరించాలని మంత్రి ప్రతిపాదించారు. ఉగ్రవాదుల కార్యకలాపాలను ముందే పసిగట్టి క్రియాశీలంగా ఆదుపు చేయటంతోపాటు ఆక్రమణ పద్ధతిలో అదుపు చేయాలని ఆయన భద్రతా దళాలకు సూచించారు. ఉగ్రవాదులు, వామపక్ష తీవ్రవాదులు దాడి చేసిన తరువాత ప్రతిదాడి చేసే పద్ధతి ఎంత మాత్రం మంచిది కాదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఉగ్రవాదులను గుర్తించి ఏకాకులను చేసేందుకు అన్ని దేశాలు ఒక ఒప్పందానికి రావటం మంచిదని ఆయన చెప్పారు. ప్రతిదాడికి ఉపకరించే ఆధునిక ఐఈడీలు, అందుకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ఎన్‌ఎస్‌జీ స్టార్ట్ అప్ ఇండియా ఒప్పందం చేసుకోవడాన్ని ఆయన ప్రశంసించారు. కిషన్ రెడ్డి ఈ సందర్భంగా కౌంటర్ ఐఈడీ ఇన్నోవేటర్స్ అవార్డులను బహూకరించారు. ఎన్‌ఎస్‌జీ డైరెక్టర్ జనరల్ అనూప్ కుమార్ కూడా సదస్సుకు హాజరయ్యారు. ఈ సదస్సు రెండు రోజులు జరుగుతుంది.

*చిత్రం...సమావేశంలో మాట్లాడుతున్న కిషన్ రెడ్డి