జాతీయ వార్తలు

రెండోసారీ రిక్త‘హస్తమే’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఊహించని ‘షాక్’ తగిలిందనే చెప్పాలి. షీలాదీక్షిత్ నేతృత్వంలో 15 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా దేశ రాజధానిని ఏలిన కాంగ్రెస్‌కు రెండోసారి కూడా చావుదెబ్బ తప్పలేదు. ‘తాను గెలవలేకపోయినా ఫరవాలేదు.. పక్కవాడు ఓడిపోతే చాలు’ అన్న చందంగా బీజేపీకి అధికారం దక్కలేదన్న సంతోషంతో కాంగ్రెస్ సరిపెట్టుకొనే పరిస్థితి ఏర్పడడం గమనార్హం. ఢిల్లీ అసెంబ్లీ పరిధిలోని 70 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ‘చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు’గా కేవలం మూడు స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ డిపాజిట్‌లు కైవసం చేసుకొని పరువు నిలుపుకొంది. ఏకంగా 63 అసెంబ్లీ స్థానాల్లో కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేని స్థాయికి కాంగ్రెస్ దిగజారిపోవడం ఆ పార్టీ నేతలను కలవరపెడుతోంది. అయినప్పటికీ బీజేపీ ఒంటెత్తు పోకడలతో వారిని అధికారానికి ప్రజలు దూరం చేశారంటూ సమర్థించుకోవాల్సిన దుస్థితి కాంగ్రెస్‌కు ఏర్పడింది. వరుసగా రెండుసార్లు కాంగ్రెస్ పరాజయం పాలైన నేపథ్యంలో కారణాలు అనే్వషణలో ఆ పార్టీ తలమునకలైపోయింది. ఇందులో భాగంగా పార్టీలో సమన్వయం లోపించిందనీ.. అభ్యర్థుల ఎంపికలో జాప్యమే కాంగ్రెస్ పరాజయానికి కారణంగా నాయకులు భావిస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో ఆమ్ ఆద్మీ పార్టీకి దీటుగా హామీలను గుప్పించినప్పటికీ ఎందుకో ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్‌ను పట్టించుకోలేదని ఫలితాలను బట్టి తెలుస్తోంది. ఒక్క సీటూ కూడా దక్కించుకోలేని పరిస్థితికి కాంగ్రెస్ దిగజారిపోవడానికి చాలా కారణాలు చెబుతున్నారు. గత సంవత్సరం జూలై నెలలో మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలాదీక్షిత్ మరణించిన తరువాత ప్రజల్లో కాంగ్రెస్ పట్ల విశ్వాసం పూర్తిగా పోయిందని ఫలితాల సరళిని బట్టి తెలుస్తోంది. పార్టీ ఘోర పరాజయానికి నేనుసైతం బాధ్యత వహించాలి అంటూ ఢిల్లీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిష్ట ముఖర్జీ ట్వీట్ చేశారు. ఎన్నికలన్న తరువాత గెలుపు ఓటమిలు సహజమేననీ.. అయితే, బీజేపీకి చావుదెబ్బ తగలడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. బీజేపీని వ్యతిరేకించే అనేకమంది ఆప్‌కు లేదా కాంగ్రెస్‌కు ఓటు వేశారంటూ ఆ పార్టీ ఎంపీ ప్రతాప్‌సింగ్ బజ్వా పేర్కొన్నారు. ‘రాష్ట్రాలకు జరిగే ఎన్నికల్లో ఒకటి మాత్రం చెప్పగలం.. నాయకత్వ లోపం కూడా ఇందుకు కారణమని చెప్పొచ్చు.. ప్రజలకు ఆ నాయకుడిపై నమ్మకం ఉంటే తప్పక గెలిపిస్తారు’ అని బజ్వా వివరించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పీ. చిదంబరం మాట్లాడుతూ ఢిల్లీలో 15 ఏళ్లపాటు షీలా దీక్షిత్ హయాంలో చేసిన అభివృద్ధిని వివరించడంలో వైఫల్యం చెందామనీ పేర్కొన్నారు. అభివృద్ధిని వివరించడంలో ఆప్ అధినేత కేజ్రీవాల్ చాకచక్యంగా వ్యవహరించి విజేతగా నిలవగలిగారని పేర్కొన్నారు. 70 అసెంబ్లీ స్థానాల్లో దాదాపు 63చోట్ల డిపాజిట్లు కోల్పోయిన కాంగ్రెస్ కేవలం మూడు చోట్ల మాత్రమే డిపాజిట్లు కైవసం చేసుకొంది. గాంధీనగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అర్విందర్‌సింగ్ లలీ, బది స్థానం నుంచి పోటీ చేసిన దేవేందర్ యాదవ్, కస్తూర్బానగర్ నుంచి పోటీ చేసిన అభిషేక్‌దత్ మాత్రమే డిపాజిట్లు దక్కించుకొని పరువు నిలుపుకొన్నారు.
*చిత్రం... ఢిల్లీలో బోసిపోయిన కాంగ్రెస్ కార్యాలయం