జాతీయ వార్తలు

నెహ్రూ లౌకికవాదా? కాదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: పౌరసత్వ సవరణ చట్టం ద్వారా మైనారిటీలను వివక్షకు గురి చేస్తున్నారంటూ కాంగ్రెస్ తదితర ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో తిప్పికొట్టారు. ఒక వ్యక్తి (జవహర్‌లాల్ నెహ్రూ)ని ప్రధాన మంత్రిగా నియమించేందుకు దేశాన్ని విభజించారని ఆయన ఆరోపించారు. అసలు నెహ్రూ లౌకికవాదా? కాదా? చెప్పండి అంటూ కాంగ్రెస్‌ను డిమాండ్ చేశారు. మొదటి ప్రధాన మంత్రి పండిట్ జహహర్‌లాల్ నెహ్రూ విభజన అనంతరం పాకిస్తాన్‌లో ఉండిపోయిన హిందువులు, సిక్కులు తదితరుల సంక్షేమం కోసం పాకిస్తాన్ ప్రధాన మంత్రి లియాఖత్ అలీ ఖాన్‌తో కుదుర్చుకున్న ఓప్పందంలో ‘హిందువులు, సిక్కులు తదితర మైనారిటీలు మాత్రమే’ అనే పదాన్ని ఎందుకు పొందుపరిచారంటూ నరేంద్ర మోదీ ప్రతిపక్షాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. నరేంద్ర మోదీ గురువారం లోక్‌సభలో రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానం ఇచ్చారు. నరేంద్ర మోదీ తన ప్రసంగంలో పౌరసత్వ సవరణ చట్టం దేశంలోని మైనారిటీలకు ఎంత మాత్రం వ్యతిరేకం కాదని సుస్పష్టం చేశారు. తన వాదనకు మద్దతుగా ఆయను దేశ విభజన అనంతరం హిందుస్థాన్, పాకిస్తాన్‌లో ఉండిపోయిన మైనారిటీల సంక్షేమం కోసం లియాఖత్ అలీ ఖాన్‌తో జవహర్‌లాల్ నెహ్రూ కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉటంకించారు. ‘ఈ ఓప్పందం కారణంగా హిందుస్థాన్‌లోని మైనారిటీలు సుఖః సంతోషాలతో అభివృద్ధి చెందితే పాకిస్తాన్‌లోని హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైన్‌లు, పార్సీలు ఊచకోతకు గురయ్యారు, అమానుషాలను ఎదుర్కోవలసి వస్తోంది’ అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. విభజన అనంతరం పాకిస్తాన్‌లో ఉండిపోయిన హిందువులు, సిక్కులు తదితరుల సంక్షేమం కోసం లియాఖత్ అలీ ఖాన్‌తో కుదుర్చుకున్న ఒప్పందంలో పండిట్ నెహ్రూ కేవలం హిందువులు, సిక్కు మైనారిటీలనే పదాన్ని ఎందుకు పొందుపరిచారని నరేంద్ర మోదీ కాంగ్రెస్ తదితర ప్రతిపక్షాలను నిలదీశారు. లియాఖత్ అలీ ఖాన్‌తో కుదుర్చుకున్న ఓప్పందంలోని హిందు, సిక్కు మైనారిటీలనే పదాన్ని సమర్థించే వారు.. పౌరసత్వ సవరణ చట్టంలోని హిందువులు, సిక్కులు అనే పదాన్ని ఎందుకు సమర్థించారంటూ ఆయన కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలను చీల్చిచెండాడారు. లియాఖత్ అలీ ఖాన్ ఒప్పందంలో మైనారిటీలు మాత్రమే అనే పదాన్ని చేర్చిన జవహర్‌లాల్ నెహ్రూ లౌకికవాది అవునా? కదా? తేల్చాలంటూ ఆయన కాంగ్రెస్ అధినాయకులను ప్రశ్నలతో ముంచెత్తారు. కాంగ్రెస్ తన అవసరాల మేరకు నెహ్రూను ఉపయోగించుకుంటోందని ఆయన ఆరోపించారు. లియాఖత్ అలీ ఖాన్ ఒప్పందంలో మైనారిటీలు అనే పదాన్ని నెహ్రూ ఉపయోగించటం వెనుక ఏదోఒక అర్థం ఉంటుందని మోదీ చెప్పారు. జవహర్‌లాల్ నెహ్రూ అప్పటి
అస్సాం ముఖ్యమంత్రికి రాసిన లేఖలో హిందూ శరణార్థులు, ముస్లిం శరణార్థుల మధ్య వ్యత్యాసం చూపించాలని కోరారని మోదీ చెప్పారు. నెహ్రూ 1950లో ఇదే పార్లమెంట్‌లో మాట్లాడుతూ పాకిస్తాన్ నుండి భారత దేశంలో స్థిర పడేందుకు వచ్చిన వారికి పౌరసత్వం కల్పించాలి, చట్టం ఇందుకు అనుమతించకపోతే దానిని సవరించాలని సూచించారని ప్రధాన మంత్రి తెలిపారు. నెహ్రూ మరోసారి 1953లో లోక్‌సభలో మాట్లాడుతూ తూర్పు పాకిస్తాన్‌లో అధికారులు హిందువులపై వత్తిడి తెస్తున్నారని ప్రకటించారు, మత మార్పిడికి హిందువులపై వస్తున్న వత్తిడికి సంబంధించిన పత్రాలు, నివేదికలు తన వద్ద ఉన్నాయని కూడా నెహ్రూ పార్లమెంటులో ప్రకటించారని మోదీ చెప్పారు. జవాహర్ లాల్ నెహ్రు చేసిన ఈ వ్యాఖ్యలన్నీ మతతత్వంతో కూడుకున్నాయా? అని నరేంద్ర మోదీ ప్రతిపక్షాన్ని ప్రశ్నించారు. ఆయన హిందువులు, ముస్లింల పట్ల వివక్ష చూపించారా? అని మోదీ నిలదీశారు. నెహ్రూ ఈ వ్యాఖ్యల ద్వారా మతతత్వ హిందూ దేశాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారా? అంటూ నరేంద్ర మోదీ కాంగ్రెస్‌ను నిలదీశారు. పౌరసత్వ సవరణ చట్టం విషయంలో కాంగ్రెస్, వామపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి, మైనారిటీలను రెచ్చగొడతున్నాయని మోదీ ఆరోపించారు. పౌరసత్వ సవరణ చట్టం కారణంగా దేశంలోని ఏ పౌరుడిపైనా, ఏ మతంపైనా ఎలాంటి ప్రభావం పడదనేది మరోసారి స్పష్టం చేయాలనుకుంటున్నానని మోదీ చెప్పారు. ఈ చట్టం మైనారిటీలకు ఎలాంటి హాని కలిగించదన్నారు. దేశాన్ని ముక్కలు, ముక్కలు చేయాలనుకునే వారితో ఫొటోలు దిగేందుకు ఇష్టపడే వ్యక్తులు పౌరసత్వ సవరణ చట్టం గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రధాన మంత్రి దుయ్యబట్టారు. కాంగ్రెస్ దేశ ప్రజలను వారి మతం ఆధారంగా చూస్తోందని ఆయన ఆరోపించారు. దేశ ప్రజలను తాము భారతీయ పౌరులుగా చూస్తాం తప్ప మతం ఆధారంగా చూడలేమని మోదీ తెలిపారు. కాంగ్రెస్, వామపక్షాలు, ఇతర ప్రతిపక్షాల వాదనలను తిప్పికొట్టేందుకు ఆయన నెహ్రూతోపాటు దేశ విభజన, 1975లో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ, ఇందిరా గాంధీ మరణానంతరం 1984లో జరిగిన సిక్కుల ఊచకోత తదితర సంఘటనలను మోదీ ప్రస్తావించారు. సిక్కులను ఊచకోత కోసిన వ్యక్తి (కమల్‌నాథ్)ని ముఖ్యమంత్రి చేసిన ఘనత కాంగ్రెస్‌కు దక్కుతుందని ఆయన ఆరోపించారు. ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్‌కు రాజ్యాంగం గుర్తుకు రాలేదు కానీ ఇప్పుడు మాత్రం ప్రతి రోజు రాజ్యాంగం పరిరక్షణ గురించి మాట్లాడుతోందని ఆయన ఎత్తిపొడిచారు. మంత్రివర్గం నిర్ణయాలకు సంబంధించిన పత్రాలను చించివేసినప్పుడు రాజ్యాంగం గుర్తుకు రాదా? అంటూ ఆయన పరోక్షంగా రాహుల్ గాంధీని ప్రశ్నించారు.
దేశానికి స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాల తరువాత కూడా సమస్యలు కొనసాగటం దేశానికి ఎంత మాత్రం ఇష్టం లేదన్నారు. మీలా మేము కూడా పనిచేసి ఉంటే 370 ఆర్టికల్ రద్దు అయ్యేది కాదు, ట్రిపుల్ తలాక్ చట్టం వచ్చేది కాదు, అయోధ్యలోని వివాదాస్పద రామజన్మ భూమి సమస్య పరిష్కారం అయ్యేది కాదని నరేంద్ర మోదీ ఆవేశంతో చెప్పారు. తన ప్రభుత్వం ఎంత వేగంతో పని చేస్తోందనేది దేశ ప్రజలు చూశారు కాబట్టే తమను మరోసారి అధిక మెజారిటీతో గెలిపించారని ఆయన చెప్పారు. తమది దృఢ నిశ్చయంతో వేగంగా పనిచేసే ప్రభుత్వమన్నారు. తమ ప్రభుత్వం వేగంగా పని చేయకపోతే 37 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు వచ్చేవి కాదు, 11 కోట్ల ఇళ్లలో మరుగుదొడ్లు ఏర్పడేవి కావు, 13 కోట్ల కుటుంబాలలో వంటగ్యాస్ పొయ్యిలు ఉండేవి కావని ఆయన చెప్పారు. తమది అత్యంత వేగంగా పనిచేసే ప్రభుత్వం కాకపోతే బీద ప్రజల కోసం రెండు కోట్ల ఇళ్ల నిర్మాణం జరిగేది కాదని ఆయన స్పష్టం చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో శాంతిని నెలకొల్పటంలో తమ ప్రభుత్వం విజయం సాధించిందని మోదీ తెలిపారు.

*చిత్రం...లోక్‌సభలో మాట్లాడుతున్న ప్రధాని మోదీ