జాతీయ వార్తలు

ట్రిపుల్ తలాక్‌పై మూడోసారి ఆర్డినెన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: ముస్లిం మహిళల వైవాహిక హక్కును రక్షించేందుకు ప్రవేశపెట్టిన ట్రిపుల్ తలాక్ (ముమ్మారు తలాక్) బిల్లుకు సంబంధించి కేంద్రం మూడోసారి ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ ఆ ఆర్డినెన్సపై సంతకం చేసినట్టు కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ తెలిపింది. ట్రిపుల్ తలాక్‌కు సంబంధించి ఇలా ఆర్డినెన్స్ జారీ చేయడం సంవత్సర కాలంలో ఇది మూడోసారి. ముస్లిం మహిళల వైవాహిక హక్కును రక్షించే ఉద్దేశంతో ముస్లిం పురుషులు మూడుసార్లు తలాక్.. తలాక్.. తలాక్ అని అంటే వారి వివాహం రద్దవుతుందని గతంలో ఉన్న విధానం చెల్లదంటూ దానిని రద్దు చేస్తూ కేంద్రం గత ఏడాది పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టింది. లోక్‌సభలో ఇది ఆమోదం పొందినా, తగినంత మంది సభ్యుల బలం లేక రాజ్యసభలో ఇది ఆమోదం పొందలేకపోయింది. పురుషుడు వివాహం రద్దు చేసుకున్నంత మాత్రాన అతడికి జైలు శిక్ష విధించేలా ఈ చట్టంలో పొందుపర్చడం భావ్యం కాదని, ఇది మానవహక్కులకు విరుద్ధమంటూ కొన్ని విపక్షాలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి. అయితే ముస్లిం మహిళల రక్షణకు మాత్రమే దీనిని ప్రవేశపెట్టామని బీజేపీ ప్రభుత్వం చెప్పుకుంటూ వచ్చింది. ఈ ఏడాది జూన్ మూడుతో లోక్‌సభ కాలపరిమితి ముగుస్తున్నందున బిల్లుకు కాలదోషం పట్టకుండా రాష్టప్రతి ఆర్డినెన్స్ జారీ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ ట్రిపుల్ తలాక్ సహా పలు ఆర్డినెన్స్‌లపై విపక్షాల నుంచి వ్యతిరేకత వచ్చిందని, అయితే ఇలాంటి విషయాల్లో ప్రజాస్వామ్యం నిస్సహాయంగా ఉండిపోరాదని భావించి తాము కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇలాంటి చర్యలు చేపట్టాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ముమ్మారు తలాక్‌తో వైవాహిక బంధానికి స్వస్తి పలకడం న్యాయవిరుద్ధమని, అందుకే దీనిని అతిక్రమించిన పురుషులకు మూడేళ్ల జైలు శిక్షను విధించవచ్చునని బిల్లులో పొందుపర్చినట్టు ఆయన చెప్పారు. అయితే లోక్‌సభలో దీనికి ఆమోదం పొందినా రాజ్యసభలో తిరస్కరించడంతో ఈ ఆర్డినెన్స్‌ను జారీ చేయాల్సి వచ్చిందన్నారు. ఈ చట్టం దుర్వినియోగం అవుతుందని కొన్నివర్గాలు వ్యక్తం చేస్తున్న భయంలో అర్థం లేదని ఆయన స్పష్టం చేశారు. అందుకే దీనిలో కొన్ని సవరణలు చేశామని, నిందితుడు అరెస్టు కాకుండా బెయిల్ తెచ్చుకునే వెసులుబాటును కల్పించామని అన్నారు. ఆరోపణలు ఎదుర్కొనే వ్యక్తి తనను అదుపులోకి తీసుకోకముందు మెజిస్ట్రేట్‌ను ఆశ్రయించి బెయిల్ పొందవచ్చునని, అయితే పోలీస్‌స్టేషన్ నుంచి మాత్రం బెయిల్ పొందలేరని అన్నారు. తొలుత దీనిని నాన్‌బెయిలబుల్ నేరంగా పేర్కొన్నప్పటికీ, తర్వాత మార్పులు చేసి బెయిలబుల్ నేరంగా మార్చినట్టు ఆయన వివరించారు.