జాతీయ వార్తలు

నీట్‌కు ప్రైవేటు మోకాలడ్డు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 5: ఈ మధ్య ఎక్కడ విన్నా ‘నీట్’ మాటే! దేశవ్యాప్తంగా మెడికల్, డెంటల్ అడ్మిషన్లకు ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహించడం మంచిదా కాదా అన్న దానిపై చర్చోపచర్చలు. సుప్రీంలో పిటిషన్ల మీద పిటిషన్లు..! నీట్‌ను నిర్వహించలేమని వాదిస్తున్న రాష్ట్రాల సంఖ్య చాలా తక్కువ కావడం గమనార్హం. జాతీయ స్థాయి జరిగే ఈ పరీక్షను వ్యతిరేకించడం ఆశ్చర్యాన్ని కలిగించేదే! విద్యార్థుల ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకునే కొన్ని రాష్ట్రాలు నీట్‌ను వద్దంటున్నాయా లేక ప్రైవేటు కాలేజీలకు లబ్ధి చేకూర్చే ఉద్దేశంతోనే ఈ మార్గాన్ని ఎంచుకున్నాయా? ఇది కానప్పుడు విద్యార్థు ల ప్రతిభకు నిజంగా పదును పెట్టే నీట్‌ను వ్యతిరేకించడమెందుకు? జాతీయ స్థాయిలో సత్తా చాటుకునే అవకాశాన్ని చేతులారా చేజార్చుకోవడమెందుకు? మెజార్టీ రాష్ట్రాలు నీట్‌కు సై అంటున్నా... కేవలం కొన్ని రాష్ట్రాల్లోనే వ్యితిరేకత రాజుకోవడానికి బలమైన కారణమే ఉంది. అది ప్రైవేటు యాజమాన్యాలేనన్నది బహిరంగ రహస్యం! ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుండే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వాస్తవానికి ఇప్పటికే చాలా రాష్ట్రాలు అఖిల భారత వైద్య, దంత వైద్య ప్రవేశ పరీక్ష (ఎఐపిఎంటి)లో చేరి ఉన్నాయి. ఎఐపిఎంటిలో చేరని రాష్ట్రాల్లో ఎక్కువ దక్షిణాదిలోనే ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లోనే ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఎక్కువగా ఉన్నాయి. నీట్‌లో ఆయా రాష్ట్రాలు చేరిన పక్షంలో ఒకే పరీక్షతో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లకు విద్యార్ధులకు అవకాశం దక్కుతుంది. అదేవిధంగా ప్రైవేటు మెడికల్ కాలేజీలు సైతం నేరుగా నీట్ కోటాలో చేరాల్సి వస్తుంది. దీనివల్ల సొంత పరీక్షలు, సొంత మెరిట్ లిస్టులు, సొంత అడ్మిషన్ల విధానానికి అవకాశం ఉండబోదు. ఎపుడూ సొంత అడ్మిషన్లకే ఆసక్తి చూపే ప్రైవేటు మెడికల్ కాలేజీలు నీట్‌లో చేరితే తమ స్వతంత్రతను కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ కారణంగానే ప్రైవేటు మెడికల్ కాలేజీలు నీట్‌లో చేరేందుకు అయిష్టంగా ఉన్నాయి. నీట్‌లో చేరవద్దంటూ సంబంధిత రాష్ట్రాలపై ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఒత్తిడి పెంచుతున్నాయి.
ప్రస్తుతం దేశంలో 412 మెడికల్ కాలేజీలున్నాయి. అందులో ఆంధ్రలో 30, తెలంగాణలో 23 కాలేజీలున్నాయి. ఐదు కాలేజీలకు ఇంకా ఎంసిఐ అనుమతి ఇవ్వాల్సి ఉంది. దేశం మొత్తం మీద మెడికల్ కాలేజీల్లో సీట్ల కోసం 72 రకాల ప్రవేశ పరీక్షలు జరుగుతున్నాయి. ప్రతి ప్రవేశ పరీక్షకు గట్టి పోటీ ఉండటం, తక్కువగా సీట్లు ఉండటంతో కొద్దిమందికి మాత్రమే అడ్మిషన్లు దక్కుతున్నాయి. మిగిలిన విద్యార్ధులు ఇటు డిగ్రీలోనో, అటు అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, ఇతర కోర్సుల్లోనో చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. యాజమాన్య కోటాలో మెడిసిన్‌లో చేరాలంటే 50 లక్షల నుండి కోటి రూపాయిల వరకూ వసూలు చేస్తున్నాయి.
అంత భారాన్ని అధిగమించాలంటే ఎక్కువ ప్రవేశ పరీక్షలు రాయాల్సిన ఒత్తిడి విద్యార్ధులపై పెరుగుతోంది. 72 పరీక్షలు రాయకపోయినా, ప్రతి విద్యార్ధి కనిష్టంగా రెండు గరిష్టంగా 10 పరీక్షలు వరకూ రాస్తున్నట్టు ఇటీవలి సర్వేలు చెబుతున్నాయి. 10 పరీక్షలు రాయాలంటే ఎంతో డబ్బు ఖర్చు, ప్రయాణాలు, ఉద్రిక్తత, ఉద్వేగానికి విద్యార్ధి గురికావల్సి వస్తోంది.
ఈ ఇబ్బందులన్నీ అధిగమించాలంటే విద్యార్ధికి నీట్ ఒక వరంగా చెప్పవచ్చు. నీట్ తమకు వర్తించదని కొన్ని రాష్ట్రాలు వాదిస్తుండగా, మరికొన్ని రాష్ట్రాలు 2017-18 విద్యాసంవత్సరం నుండి అమలుచేయాలని కోరుతున్నాయి. అంటే ఏ విధంగా చూసినా మరో ఏడాది తర్వాత నీట్ పరీక్ష అమలులోకి వచ్చి తీరుతుంది.
నీట్ అమలులోకి వచ్చిన తర్వాత 15 శాతం ఓపెన్ టు ఆల్ కేటగిరి సీట్లను జాతీయ స్థాయి మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు. మిగిలిన 85 శాతం సీట్లను స్థానిక ప్రవేశపరీక్ష ద్వారా లేదా నీట్ మెరిట్ ద్వారా భర్తీ చేసుకునే వీలు రాష్ట్రాలకు ఉంటుంది. 85 శాతం సీట్లకు వేరే ప్రవేశపరీక్షను నిర్వహించడం లేదా నీట్ ద్వారా భర్తీ చేయడం అనే అంశం ఆయా రాష్ట్రాల అధికారాలకు లోబడి ఉంటుంది.
మెడికల్‌కే ఎందుకు?
మెడికల్ సీట్ల విషయంలో వివాదం చెలరేగడంతో జాతీయ ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహించాలని భావిస్తున్న కేంద్రప్రభుత్వం అదే పద్ధతిని ఇంజనీరింగ్ కాలేజీలకు కూడా ఎందుకు అనుసరించరాదనే ప్రశ్న తలెత్తింది. ఇంజనీరింగ్‌కు సైతం జాతీయ పరీక్ష నిర్వహిస్తే యాజమాన్య కోటా భర్తీ, 15 శాతం జాతీయ కోటా భర్తీ తేలికగా జరుగుతుందనే అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతోంది.