జాతీయ వార్తలు

ఢీ అంటే ఢీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 17: నేటినుంచి ప్రారంభం అవుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అధికార, ప్రతిపక్షాలు రాజకీయ యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. పార్లమెంటు ఉభయ సభల్లో ప్రతి అంశాన్ని చర్చించేందుకు ఎన్‌డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హామీ ఇస్తే.. ఫరూక్ అబ్దుల్లా (ఎన్‌సీ), పి.చిదంబరం తదితర ఎంపీలను జైళ్లలో పెట్టిన ప్రభుత్వానికి ఎలా సహకరిస్తామని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. ఎంపీల నిర్బంధంతోపాటు ఆర్థిక మాంద్యం, నిరుద్యోగం, జమ్ముకాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులు, రైతుల ఆత్మహత్యలు తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. పాకిస్తాన్, బాంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌కు చెందిన హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, పార్సీలు, జైన్‌లు, బౌద్ధులు తదితర ముస్లిమేతర భారతీయ సంతతివారికి భారత పౌరసత్వం కల్పించేందుకు సంబంధించిన పౌరసత్వ సవరణ బిల్లు, అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సంబంధించిన ట్రస్ట్ ఏర్పాటు బిల్లుతోపాటు మొత్తం 27 బిల్లును ఉభయ సభల్లో ప్రతిపాదించేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆర్థిక మాంద్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా కార్పొరేట్ పన్నులను తగ్గించేందుకు ఉద్దేశించిన సవరణ బిల్లును పార్లమెంటులో ప్రతిపాదించనున్నారు. ఈ-సిగరెట్ల తయారీ, అమ్మకం, నిల్వచేయటాన్ని నిషేధించేందుకు సంబంధించిన సవరణ బిల్లు కూడా సభ ముందుకు రానున్నది. నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో కూడిన ఒక ప్రత్యేక సంయుక్త సమావేశం జరపనున్నారు. రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్టప్రతి ఎం. వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉభయ సభల సభ్యుల సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తారు.
జమ్ముకాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులు, రైతుల ఆత్మహత్యలు, దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యం కోరల్లో చిక్కుకోవటం గురించి ప్రతిపక్షాలు ప్రధానంగా ప్రస్తావించనున్నాయి. తెలంగాణలో గత నలభై నాలుగు రోజుల నుండి కొనసాగుతున్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికుల సమ్మె గురించి తెలంగాణకు
చెందిన కాంగ్రెస్ ఎంపీలు ప్రస్తావించనున్నారు. వైసీపీ ఎంపీలు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వటం గురించి ప్రధానంగా లేవనెత్తనున్నారు. లోక్‌సభ, రాజ్యసభలోని ఐదుగురు తెలుగుదేశం సభ్యులు ఏపీలో నియంతృత్వ ప్రభుత్వం పని చేస్తోందంటూ ఉభయ సభల్లో గొడవ చేయాలనుకుంటున్నారు.
ఇలావుండగా పార్లమెంటు ఉభయ సభల్లో ప్రతి అంశంపైనా చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతిపక్షాలకు హామీ ఇచ్చారు. ఉభయ సభలను సజావుగా నడవనిస్తే ప్రతిపక్షం ప్రస్తావించే ప్రతి అంశంపైనా చర్చ జరిపి సమాధానం ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ ఆదివారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి శీతాకాల సమావేశాలు సజావుగా జరిగేందుకు ప్రభుత్వానికి సహకరించాలని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. ఆర్థిక మాంద్యం, వ్యవసాయ కార్మికులు ఉపాధి కోల్పోవటం, గిట్టుబాటు ధరలు లభించక రైతులు ఆత్మహత్యలకు పాల్పడటంపై ఉభయ సభల్లో విస్తృతంగా చర్చ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. జమ్ముకాశ్మీర్‌కు చెందిన సీనియర్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు వీలుగా అతన్ని వెంటనే విడుదల చేయాలి, ప్రస్తుతం జైల్లో ఉన్న ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరంను విడుదల చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఫరూక్ అబ్దుల్లా లోక్‌సభ సమావేశాలకు హాజరయ్యేందుకు వీలుగా అయన్ని వెంటనే విడుదల చేయాలని నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ హుస్నేన్ మసూదీ అఖిలపక్ష సమావేశంలో డిమాండ్ చేశారు. ఫరూక్ అబ్దుల్లా పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేలా చూడటం కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగపరమైన బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. ఎంపీలను నిర్బంధించి పార్లమెంటు సమావేశాలు జరపటం ఏమిటని ఆయన ప్రశ్నించారు. పార్లమెంటు సభ్యులను చట్ట విరుద్ధంగా ఎలా నిర్బంధిస్తారని రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఫరూక్ అబ్దుల్లాను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జమ్ముకాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370, ఆర్టికల్ 35-ఏను రద్దు చేసినప్పటి నుంచి ఫరూక్ అబ్దుల్లా, ఇతర కాశ్మీరీ నాయకులు నిర్బంధంలో ఉండడం తెలిసిందే. పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరంకు వీలు కల్పించాలని ఆజాద్‌తోపాటు లోక్‌సభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు అధీర్ రంజన్ చౌదరి డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతోపాటు హోం శాఖ మంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, తావర్‌చంద్ గెహ్లాట్, కాంగ్రెస్ నాయకులు అధీర్ రంజన్ చౌధరి, గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, టీఎంసీ నాయకుడు డెరిక్ ఓబ్రేన్, చిరాగ్ పాశ్వాన్ (ఎల్‌జేపీ), రాంగోపాల్ యాదవ్ (ఎస్పీ), వైసీపీ పక్షం నాయకుడు వి.విజయ సాయిరెడ్డి, తెలుగుదేశం పక్షం నాయకుడు గల్లా జయదేవ్ అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు.
*చిత్రం... ఢిల్లీలో ఆదివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు