జాతీయ వార్తలు

‘అయోధ్య’ ఆద్యుడు అద్వానీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమస్తిపూర్: సుప్రీంకోర్టు వెలువరించిన తాజా తీర్పుతో అయోధ్య వివాదానికి చారిత్రక రీతిలో తెరపడినప్పటికీ అసలు ఈ వివాదం జాతీయ రాజకీయాలను మూడు దశాబ్దాలపాటు ప్రభావితం చేయడానికి మూలపురుషుడు, బీజేపీ రథసారథి ఎల్‌కే అద్వానీ. సుప్రీం తాజా తీర్పుతో ఎనలేని ఆనందానికి లోనైన వ్యక్తుల్లో అద్వానీ ఒకరన్నది నిస్సందేహం. 1990 అక్టోబర్ 23న అద్వానీ రథాన్ని అప్పటి బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ నిలిపివేసింది సమస్తిపూర్‌లోనే. దాని తర్వాతే ఒకదాని తర్వాత ఒకటిగా రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా దేశ చరిత్రనే మలుపు తిప్పడానికి అవే కారణం అన్నది కూడా స్పష్టం. సుప్రీం తీర్పు ఎవరికి ఆనందాన్ని, ఎవరికి విషాదాన్ని మిగిల్చినా బీజేపీ కురువృద్ధుడు అద్వానీకే ఈ తాజా విజయంలో సింహభాగం దక్కుతుంది. తన 92వ పుట్టినరోజు జరిగిన మరునాడే ఈ చారిత్రక తీర్పు వెలువడడం అద్వానీకి ఎనలేని ఆనందాన్ని కలిగించేదే. తన రామ రథం ద్వారా అద్వానీ చేపట్టిన ఆనాటి యాత్ర దేశంలోని హిందువులను ఏకం చేసింది. దానికి మార్గమధ్యలో అద్వానీని అప్పటి బీహార్ ముఖ్యమంత్రి అరెస్టు చేయడం దేశ రాజకీయ చరిత్ర కొత్త మలుపు తిరగడానికి నాంది పలికింది. ఆ అరెస్టుతోనే దేశంలో మండల్, మందిర్ రాజకీయాలకు అంకురార్పణ జరిగింది. సమాజం మొత్తం మతపరంగాను, కులపరంగాను ఏదో మార్గాన్ని ఎంచుకోవాల్సిన పరిస్థితికి దారితీసింది. ‘ఆరోజు తెల్లవారుజామున నా ఫోన్ రింగ్ అయింది. అవతలి వైపు నుంచి మాట్లాడింది బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్. ఆయన తనదైన శైలిలోనే నాతో మాట్లాడారు. ఇంకా లేవలేదా? అని నన్ను ప్రశ్నించారు. ఇంత పొద్దునే్న ఎందుకు ఫోన్ చేశారని నేనూ అడిగాను. బాబాను (అద్వానీ) అరెస్టు చేశాం’ అంటూ లాలూ జవాబిచ్చారని నాటి పరిణామాలను సీనియర్ పాత్రికేయుడు ఎస్‌డీ నారాయణ్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. అప్పట్లో ఆయన సమస్తిపూర్‌లోనే పీటీఐ వార్తా సంస్థ తరఫున పనిచేశారు. అద్వానీ రామ్ రథయాత్ర ప్రభావం దాదాపుగా అన్ని రాష్ట్రాలపై పడడంతో ఆయా ప్రభుత్వాలు దానిని ఎలాగైనా నిరోధించాలని గట్టిగానే ప్రయత్నించాయి. మిగతా రాష్ట్రాలు అద్వానీని ఆపలేకపోయినా అప్పట్లో బీహార్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న లాలూ మాత్రం ఆ పని చేయగలిగారు. తనను హాజీపూర్ నుంచి సమస్తిపూర్ వరకు అద్వానీ రథయాత్రకు సంబంధించిన కథనాలను అందించే బాధ్యతను అప్పగించాలని పేర్కొన్న నారాయణన్ ‘హాజీపూర్‌లో అద్వానీకి విశేషమైన ప్రతిస్పందన లభించింది. అదే సమయంలో గగనతలంలో హెలికాప్టర్ తిరగడమూ కనిపించింది. దాంతో ఏదో జరుగబోతోందన్న అనుమానం నాకు కలిగింది’ అని ఆయన గుర్తు చేసుకున్నారు. అద్వానీని అరెస్టు చేసిన విషయాన్ని సమస్తిపూర్ జిల్లా మేజిస్ట్రేట్ ఆర్‌కే సింగ్ పాత్రికేయులకు వెల్లడించారని నారాయణన్ తెలిపారు. అయితే, ఆ అరెస్టుకు ముందు అన్ని టెలిఫోన్ లైన్లను కట్ చేశారు. అధికారికంగా చెబితే తప్ప ఎవరికీ ఎలాంటి సమాచారం అందే పరిస్థితి లేదు. అనంతర కాలంలో ఆర్‌కే సింగ్ కేంద్ర హోం శాఖ కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం బీజేపీ కోటాలో కేంద్ర మంత్రిగా ఉన్నారు. అరెస్టు చేసిన అద్వానీని ప్రస్తుతం జార్ఖండ్‌లో ఉన్న దుమ్‌కా ప్రాంతంలోని ఓ అతిథి గృహానికి తీసుకెళ్లారు. ఆయన అరెస్టుతో రథయాత్ర ఆకస్మికంగా ఆగిపోయినప్పటికీ ఉత్తరభారతంలో అనేక పట్టణాలు, నగరాల్లో నిరసనలు, మత ఘర్షణలు తలెత్తడానికి దారితీశాయి. ఈ పరిణామంతో వేలాదిమంది కరసేవకులు అయోధ్యకు చేరుకున్నారు. అదే ఏడాది అక్టోబర్ 30న బాబ్రీ మసీదును ధ్వంసం చేస్తుండగా జరిగిన పోలీస్ చర్యలో 28 మంది కరసేవకులు మరణించారు. డిసెంబర్ 6, 1992న అద్వానీ బీజేపీ, వీహెచ్‌పీ నేతల సమక్షంలో బాబ్రీ మసీదును కూల్చివేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమాజవాది పార్టీ సంస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ పోలీస్ చర్యను గట్టిగా సమర్థించుకున్నారు. దేశ సమైక్యత, సమగ్రత కోసం మరింత మందిని చంపాల్సి వచ్చినా భద్రతా దళాలు వెనకాడి ఉండేవి కాదని అప్పట్లో ఆయన వ్యాఖ్యానించారు. అద్వానీ అరెస్టుతో అప్పటి కేంద్రంలోని వీపీ సింగ్ ప్రభుత్వానికి ఇస్తున్న మద్దతును బీజేపీ ఉపసంహరించింది. అద్వానీ అరెస్టు వ్యవహారం బీజేపీకి రాజకీయంగా ఎదగడానికి ఎన్నో విధాలుగా కలిసివస్తే, ఆయనను అరెస్టు చేయడం ద్వారా జాతీయ దృష్టిని ఆకర్షించిన లాలూ ప్రసాద్ యాదవ్ బీజేపీ వ్యతిరేక కూటమికి ప్రధాన నాయకుడయ్యారు. అప్పటి అయోధ్య వ్యవహారంలో కీలక భూమిక పోషించిన అద్వానీ, లాలూ రాజకీయ జీవితానికి రాజకీయ జీవితానికి దాదాపుగా దూరమైపోయారు. లాలూ ప్రసాద్ ప్రస్తుతం జార్ఖండ్ జైలులో కాలం గడుపుతున్నారు. అలాగే, ఈ చారిత్రక పరిణామానికి సూత్రధారి ఎల్‌కే అద్వానీ సైతం బీజేపీ మార్గదర్శక మండలికే పరిమితమయ్యారు.