జాతీయ వార్తలు

సోనియా కుటుంబానికి భద్రత కుదింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 8: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కుటుంబానికి ప్రస్తుతం ఇస్తున్న ఎస్పీజీ భద్రతను కుదిస్తూ కేంద్ర హోం శాఖ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకొంది. సోనియాతోపాటు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలకు కూడా ఎస్పీజీ భద్రతను కుదిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఇకపై సోనియా కుటుంబానికి కేవలం సీఆర్‌పీఎఫ్ భద్రత మాత్రమే ఉంటుంది. సీఆర్‌పీఎఫ్ భద్రత అంటే జెడ్ ప్లస్ కేటగిరీ కిందకు వస్తుంది. 1991 సంవత్సరం మే 21న ఎల్‌టీటీఈ ఉగ్రవాదుల దాడిలో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హతమైనప్పటి నుంచి ఈ కుటుంబానికి ఎస్పీజీ భద్రతను కల్పిస్తూ వచ్చారు. దాదాపు 28 సంవత్సరాల తరువాత గాంధీ కుటుంబానికి భద్రతను కుదిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఇకపై కేవలం ప్రధాని నరేంద్ర మోదీ ఒక్కరికి మాత్రమే ఎస్పీజీ కమాండోల భద్రత ఉంటుందని హోం శాఖ ఆదేశాల్లో పేర్కొంది. మోదీ మినహా మిగిలిన నేతలందరికీ ఎస్పీజీ భద్రతను కుదిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, గాంధీ కుటుంబానికి ఇచ్చే సీఆర్‌పీఎఫ్ భద్రతను పారా మిలిటరీ బలగాలు పర్యవేక్షిస్తాయి. మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌కు ఆగస్టు నెలలో ఎస్పీజీ భద్రతను కుదించి సీఆర్‌పీఎఫ్‌కు మార్చిన సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ నేతల నిరసన
సోనియా గాంధీ కుటుంబ సభ్యులకు ఎస్‌పీజీ భద్రతను తొలగించటాన్ని నిరసిస్తూ వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు శుక్రవారం సాయంత్రం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నివాసాన్ని ముట్టడించారు. మోదీ ప్రభుత్వం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ ప్రాణాలతో ఆడుకుంటోందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు. మోదీ ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ ఆరోపించారు. గాంధీ కుటంబానికి ఎస్‌పీజీ భద్రతను పునరుద్ధరించాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలు శుక్రవారం సాయంత్రం హోం మంత్రి అమిత్ షా నివాసం వద్ద గొడవ చేశారు. దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని అభద్రతకు గురి చేస్తారా? అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. మాజీ ప్రధాన మంత్రులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు దేశం కోసం తమ ప్రాణాలు అర్పించారు, అలాంటి కుటుంబానికి చెందిన వారి ఎస్‌పీజీ భద్రతను తొలగించవలసిన అవసరం ఏమిటని వారు ప్రశ్నించారు. ఇదిలా ఉంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా ఒక కుట్ర ప్రకారమే గాంధీ కుటుంబానికి ఉన్న ఎస్‌పీజీ భద్రతను తొలగించారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ విలేఖరుల సమావేశంలో దుయ్యబట్టారు. నరేంద్ర మోదీ, అమిత్ షాల కళ్లు రాజకీయ ప్రతీకారంతో మూసుకుపోయాయని ఆరోపించారు. రాజకీయ ప్రత్యర్థుల పట్ల కక్ష సాధింపు కోసం మోదీ, అమిత్‌షాలు ఎంతకైనా దిగజారుతారని రణదీప్‌సింగ్ సుర్జేవాలా దుయ్యబట్టారు. ప్రధాన మంత్రి, హోం మంత్రి ప్రజాస్వామ్యాన్ని భూస్థాపితం చేస్తున్నారని వేణుగోపాల్ ఆరోపించారు. గాంధీ కుటుంబ సభ్యులకు ఏదైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత మోదీ ప్రభుత్వం వహించవలసి ఉంటుందని వారు హెచ్చరించారు. మాజీ ప్రధాన మంత్రి వీపీ సింగ్.. ఎస్‌పీజీ భద్రత తొలగించినందుకే రాజీవ్ గాంధీ హత్యకు గురి కాలేదా? అని వేణుగోపాల్ ప్రశ్నించారు. గాంధీ కుటుంబానికి ఎస్‌పీజీ భద్రతను ఎందుకు తొలగించవలసి వచ్చిందని ఆయన అమిత్ షాను నిలదీశారు.