జాతీయ వార్తలు

ప్రజా క్షేమమే ఆశయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జల్‌గామ్/బాంద్రా, అక్టోబర్ 13: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ఆదివారంనాడు ఇక్కడ ప్రారంభించిన నరేంద్ర మోదీ కాంగ్రెస్, ఎన్సీపీలను లక్ష్యంగా చేసుకుని తీవ్ర సవాళ్లతో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పలు ర్యాలీల్లో మాట్లాడిన మోదీ విపక్షాల తీరును ఎండగట్టడంతోపాటు తమ ప్రభుత్వం తీసుకున్న అనేక సాహసోపేత నిర్ణయాలను గట్టిగా ప్రస్తావించారు. ప్రపంచ దేశాలన్నీ ఎన్నో కీలక సవాళ్లను ఎదుర్కోవడంలో సతమతం అవుతుంటే భారత్ మాత్రం బలంగా నిలబడి వాటిని ముఖాముఖిగా ఢీకొంటోందని తెలిపారు. తమ ప్రభుత్వానికి ప్రజల సంక్షేమమే పరమార్థమని, వారికోసమే అహరహం పనిచేస్తుందని తెలిపారు. అలాగే పేదలు, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఎన్నో పథకాలను అమలు చేస్తోందని బాంద్రాలోని సకోలీలో జరిగిన ర్యాలీలో మోదీ తెలిపారు. మరింత బలమైన గుర్తింపును ఇచ్చే సరికొత్త శక్తితో తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన అన్నారు. జల్‌గామ్ ర్యాలీలో మాట్లాడిన మోదీ ‘దమ్ముంటే 370 అధికరణను పునరుద్ధరిస్తామని మీ మేనిఫెస్టోల్లో పెట్టండి’ అని కాంగ్రెస్, ఎన్సీపీలకు మోదీ సవాల్ చేశారు. ఈనెల 21వ తేదీన జరుగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని జరిగిన తొలి ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన మోదీ ‘జమ్మూకాశ్మీర్ అన్నది కేవలం ఓ భూభాగం మాత్రమే కాదు. అది భారతావనికి మకుటాయమానం’ అని తెలిపారు. ఆ రాష్ట్రంలో నాలుగు దశాబ్దాలపాటు నెలకొన్న ప్రతికూల పరిస్థితులను కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే తాము సాధారణ స్థాయికి తీసుకువచ్చామని మోదీ ఈ సందర్భంగా తెలిపారు. 370 రాజ్యాంగ అధికరణ అంశాన్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం విపక్షాలు వాడుకుంటున్నాయని ధ్వజమెత్తిన మోదీ ‘పొరుగుదేశం మాదిరిగానే ఇక్కడి పార్టీలూ మాట్లాడుతున్నాయి’ అని ఆరోపించారు. గత ఐదేళ్ల కాలంలో దేవేంద్ర ఫడ్నవిస్ సారథ్యంలోని మహారాష్ట్ర అద్భుతంగా పనిచేసిందని ఆయన ప్రశంసించారు. ఈ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో అవినీతి లేదని, అన్ని వర్గాల ప్రజల్లోనూ విశ్వాసం పెరిగిందని మోదీ పేర్కొన్నారు. కాశ్మీర్‌కు సంబంధించి కాంగ్రెస్, ఎన్సీపీలవి మొసలికన్నీళ్లేనని, వీరికి ఏమాత్రం ధైర్యం ఉన్నా 370 అధికరణ రద్దును పునరుద్ధరిస్తామని చెప్పాలని మోదీ మరోసారి సవాల్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు కథనాలను కట్టిపెట్టాలని, ప్రజలు ఆమోదించిన కేంద్ర నిర్ణయాన్ని తాము అంగీకరిస్తున్నదీ లేనిదీ తేల్చిచెప్పాలని ఈ రెండు పార్టీలన మోదీ కోరారు. బీజేపీ ప్రభుత్వం చెప్పేదే చేస్తుందని ఉద్ఘాటించిన మోదీ కాశ్మీర్ విషయంలో తమ నిర్ణయాన్ని గట్టిగా సమర్థించుకున్నారు. ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేస్తామని చెప్పి, ఆ నిర్ణయాన్ని అమలు చేశామని, ముస్లిం మహిళలకు న్యాయం చేశామని ఆయన అన్నారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఈ నిర్ణయాన్ని అడ్డుకునేందుకే చివరివరకూ ప్రయత్నించాయని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్, ఎన్సీపీల పేరును నేరుగా ప్రస్తావించకుండా ‘ఈ రెండు పార్టీలు ఒకదానిపై ఒకటి ఆధారపడ్డాయి. మహారాష్ట్ర ప్రజల కలలను, అలాగే యువత ఆకాంక్షలను నెరవేర్చే సత్తా వీటికి లేదు’ అని మోదీ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్టీయే కూటమిని బలపరిచినందుకు రాష్ట్ర ప్రజలకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. నవభారత నిర్మాణానికి రాష్ట్ర ప్రజలు ఇచ్చిన మద్దతు ఎంతగానో తోడ్పడిందని పేర్కొన్న ఆయన దేశ ప్రజలంతా ఒక్కతాటిపై నిలిచి తమకు పూర్తి మెజారిటీ కట్టబెట్టడం వల్లే ప్రపంచంలోనే భారత్ ఓ బలమైన శక్తిగా నిలబడగలుగుతోందని అన్నారు.
గత ఐదేళ్లలో రాష్ట్రంలో మత సామరస్యాన్ని పెంపొందించామని, రైతుల్లోను, పారిశ్రామికవేత్తల్లోనూ విశ్వాసాన్ని ఇనుమడింపజేయగలిగామని అన్నారు. రెండోసారి కూడా ఫడ్నవిస్ నాయకత్వాన్ని బలపరచాలని, రానున్న ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీతో పట్టం కట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
*చిత్రం... ముంబయిలోని బాంద్రాలో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ