జాతీయ వార్తలు

ఇక జనాభా లెక్కల డిజిటలైజేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: జనాభా లెక్కలను డిజిటల్ పద్ధతిలో యాప్ ద్వారా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌లో సేకరిస్తాం.. పౌరులందరికీ బహుళార్దక గుర్తింపు కార్డు ఇచ్చే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నది.. 2021లో జనాభా లెక్కల సేకరణ సమయంలోనే జాతీయ జనాభా రిజిష్టర్‌ను రూపొందిస్తాం.. కొత్త జనాభా లెక్కల ఆధారంగానే లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. జనాభా లెక్కల సేకరణ ఒక యజ్ఞం లాంటిది.. దీనికి ప్రజలందరూ సహకరించాలని అమిత్ షా విజ్ఞప్తి చేశారు. ప్రజలు భాగస్వాములైతేనే జనాభా లెక్కల సేకరణ యజ్ఞం విజయవంతమవుతుందని ఆయన తెలిపారు. దేశ జనాభాను నిర్దారించేందుకు 2021లో ‘డిజిటల్’ పద్ధతిలో జనాభా వివరాలు సేకరించనున్నట్లు అమిత్ షా సోమవారం ఢిల్లీలో జన గణన భవన్ (సెన్సస్ అథారిటీ) భవన నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో ప్రకటించారు. డిజిటల్ జనాభా సేకరణ కోసం రూ.12,000కోట్లు ఖర్చు చేయనున్నట్లు అమిత్ షా వెల్లడించారు. జనాభా సేకరణ కార్యక్రమం కోసం ఒక ప్రత్యేక ‘యాప్’ను దేశీయంగా తయారు చేస్తున్నారు.. ఈ యాప్ ద్వారా జనాభా వివరాలు
సేకరించనున్నట్లు ఆయన వెల్లడించారు. దేశంలోని ప్రతి పౌరుడికి ఒక బహుళార్దక సాధక గుర్తింపు కార్డును ఇవ్వాలనే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉన్నదని ఆయన తెలిపారు. ఈ బహుళార్దక సాధక గుర్తింపు కార్డులోనే ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంకు ఖాతా, ఓటర్ కార్డు అన్నీ సమ్మిళితమై ఉంటాయని అమిత్ షా తెలిపారు. దేశ జనాభా లెక్కల సేకరణ 2011లో జరగడం తెలిసిందే. దీని ప్రకారం దేశ జనాభా 121 కోట్లు ఉన్నట్లు నిర్దారించారు. మళ్లీ 2021లో అంటే దాదాపు పదేళ్ల తరువాత మళ్లీ జనాభా లెక్కల సేకరణ జరుగబోతోంది. స్మార్ట్ ఫోన్‌లో డౌన్ లోడ్ చేసే జనాభా లెక్కల సేకరణ యాప్ ద్వారా ప్రజల వివరాలు సేకరిస్తారు. ఈ యాప్ ద్వారా ప్రజలు తమంత తాము తమ కుటుంబ సభ్యుల వివరాలు, సామాజిక, ఆర్థిక వివరాలను ఆప్‌లోడ్ చేయవచ్చునని ఆయన చెప్పారు. జనాభా లెక్కల సేకరణకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనున్నట్లు ఆయన చెప్పారు. 2021 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని ఆయన ప్రకటించారు. దాదాపు ముప్పైమూడు లక్షల మంది సిబ్బంది జనాభా వివరాలు సేకరించేందుకు ఇంటింటికీ వెళ్లి తెలుసుకునే కుటుంబ వివరాలను అక్కడికక్కడే స్మార్ట్ ఫోన్‌లోని జనాభా లెక్కల సేకరణ యాప్‌లో లోడ్ చేస్తారు. ఇంటర్‌నెట్ ఆధారంగా పనిచేసే జనాభా లెక్కల సేకరణ యాప్‌ను కేంద్ర సర్వర్‌తో లింక్ చేస్తారు. అంటే ఈ యాప్‌లో పొందపరిచే ఆయా కుటుంబాల వివరాలు ఎప్పటికప్పుడు అప్‌లోడ్ కావటంతో మొత్తం జనాభా వివరాలు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుంటాయని హోం శాఖ అధికారులు చెబుతున్నారు. జనాభా లెక్కలు సేకరించేందుకు నియమించే సిబ్బంది తమ స్మార్ట్ఫోన్‌లో ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవలసి ఉంటుంది. దేశంలో మొదటిసారి కాగితం పత్రాలపై కాకుండా స్మార్ట్ పద్ధతిలో జనాభా లెక్కల సేకరణ జరుగుతుందని అమిత్ షా చెప్పారు. మరణించిన వ్యక్తుల సమాచారం కూడా వెనువెంటనే జనాభా లెక్కల్లోకి వెళ్లే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉన్నదని ఆయన సూచించారు. దేశంలో ఇంతవరకు పదహారుసార్లు జనాభా లెక్కల సేకరణ జరిగింది. అయితే దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత 2021లో జరిగేది ఎనిమిదవది అవుతుంది. దేశంలో జనాభా లెక్కల సేకరణకు దాదాపు 140 సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఇంతవరకు జరిగిన జనాభా లెక్కల సేకరణలన్నీ పుస్తకాల్లో రాసుకోవటం ద్వారా జరిగేవి. ఇప్పుడు దేశంలో మొదటిసారి జనాభా లెక్కల సేకరణ స్మార్ట్ ఫోన్‌లోని యాఫ్ ద్వారా డిజిటల్ పద్ధతిలో జరుగబోతోంది. స్మార్ట్ డిజిటల్ జనాభా లెక్కల సేకరణ మొత్తం పదహారు భాషల్లో జరుగుతుంది. డిజిటల్ జనాభా లెక్కల సేకరణ రెండు దశల్లో జరుగుతుంది.. జమ్ముకాశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల జనాభా లెక్కల సేకరణ 2020 అక్టోబర్ ఒకటో తేదీనుంచి జరిగితే దేశంలోని ఇతర ప్రాంతాల జనాభా లెక్కల సేకరణ 2021 మార్చి ఒకటో తేదీ నుంచి జరుగుతుంది. తదుపరి దేశ జనాభా లెక్కల సేకరణ 2021లో జరుగుతుందని ప్రభుత్వం గత మార్చిలో ప్రకటించటం తెలిసిందే. 2021 జనాభా లెక్కల సేకరణకు సంబంధించిన ముందస్తు పరీక్షలు గత ఆగస్టు 12న ప్రారంభమయ్యాయి. ఇవి ఈ నెలాఖరు వరకు కొనసాగుతాయి.
జాతీయ జనాభా రిజిష్టర్
2021 జనాభా లెక్కల సేకరణ సమయంలోనే మొదటిసారి జాతీయ జనాభా రిజిష్టర్‌ను రూపొందిస్తారని అమిత్ షా తెలిపారు. జాతీయ జనాభా రిజిష్టర్‌ను తయారు చేయటం వలన పెనుమార్పులు వచ్చేందుకు వీలుంటుంది.. పథకాల అమలు, లబ్ధిదారుల గుర్తింపు ఇతర పనులన్నీ అత్యంత సులభమైపోతాయి. విదేశీ పౌరులు ముఖ్యంగా మన దేశంలో అక్రమంగా ఉంటున్నవారిని గుర్తించటం అత్యంత సులభమైపోతుందని అమిత్ షా అభిప్రాయపడ్డారు. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారందరికీ అటోమేటిక్‌గా ఓటింగ్ కార్డు లభిస్తుంది. శాంతిభద్రతల సమస్యను సులభంగా పరిష్కరించవచ్చు. జెండర్ ఈక్వాలిటీ కూడా సులభమైపోతుందని అన్నారు. ఇదిలా ఉంటే జనాభా లెక్కల సేకరణ వలన దేశంలో ఎంతమంది ప్రజలున్నారనేది తెలియడంతోపాటు ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతుల వివరాలు కూడా తెలుస్తాయి. ఈ వివరాలు పథకాల రూపకల్పన, నిధుల కేటాయింపునకు ఎంతో ఉపయోగపడతాయి. జనాభాలో వచ్చే మార్పులతోపాటు సామాజిక, ఆర్థిక స్థితిగతుల్లో కనిపించే మార్పుల ఆధారంగా దేశం ఆర్థికాభివృద్ధి, సామాజిక సంక్షేమ పథకాలను రూపొందించేందుకు వీలుకలుగుతుంది.
ఇదిలాఉంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం జనాభా లెక్కల సేకరణ ద్వారా మెజారిటీ, మైనారిటీ ప్రజల జనాభా పెరుగుదల తీరును అంచనా వేసేందుకు ప్రయత్నిస్తోందనే మాట వినిపిస్తోంది.
*చిత్రం...ఢిల్లీలో సోమవారం జన గణన భవన్‌కు శంకుస్థాపన చేస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా