జాతీయ వార్తలు

ఎన్‌ఆర్‌సీని ఉపేక్షించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, సెప్టెంబర్ 23: జాతీయ పౌర రిజిస్ట్రీ విషయంలో బీజేపీ నాయకత్వం బెంగాల్‌లో భయోత్పాతాన్ని సృష్టిస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్వరంతో ధ్వజమెత్తారు. ఎన్‌ఆర్‌సీ భయంతో ఇప్పటివరకు తమ రాష్ట్రంలో ఆరుగురు మరణించారని సోమవారం ఇక్కడ జరిగిన కార్మిక సంఘాల సభలో ఆమె అన్నారు. రాష్ట్రంలో ఎన్‌ఆర్‌సీ ప్రక్రియను అనుమతించేది లేదని తేల్చిచెప్పిన మమతా బెనర్జీ ‘ఒక్క పశ్చిమబెంగాల్‌లోనే కాదు, దేశంలో మరెక్కడా కూడా ఎన్‌ఆర్‌సీని కొనసాగనివ్వం. అస్సాం ఒప్పందం కారణంగానే దీనిని ఆ రాష్ట్రంలో నిర్వహించారు’ అని స్పష్టం చేశారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉన్న బీహార్‌లో కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్‌ఆర్‌సీని వ్యతిరేకిస్తున్నారని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఎన్‌ఆర్‌సీ విషయంలో బీజేపీ అంత పట్టుదలగా ఉంటే, తమ పాలనలో ఉన్న త్రిపురలో దీనిని ఎందుకు అమలు చేయడం లేదని మమతా బెనర్జీ ప్రశ్నించారు. త్రిపుర ముఖ్యమంత్రి విలాప్ దేవ్ పేరు కూడా ఈ జాబితాలో ఉండదన్న విషయం తెలియడం వల్లే బీజేపీ అక్కడ ఎన్‌ఆర్‌సీ ఊసు ఎత్తడం లేదని ఆమె తెలిపారు. 1985లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీకి, అఖిల అస్సాం విద్యార్థి యూనియన్‌కు మధ్య కుదిరిన ఒప్పందం వల్లే అంతకుముందు ఆరేళ్లపాటు సాగిన వలసదారుల వ్యతిరేక ఉద్యమం ఆగిందని మమతా బెనర్జీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. బెంగాల్‌లో ఎన్‌ఆర్‌సీకి సంబంధించి ప్రజల్లో బీజేపీ భయాన్ని సృష్టించే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని ఆమె అన్నారు. ‘ఇప్పటికే ఆరుగురు మరణించారు. నన్ను నమ్మండి. ఎన్‌ఆర్‌సీ బెంగాల్‌లో అమలయ్యే ప్రసక్తే ఉండదు. దీని విషయంలో బీజేపీ తప్పుడు వదంతులను, కథలను కట్టిపెట్టాలి’ అని మమత హెచ్చరించారు. ‘నా యోగ్యతా పత్రాలు అడుగుతున్నారు. అసలు వాళ్లెవరు? ఇనే్నళ్ల తర్వాత ఆ పత్రాలు, డాక్యుమెంట్లు నేను ఎక్కడి నుంచి తేగలుగుతాను. అవన్నీ ప్రకృతి వైపరీత్యాల్లో కొట్టుకుపోయి ఉండవచ్చు. మారిపోయి కూడా ఉండవచ్చు’ అని మమత ఈ సందర్భంగా పౌరసత్వ రిజిస్ట్రీపై చెలరేగుతున్న ఆందోళలను ప్రస్తావిస్తూ అన్నారు. దేశంలో ప్రజాస్వామ్య విలువలను బీజేపీ మంటగలుపుతోందని పేర్కొన్న ఆమె పశ్చిమబెంగాల్‌లో ప్రజాస్వామ్యం బలంగా ఉన్నా దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ప్రమాదానికి గురవుతోందని అన్నారు. ఒకపక్క నిరుద్యోగం పెరిగిపోతున్నా ఆర్థిక మాంద్యం తీవ్రమవుతున్నా పట్టని బీజేపీ తన రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడమే ధ్యేయంగా పనిచేస్తోందని మమత ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, మూసివేతలకు నిరసనగా వచ్చే నెల 18న ర్యాలీ నిర్వహిస్తామని ఆమె తెలిపారు. అందులో తానే స్వయంగా పాల్గొంటానని వెల్లడించారు. ఈనెల 26, 27 తేదీల్లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నగరంలో నిరసన ర్యాలీలు నిర్వహిస్తామని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసనలకు అత్యంత కీలకపాత్ర ఉందని పేర్కొన్న ఆమె ‘ప్రజావ్యతిరేక విధానాల పట్ల ప్రజలు తమ నిరసనగళాన్ని వ్యక్తం చేయకపోతే భారతదేశం భారతదేశంగానే ఉండే అవకాశం ఉండదు’ అని ఆమె అన్నారు.

*చిత్రం... బెంగాల్ సీఎం మమత