జాతీయ వార్తలు

కాశ్మీర్ లోయలో ఉగ్ర హెచ్చరికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, సెప్టెంబర్ 18: రాజ్యాంగంలోని 370-అధికరణను రద్దు చేసి జమ్మూ-కాశ్మీర్, లడక్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చిన తర్వాత అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొన్నదని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా, కాశ్మీర్ లోయలో పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. దుకాణాలకు ఉగ్రవాదులు ‘సీల్’ వేస్తున్నారు. వ్యాపారులు ఏమి చేయాలో, ఏమి చేయకూడదో ఉగ్రవాదులే ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ మేరకు హెచ్చరికల పోస్టర్లు వ్యాపారుల గోడలకు వెలుస్తున్నాయి. దీంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఇలాగైతే తాము బ్రతికేది ఎలా? అని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ ‘ఉగ్ర’ హెచ్చరికలపై అధికారికంగా మాట్లాడేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. ఒకరిద్దరు అనధికారికంగా నోరు మెదిపారు. వ్యాపారులు ఏమి చేయాలో, ఏమి చేయకూడదో ఉగ్రవాదులే ఆదేశిస్తూ వాల్ పోస్టర్లు అంటించడంతో ప్రజలు, వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారని వారు చెప్పారు. పరిస్థితులు చేయి దాటి పోరాదని వారన్నారు. దక్షిణ కాశ్మీర్‌లోని కుల్‌గామ్ జిల్లా, మోడ్రీగామ్ గ్రామంలో రెండు దుకాణాలకు నిషేధిత హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన ఉగ్రవాదులు ‘సీల్’ వేయడం స్థానికంగా కలకలం సృష్టించింది. పైగా ఉగ్రవాదులు హెచ్చరికతో ఓ వాల్ పోస్టర్‌ను అంటించి వెళ్ళారని పోలీసులు చెప్పారు. శ్రీనగర్‌లోని సివిల్ లైన్స్ ప్రాంతంలోని కరన్ నగర్ మార్కెట్‌లో ఇదే ఉగ్రవాదులు మరో రెండు దుకాణాలకు ‘ఎల్-డబ్ల్యు’ అని రాసి వెళ్ళారు. ‘ఎల్-డబ్ల్యు’ అంటే ‘లాస్ట్ వార్నింగ్’ (చివరి హెచ్చరిక) అని అర్థం అని పోలీసులు తెలిపారు. ఉగ్రవాదుల హెచ్చరికలను పెడ చెవిన పెట్టి వ్యాపారులు దుకాణాలు తెరుస్తున్నందుకే ఈ రకమైన హెచ్చరికలు జారీ అయ్యాయని పోలీసులు చెప్పారు. రాత్రి వేళల్లో పోలీసుల సంఖ్య, గస్తీ తక్కువగా ఉంటున్నందున ఉగ్రవాదులు చెలరేగిపోతున్నారన్న అనుమానాన్ని పోలీసు అధికారులు వ్యక్తం చేశారు. దుకాణాలు తెరిచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే తమకు, తమ దుకాణాల భద్రతకు ఎవరు గ్యారంటీ ఇస్తారని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. ఉగ్రవాదుల దృష్టిలో తాము ఎందుకు ఉండాలంటున్నారు. 370-అధికరణ రద్దు తర్వాత జమ్మూ-కాశ్మీర్, లడక్ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు లేవని వ్యాపారులు అంటున్నారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు, చిరు వ్యాపారుల దుకాణాలు మూసి ఉంటున్నాయి. దుకాణాలకు ‘సీల్’ వేసి, వాల్ పోస్టర్లు అంటిస్తున్న వారి పట్ల పోలీసులు ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదని ప్రజలు అంటున్నారు.
సరిహద్దుల్లో పాక్ కాల్పులు
భారత్-పాకిస్తాన్ సరిహద్దులోని సాంబ-కత్వా సెక్టార్‌లో పాక్ భద్రతా బలగాలు బుధవారం కాల్పులు జరిపాయి. దీనిని భారత్ భద్రతా బలగాలు తిప్పి కొట్టాయని బీఎస్‌ఎఫ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ కాల్పుల్లో ఎవరూ మరణించలేదని, గాయపడలేదని ఆయన చెప్పారు. పాక్ రేంజర్స్ మళ్లీ దాడులకు తెగబడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు ఇదివరకే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు.