జాతీయ వార్తలు

ఇది కేవలం ట్రైలరే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ: అవినీతి ఉగ్రవాదాన్ని పూర్తి స్థాయిలో అణచివేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అలాగే జమ్మూకాశ్మీర్‌ను అభివృద్ధి పథంలో కొత్త పుంతలు తొక్కిస్తామని పేర్కొన్న ఆయన ఈ వంద రోజుల పాలనలో దేశహితానికి దోహదం చేసే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ‘ఈ వంద రోజుల పాలనన్నది కేవలం ట్రైలర్ మాత్రమే. పూర్తి సినిమాను రానున్న రోజుల్లో చూస్తారు’అని తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరంపైన కూడా పరోక్షంగా విమర్శలు గుప్పించిన మోదీ ‘గతంలో కొందరు వ్యక్తులు తాము చట్టానికి, కోర్టులకు అతీతులమని భావించేవారు. ఇప్పుడా వ్యక్తులు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇంకొందరైతే ఏకంగా జైలుకే వెళ్లారు’ అని మోదీ అన్నారు. అంకిత భావంతో దేశాభివృద్ధికి కృషిచేయడమే తమ ఆశయమని పేర్కొన్న మోదీ ఇంత వేగవంతమైన ప్రగతి గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు. ఈ వందరోజుల్లో తాము తీసుకున్న ప్రతి నిర్ణయం దేశ ప్రయోజనాలకు, మహిళల భద్రతకు ఎంతగానో దోహదం చేసేదే అన్నారు. గురువారం నాడు ఇక్కడ జగన్నాధ మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన మోదీ, తాము రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పార్లమెంట్ తొలి సమావేశంలోనే ట్రిపుల్ తలాక్ బిల్లును ఆమోదించి ముస్లిం మహిళలకు పూర్తి భద్రత కల్పించామన్నారు. జమ్మూకాశ్మీర్, లడఖ్ ప్రాంతాల అభివృద్ధికి విస్తృతంగా కృషి చేస్తామని, తమ ప్రభుత్వం మొదటి వందరోజుల్లోనే ఇందుకు సంబంధించిన ప్రయత్నాలు మొదలయ్యాయని మోదీ తెలిపారు. జార్ఖండ్‌లో పరిపాలన అంటే గతంలో కుంభకోణాల మయంగా ఉండేదని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొత్తం పరిస్థితి మారిపోయిందని మోదీ తెలిపారు. తమ ముఖ్యమంత్రి రఘువీర్ దాస్ పాలనలో అంత పారదర్శకత కనిపిస్తోందని పేర్కొన్నారు. ఈ ఏడాది చివర్లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా మోదీ తాజా సభకు రాజకీయ ప్రాధాన్యత చేకూరింది. గత ఏడాది కాలంలోనే దేశ వ్యాప్తంగా 44 లక్షల మంది ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం ద్వారా ప్రయోజనం పొందారని మోదీ గుర్తు చేశారు. ప్రపంచంలోని అతిపెద్ద ఈ ఆరోగ్య పథకాన్ని గత ఏడాది తాను జార్ఖండ్ నుంచే ప్రారంభించానని అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద దేశ వ్యాప్తంగా 2 కోట్ల ఇళ్లను నిర్మించామని, మరో 2 కోట్ల ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయని మోదీ చెప్పారు. అలాగే అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం పెన్షన్ పథకాన్ని కూడా ప్రవేశ పెట్టామని, గిరిజన విద్యార్థుల చదువు కోసం ఏటా లక్ష రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతుందని చెప్పారు. ఈ సందర్భంగా జార్ఖండ్ అసెంబ్లీ కొత్త భవనాన్ని, అలాగే కార్గో టెర్మినల్‌ను మోదీ ప్రారంభించారు. ప్రధానమంత్రి కిసాన్ మాన్‌గన్ యోజనను ప్రారంభించిన మోదీ 60 ఏళ్లు వచ్చిన పేద రైతులు ఈ పథకం ద్వారా నెలకు 3 వేల రూపాయలు పెన్షన్‌గా పొందుతారని తెలిపారు. అయితే 18 నుంచి 40 సంవత్సరాల వయస్సు గలిగిన రైతులు కూడా దీనికింద పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు. అలాగే చిన్న వ్యాపారస్తుల కోసం, స్వయం ఉపాథి కల్పించుకున్న యువత కోసం స్వరోజ్‌గార్ అనే మరో పెన్షన్ పథకాన్ని మోదీ ప్రారంభించారు. ఈ రెండు పథకాల కింద లబ్దిదారులకు నెలకు 3వేల రూపాయల పెన్షన్ వస్తుందని అన్నారు. ఆన్‌లైన్ ద్వారా కార్గో టెర్మినల్‌ను కూడా ప్రారంభించిన మోదీ, దీనివల్ల జార్ఖండ్‌కు ఎంతగానో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. దీంతో పాటు దేశవ్యాప్తంగా 462 ఏకలవ్య మోడల్ స్కూళ్లకు కూడా ఆన్‌లైన్ ద్వారా ఆయన శంకుస్థాపన చేశారు. వీటిలో 13 పాఠశాలలు జార్ఖండ్‌లోనే ఏర్పాటు అవుతాయి.

*చిత్రం...ప్రధాని నరేంద్ర మోదీ