జాతీయ వార్తలు

జైట్లీ కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 24: భారతీయ జనతా పార్టీ నిరుపమాన దక్షుడైన మరో సీనియర్ నాయకున్ని కోల్పోయింది. సుష్మా స్వరాజ్ కన్నుమూసి కొన్ని వారాలు కూడా తిరగక ముందే బీజేపీకి వెన్నుదన్నుగా నిలిచిన సీనియర్ నాయకుడు, అనేక విప్లవాత్మక సంస్కరణలకు ఆద్యుడు అరుణ్ జైట్లీ (66) తుదిశ్వాస విడిచారు. నాలుగు దశాబ్దాల పాటు జాతీయ రాజకీయాల్లో క్రీయాశీలక భూమిక పోషించిన ఆయన జనధన్ యోజన, జీఎస్‌టి వంటి అనేక విప్లవాత్మక సంస్కరణలకు నాంది పలికారు. గత కొన్ని నెలలుగా తీవ్ర ఆరోగ్య సమస్యలతో పోరాడిన ఆయన శనివారం మధ్యాహ్నం 12.07 గంటలకు తుది శ్వాస విడిచారని ఏయిమ్స్ ఒక ప్రకటనలో తెలిపింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో ఈ నెల 9న జైట్లీని ఆసుపత్రిలో చేర్చారు. గత ఏడాది మే 14న ఏయిమ్స్‌లోనే ఓ కీలక చికిత్స చేయించుకున్న జైట్లీ ఆరోగ్యం క్షీణిస్తూనే వచ్చింది. మంత్రిగా ఉన్న సమయంలోనే తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనకు క్యాన్సర్
కూడా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయనకు బ్యారియాట్రిక్ సర్జరీ కూడా జరిగింది. కొంత మేర బరువు తగ్గినప్పటికీ మధుమేహం వల్ల బరువు పెరిగారు. గత కొన్ని రోజులుగా జైట్లీని ప్రాణాధార వ్యవస్థలపైనే ఉంచామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. జైట్లీ భౌతికకాయాన్ని దక్షిణ ఢిల్లీలోని ఆయన ఇంటికి తీసుకెళ్ళారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సహా బీజేపీ నేతలు విపక్షాలకు చెందిన నాయకులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆదివారం అంతిమ యాత్రకు ముందు ప్రజల దర్శనార్థం జైట్లీ భౌతికకాయాన్ని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఉంచుతారు. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యక్తిగతంగా అత్యంత సన్నిహితుడైన జైట్లీ ఆయన రాజకీయంగా ఎదగడంలోనూ క్రియాశీలకంగా తోడ్పడ్డారు. అలాగే భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో తిరుగులేని స్థాయి సంతరించుకోవడం వెనుక జైట్లీ నిరూపమానమైన రాజకీయ చాణక్యం కనిపిస్తున్నది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అనారోగ్యం కారణంగానే జైట్లీ పోటీ చేయలేదు. వరుసగా నాలుగోసారి ఆయన రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 2000 సంవత్సరంలో రాజ్యసభలో అడుగు పెట్టిన ఆయన వరుస విజయాలు సాధించారు. ప్రతిపక్ష నాయకునిగా, సభా నాయకునిగా అద్భుతమైన వాక్‌పటిమను కనబరిచారు. ఆయన అంత్యక్రియలు నిగం బోధ్‌లో ఆదివారం మధ్యాహ్నం జరుగుతాయి. కీలక సమస్యలపై ఏకాభిప్రాయాన్ని సాధించడంలో కీలక భూమిక పోషించిన జైట్లీ బీజేపీకి అన్ని విధాలుగా వెన్నుదన్నుగా నిలిచారు. 2014లో తొలిసారి మోది అధికారంలోకి వచ్చినప్పుడు రక్షణ, ఆర్థిక మంత్రిగా పని చేశారు. బీజేపీలో నరేంద్ర మోదీ ఎదుగుదలకు ఎంతగానో దోహదం చేసిన జైట్లీ ఎన్డీఏ కూటమికి మిత్రపక్షాలను ఆర్జించి పెట్టడంలోనూ కీలక భూమిక పోషించారు. దేశ చరిత్రలో అత్యంత కీలకమైన ఎన్నో ఆర్థిక సంస్కరణలకు జైట్లీ సూత్రధారి అయ్యారు. ముఖ్యంగా పన్నుల వ్యవస్థను ఒకే చట్టం కిందకు తెస్తూ జీఎస్‌టీని అమలులోకి తెచ్చారు. న్యాయవాదిగా కూడా అపారమైన అనుభవం కలిగిన జైట్లీ దీర్ఘకాలంగా అమలులోకి నోచుకోని ఎన్నో సంస్కరణలను ఆచరణలోకి తెచ్చారు. రక్షణ రంగంలో భారత దేశ స్వయం సమృద్ధికి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్న ఆయన న్యాయవాదిగా కూడా నిరూపమానమైన ఖ్యాతిని ఆర్జించారు. వాజ్‌పేయ్, అద్వానీ శకానికి చెందిన ఆయన నరేంద్ర మోదీ అధిపత్యం కొనసాగుతున్న ప్రస్తుత బీజేపిలోనూ ఇముడుకోగలిగారు. జైట్లీ సమకాలికురాలైన సష్మా స్వరాజ్ కన్నుమూసి కొన్ని రోజుల్లోనే ఓ సీనియర్ నాయకున్ని కోల్పోవడం బీజేపీని కుదిపేసింది. మోదీ సర్కారు చేపట్టిన అనేక కీలక నిర్ణయాలపై ప్రతిపక్షాలను సైతం ఒప్పించి వాటి మద్దతును సంపాదించిన జైట్లీ రాజకీయ విధేయతకు అతీతంగా అన్ని పార్టీలకు సన్నిహితునిగా కొనసాగారు. జైట్లీ మృతి జాతీయ రాజకీయాలకు తీరని నష్టం అని ఆయన మరణంతో విలువలతో కూడిన రాజకీయ శకం మరో ఘనమైన నాయకున్ని కోల్పోయిందని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు నివాళులర్పించారు.
చిత్రం...అరుణ్ జైట్లీ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన కుటుంబ సభ్యులను ఓదారుస్తున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్