జాతీయ వార్తలు

సైద్ధాంతిక పోరు కొనసాగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 22: గతంలో రాజీవ్‌గాంధీకి కూడా దేశ ప్రజలు తిరుగులేని రీతిలో అధికారాన్ని కట్టబెట్టారని.. అలాంటి సమయంలో ఆయన భయభ్రాంతులను చేసే చర్యలకు పాల్పడలేదని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. తన చేతికొచ్చిన అధికారాన్ని భయాన్ని సృష్టించేందుకు, ప్రజలను బెదిరించేందుకు అలాగే, రాజ్యాంగ సంస్థలను నీరుగార్చేందుకు రాజీవ్‌గాంధీ ఎప్పుడూ ఉపయోగించుకోలేదని అన్నారు. రాజీవ్‌గాంధీ 75వ జయంతి సందర్భంగా గురువారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన సోనియా.. మోదీ సర్కారుపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఎన్నడూ లేని రీతిలో కాంగ్రెస్ అత్యంత తీవ్రమైన సవాళ్లు ఎదుర్కొంటోందని, అయినప్పటికీ విచ్ఛిన్నకర శక్తులకు వ్యతిరేకంగా సైద్ధాంతిక పోరాటాన్ని కొనసాగించి తీరాలని ఉద్ఘాటించారు. ‘1984లో రాజీవ్‌గాంధీకి దేశ ప్రజలు అఖండ మెజారిటీ కట్టబెట్టారు. దానిని ఆయన ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదు. ప్రజలను భయపెట్టలేదు’ అని సోనియా అన్నారు. పార్టీ పగ్గాలు చేపట్టిన తరువాత సోనియా చేసిన తొలి బహిరంగ ప్రసంగమిది. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పీ చిదంబరాన్ని పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో సోనియా వ్యాఖ్యలకు మరింత రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను వ్యక్తిగత కక్ష సాధింపులకు కేంద్రం వినియోగించుకుంటోందని.. కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. 1989లో కాంగ్రెస్‌కు సొంతంగా మెజారిటీ రాలేదని రాజీవ్‌గాంధీ చాలా హుందాగా ప్రజాతీర్పును అంగీకరించారని సోనియా గుర్తు చేశారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీయే అత్యధిక సీట్లను గెలుచుకొన్నప్పటికీ సొంతంగా మెజారిటీ రాలేదు కాబట్టి రాజీవ్‌గాంధీ అధికారాన్ని కోరుకోలేదని సోనియా చెప్పారు. అందుకు కారణం ఆయన నైతిక శక్తి, నిజాయితీయేనని అభివర్ణించారు. తన భర్త 75వ జయంతి ఓ లాంఛనం కాదని.. ఆయన్ను గుర్తు చేసుకొనేందుకు ఆయన పాదుకొల్పిన విలువలను పాటించేందుకు లభించిన ఓ గొప్ప అవకాశమని తెలిపారు. ఏ లక్ష్యాలను అయితే రాజీవ్‌గాంధీ సాధించాలని అనుకొన్నారో వాటిని ఈడేర్చుకొనేందుకు కాంగ్రెస్ శ్రేణులు బలంగా ముందుకు సాగాలన్నారు. ఈ విలువలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్న శక్తులను ఉమ్మడిగా ఎదుర్కోవాలని సోనియా ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఎన్నికల్లో గెలుపు ఓటమిలు అనివార్యం అని పేర్కొన్న ఆమె.. ప్రస్తుతం కాంగ్రెస్ ఎదుర్కొంటున్న సవాళ్లు అత్యంత బలీయమని తెలిపారు. అయినప్పటికీ వెనుకంజ వేయకుండా పార్టీ శ్రేణులు సైద్ధాంతిక నిబద్ధతతో పోరాటం సాగించాలన్నారు. ప్రస్తుతం సమాజాన్ని విచ్ఛిన్నకర శక్తులు ధ్వంసం చేస్తున్నాయని.. రాజ్యాంగం ప్రవచించిన భారతీయత అన్న భావానికి వీటివల్ల విఘాతం కలుగుతోందని సోనియా తెలిపారు. రాజీవ్‌గాంధీ ప్రవచించిన విలువలకు కట్టుబడి ఉండడమే ఈ 75వ జయంతి సందర్భంగా ఆయనకు అందించే ఘన నివాళి అవుతుందని సోనియా తెలిపారు.
ఢిల్లీలోని కేడీఝాదవ్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో అనేకమంది సీనియర్ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించారు.
చిత్రం...రాజీవ్ గాంధీ జయంతి సభలో మాట్లాడుతున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా