జాతీయ వార్తలు

చర్చలు జరిగితే పీఓకేపైనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్కా (హర్యానా), ఆగస్టు 18: ఉగ్రవాదులకు మద్దతు పలకడం, ఉగ్రవాద చర్యలను పెంచి పోషించే విధానాలను మానుకునేవరకు పాకిస్తాన్‌తో ఎలాంటి చర్చలకు దిగేది లేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో పాకిస్తాన్‌తో చర్చలేమన్నా జరపాలంటే అది కేవలం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) పైనేనని ఆయన స్పష్టం చేశారు. హర్యానాలో ఈ ఏడాది అక్టోబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆదివారం ఇక్కడ నిర్వహించిన బీజేపీ జన్ ఆశీర్వాద్ యాత్రను జెండా ఊపి ఆయన ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. జమ్మూకాశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370 అధికరణను కేంద్ర రద్దు చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ ఆందోళన చెందుతోందని ఆయన అన్నారు. ‘తమకు సహాయం చేయమని పాకిస్తాన్ ఇపుడు వివిధ దేశాలను అభ్యర్థిస్తోంది. మేమేమైనా నేరం చేశామా? మమల్ని బెదిరించాలని (పాక్) ప్రయత్నిస్తోంది. ప్రపంచంలోని అగ్రదేశం అమెరికా సైతం కాశ్మీర్‌పై భారత్ తీసుకున్న నిర్ణయాన్ని చర్చలతోనే పరిష్కరించుకోవాలని పాకిస్తాన్‌కు మొట్టికాయ వేస్తూ స్పష్టం చేసింది’ అని ఆయన అన్నారు. అసలు ఏ అంశంపై, ఎందుకు వాళ్ల (పాక్)తో తాము మాట్లాడాలి అని రక్షణ మంత్రి హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, క్రిషన్ పాల్ గుర్జార్,
రత్తన్ లాల్ కటారియాతోపాటు పలువురు రాష్ట్ర మంత్రులు, బీజేపీ ఎమ్మెల్యేలు పాల్గొన్న కార్యక్రమంలో మాట్లాడుతూ తీవ్ర స్వరంతో అన్నారు. పాకిస్తాన్ ప్రజలు సైతం భారత్-పాక్ మధ్య చర్చలు జరగాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ‘దేని గురించి మేం మాట్లాడాలి? ఏ అంశంపై మేం మాట్లాడాలి? అసలు ఎందుకు వాళ్లతో మాట్లాడాలి? ఒకవేళ వాళ్లతో మాట్లాడాల్సిన అవసరం వచ్చిందంటే ఉగ్రవాదులకు పాకిస్తాన్ గడ్డ నుంచి మద్దతును ఉపసంహరించుకున్నపుడే జరుగుతుంది’ అని ఆయన స్పష్టం చేశారు. దేశ శ్రేయస్సు కోసం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది ప్రజలందరి బాగోగులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చేపడుతుందని, కానీ ఇది ఎన్నికల స్టంట్ మాత్రం కాదని ఆయన అన్నారు. ఉగ్రవాదం ద్వారా భారత్‌ను అస్థిరపరచాలని పాకిస్తాన్ యోచిస్తోందని, కానీ వారి ఆగడాలు, ఎత్తుగడలకు ఎలాంటి సమాధానం ఇవ్వాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బాగా తెలుసునని ఆయన పేర్కొన్నారు. పుల్వామాలో ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉగ్ర స్థావరాలపై భారత వైమానిక దాడులు జరపడమే ఆ దేశానికి సరైన సమాధానమని ఆయన పేర్కొన్నారు. ఇదిలావుండగా, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ భారత్ బాలాకోట్‌ను మించిన దాడులకు ప్రయత్నిస్తోందని చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ మాట్లాడుతూ బాలాకోట్‌పై దాడులను అంగీకరించినట్టేనని అన్నారు.

చిత్రం...హర్యానాలోని కల్కాలో ఆదివారం బీజేపీ జన్ ఆశీర్వాద్ యాత్రను ప్రారంభిస్తున్న రాజ్‌నాథ్ సింగ్