జాతీయ వార్తలు

కుప్పకూలిన కుమార సర్కార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జూలై 23: కర్నాటక రాజకీయాల్లో గత వారం రోజులుగా చోటు చేసుకున్న హైడ్రామాకు తెర పడింది. మంగళవారం అసెంబ్లీలో విశ్వాస పరీక్షపై జరిగిన ఓటింగ్‌లో 14 నెలల కుమార స్వామి ప్రభుత్వం పతనమైంది. అధికార కాంగ్రెస్-జేడీ(ఎస్) కూటమికి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామాతో మూడు వారాల క్రితం మొదలైన కర్నాటకం ఎప్పటికప్పుడు కొత్త మలుపులు తిరుగుతూ దేశ వ్యాప్తంగా ఉత్కంఠను రేకెత్తించింది. ముఖ్యమంత్రి కుమార స్వామి ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లో అధికార కూటమికి అనుకూలంగా 99, వ్యతిరేకంగా 105 ఓట్లు వచ్చాయి. అనంతరం కాంగ్రెస్-జేడీ(ఎస్) ప్రభుత్వం పతనమైందని స్పీకర్ రమేష్ కుమార్ ప్రకటించారు. సభలో రెండు రోజులుగా ఈ విశ్వాస తీర్మానంపై ఎడతెగని రాద్ధాంతం మధ్య చర్చ జరిగింది. ఈ చర్చకు సమాధానం ఇచ్చిన కుమారస్వామి నేటి పరిణామాలను ఉదాసీనంగా చూస్తూనే ఉండిపోయారు. రెబెల్ ఎమ్మెల్యేలను బలవంతంగా అసెంబ్లీకి రప్పించడానికి వీల్లేదంటూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మొత్తం పరిస్థితి ప్రతిపక్ష బీజేపీకి అనుకూలంగా మారింది. రెబెల్ ఎమ్మెల్యేలను బుజ్జగించి తిరిగి రప్పించుకునేందుకు కుమార స్వామి చేసిన ప్రయత్నాలేవీ చివరి వరకూ ఫలించలేదు. ఈ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి హాజరయ్యే విషయంలో మొండికి వేయడంతో ఒక దశలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి కూడా కుమార స్వామి సిద్ధపడ్డారు. నేటి అసెంబ్లీ సమావేశానికి కాంగ్రెస్-జేడీ(ఎస్)కు చెందిన 17 మంది, బీఎస్‌పీకి చెందిన ఒక సభ్యుడు, ఇద్దరు ఇండిపెండెంట్లు గైర్హాజర్ అయ్యారు. తాను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా తన ప్రభుత్వాన్ని కుప్పకూల్చడమే పనిగా బీజేపీ ప్రయత్నిస్తూ వచ్చిందని కుమార స్వామి విమర్శించారు. తన రాజకీయ ప్రవేశం కూడా ఆకస్మికంగా, అనూహ్యంగానే జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు.
ఒకవేళ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఎంతో కాలం ఉండదని తాజాగా ఎన్నికలకు వెళ్ళడమే మంచిదని ఆయన అన్నారు. బీజేపీకి తొలి పరీక్ష మంత్రివర్గం ఏర్పాటుతోనే మొదలవుతుందన్నారు. తాము ఎంత మాత్రం అధికారాన్ని పట్టుకుని వెళ్ళాడలేదని, రాష్ట్ర ప్రజలకు నిజాయితీతో కూడిన పాలనను అందించేందుకే ప్రయత్నించానని ఆయన తెలిపారు. అసెంబ్లీలో జరిగిన చర్చకు స్పూర్తిదాయకమైన రీతిలోనే జవాబు ఇచ్చిన కుమారస్వామి అడుగడుగునా బీజేపీ అధికారకాంక్షను ఎండగట్టారు. తనను ఎందుకు తొలగించారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని, సమాధానం తర్వాత తాను వెళ్ళిపోయే ప్రసక్తి లేదన్నారు. అటు కాంగ్రెస్, ఇటు జేడీ(ఎస్) సభ్యులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించినప్పటికీ అడపాదడపా స్పందించడం తప్ప ఈ చర్చలో బీజేపీ పెద్దగా పాల్గొనలేదు.
రాష్ట్రంలో అధికారం కోసం బీజేపీ ఎమ్మెల్యేలను టోకుగా కొనే ప్రయత్నం చేసిందని, దొడ్డి దారిన వారిని ఆకట్టుకుందని కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య ఆరోపించారు. ఎమ్మెల్యేలను ఆకట్టుకోవడానికి 25 నుంచి 30 కోట్లు ఆఫర్ చేశారని పేర్కొన్న ఆయన అసలు బీజేపీకి ఇంత డబ్బు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఓటింగ్ అనంతరం కుమార స్వామి ప్రభుత్వం పతనం కావడంతో విజయోత్సవంతో మాట్లాడిన బీజేపీ నాయకుడు యెడ్యూరప్ప ‘ఇది ప్రజాస్వామ్య విజయం. కుమార స్వామి ప్రభుత్వ పాలనలో ప్రజలు విసుగెత్తిపోయారు..’ అని ఆయన అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో కొత్త అభివృద్ధి శకాన్ని ఆవిష్కరిస్తుందన్నారు. సాధ్యమైనంత త్వరలోనే ఇందుకు సంబంధించి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.
ఇదిలాఉండగా అనర్హత అభ్యర్థనకు సంబంధించి తమకు నాలుగు వారాల గడువు ఇవ్వాలని రెబెల్ ఎమ్మెల్యేలు స్పీకర్ రమేష్ కుమార్‌ను అభ్యర్థించారు. అడ్వకేట్ ద్వారా తాము ఈ మేరకు స్పీకర్‌ను సంప్రదించామన్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలందరినీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హులుగా ప్రకటించాలని కాంగ్రెస్-జేడీ(ఎస్) కూటమి డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా మంగళవారం అసెంబ్లీలో జరిగిన ఓటింగ్‌లో కుమార స్వామి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలన్న ఆదేశాన్ని బేఖాతరు చేసినందుకు తమ పార్టీ ఎమ్మెల్యే ఎఎం మహేశ్‌పై బీఎస్పీ అధినేత్రి మాయావతి బహిష్కరణ వేటు వేశారు.
దేశ వ్యాప్తంగా నిరసనలు..
దేశ చరిత్రలో ఎన్నడూ లేనంత హేయమైన స్థాయిలో కర్నాటకలో ఎమ్మెల్యేల కొనుగోళ్ళు జరిగాయని కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. దీనికి నిరసనగా దేశ వ్యాప్తంగా ధర్నాలు చేపడతామని ఢిల్లీలో ప్రకటించింది. ఈ పరిణామాలపై మాట్లాడిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కర్నాటక వ్యవహారాల ఇన్‌ఛార్జీ కేసీ వేణుగోపాల్ ‘కేంద్ర ప్రభుత్వ ప్రోద్బలంతోనే కర్నాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని పతనం చేశారు, ఇందులో రాష్ట్ర గవర్నర్, మహారాష్ట్ర ప్రభుత్వం, బీజేపీ నాయకత్వానికి ప్రమేయం ఉంది..’ అని అన్నారు.
కుమార స్వామి రాజీనామా.. ఆమోదం
అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో ఓడిపోయిన ముఖ్యమంత్రి కుమార స్వామి రాజ్‌భవన్‌కు వెళ్ళి గవర్నర్ వాజుబాయ్ వాలాకు రాజీనామా లేఖ అందించారు. దానిని వెంటనే గవర్నర్ ఆమోదించారు. అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగేంత వరకూ అపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కుమార స్వామిని కోరారు.
చిత్రం...అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో ఓడిపోయన అనంతరం గవర్నర్ వాజుభాయ్ వాలాను కలిసి
రాజీనామా సమర్పిస్తున్న కర్నాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి